ఎన్డీయేకు బాబు మరింత కీలకం...మ్యాటర్ వెరీ సింపుల్ !
ఇక చూస్తే ఒక పక్క రాజ్యాంగ సవరణ చేయాల్సిన బిల్లులతో బీజేపీ పెద్దలు కసరత్తు చేస్తున్నారు. డీ లిమిటేషన్ బిల్లు చట్టంగా మార్చడం ఒక తక్షణ అవసరంగా ఉంది.
By: Satya P | 16 Sept 2026 7:41 AM ISTకేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వానికి చంద్రబాబు మరింత కీలకం కానున్నారు. నిజానికి ఎన్డీయే ప్రభుత్వం ఊపిరి అంతా ఏపీలో 16 మంది టీడీపీ ఎంపీల మీద ఆధారపడి ఉంది అన్నది ఒక కఠినమైన విశ్లేషణ. బీజేపీకి 2024 ఎన్నికల్లో సీట్లు 240 దాకా వచ్చి ఆగిపోయాయి. మ్యాజిక్ ఫిగర్ కి 32 సీట్లు తక్కువ పడ్డాయి. దాంతో ఆ లోటుని ఏపీలో చంద్రబాబు టీడీపీ ఎంపీలతో పాటు బీహార్ లోని నితీష్ కుమార్ నాయకత్వంలోని జేడీయూ ఎంపీలు భర్తీ చేస్తూ వచ్చారు. ఇక చిన్న పార్టీలు మరి కొన్ని కలయికతో ఇది పూర్తి ఎన్డీయే ప్రభుత్వంగా 2024లో ఏర్పాటు అయింది. అయితే ఇపుడు నితీష్ కుమార్ జేడీయూ కొంత తేడా పాటిస్తోంది అని అంటున్నారు. ఉమ్మడి పౌర స్మృతి యూసీసీని బాహాటంగా జేడీయూ వ్యతిరేకించి విపక్షాలకు ఒక ఆయుధాన్ని ఇచ్చింది. దాంతో ఎక్కడో ఏదో జరుగుతోంది అన్న చర్చ అయితే జాతీయ స్థాయిలో చోటు చేసుకుంటోంది.
రాజ్యాంగ సవరణ బిల్లులతో :
ఇక చూస్తే ఒక పక్క రాజ్యాంగ సవరణ చేయాల్సిన బిల్లులతో బీజేపీ పెద్దలు కసరత్తు చేస్తున్నారు. డీ లిమిటేషన్ బిల్లు చట్టంగా మార్చడం ఒక తక్షణ అవసరంగా ఉంది. అలాగే మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం తీసుకుని 2029 లో దాని ప్రకారం మూడవ వంతు సీట్లు మహిళలకు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ రెండూ బీజేపీకి రాజకీయంగా వ్యూహాత్మకంగా పనిచేసే ఆయుధాలుగా చెబుతున్నారు. వీటిని ఆమోదించుకుని 2029 ఎన్నికలకు వెళ్తే కనుక తిరుగులేదని మరో సారి అధికారం తధ్యమని భావిస్తోంది. దాని కోసం బీజేపీ పెద్దలు మెజారిటీ కూడగడుతున్న వేళ ఎన్డీయేలో కీలక మిత్రుడు జేడీయూ భిన్న స్వరం వినిపించడం మాత్రం కమలనాధులను కలవరపెడుతోంది అని అంటున్నారు.
సున్నితమైన ఇష్యూతోనే :
బీజేపీ అమ్ములపొదిలో ఉమ్మడి పౌర స్మృతి ఎప్పటి నుంచో ఉంది. ఇంతటి సున్నితమైన అంశాన్ని అమలు చేయాలంటే బీజేపీ మిత్రులను పరిగణలోకి తీసుకోవాలని అంటున్నారు. అయితే లేటెస్ట్ గా చూస్తే ఎన్డీయే పాలనలో ఉన్న 21 రాష్ట్రాల్లో 2029 నాటికి ఉమ్మడి పౌర స్మృతిని అమలు చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. దాంతోనే జేడీయూ గట్టిగా విభేదిస్తోంది. తాము కూడా బీహార్ ప్రభుత్వంలో భాగస్వాములమని కూడా హెచ్చరిస్తోంది. ఈ నేపధ్యంలో ఇపుడు అందరి దృష్టి ఏపీ మీద పడింది అని అంటున్నారు. ఈ విషయంలో ఏపీలో చంద్రబాబు ఆయన టీడీపీ ఏమి చేస్తాయి అన్నది కూడా అంతా ఆలోచిస్తున్న విషయంగా ఉంది.
మెజారిటీ ఉంది కానీ :
అయితే బీహార్ విషయంలో చూస్తే జేడీయూతో సంబంధం లేకుండా బీజేపీకి మెజారిటీ ఉంది. దాంతో ఇతర మిత్రులను కలుపుకుని ముందుకు వెళ్ళగలదు, అయితే విషయం అది కాదు జేడీయూ నుంచి వచ్చిన వ్యతిరేకత అని అంటున్నారు. జేడీయూ ఈ విధంగా వ్యతిరేకించడానికి కేవలం యూసీసీ ఇష్యూ ఒక్కటేనా లేదా ఇతర విషయాలు ఏమైనా ఉన్నాయా అన్నదే ఇపుడు కేంద్రంలోని ఎన్డీయే పెద్దలను వేధిస్తున్న ప్రశ్నగా చెబుతున్నారు. ఆ మాటకు వస్తే జేడీయూ తీరు మొదటి నుంచి కొంత తేడాగానే ఉంది అని అంటున్నారు. ఆ మధ్య కూడా నితీష్ కుమార్ ని ఉప ప్రధాని చేయాలని ఆ పార్టీ డిమాండ్ చేసింది. ఇలా అనేక విషయాల మీద తమ వైఖరి ఇదని స్పష్టం చేస్తూ వస్తోంది. అయితే ఏపీలో టీడీపీ అలా కాదు ఎన్డీయే మీద ఏ రకమైన వ్యతిరేక వ్యాఖ్యను ఇప్పటిదాకా చేయలేదని గుర్తు చేస్తున్నారు. దాంతో జేడీయూ ఇలా గొంతు పెంచిన వేళ చంద్రబాబు పాత్ర ఎన్డీయేలో మరింత కీలకం అవుతోంది అని అంటున్నారు.
బాలెన్స్ చేసుకుంటూనే :
ఇక యూసీసీ విషయంలో కూడా అందరినీ బాలెన్స్ చేసుకుంటూ టీడీపీ ముందుకు వెళ్తుందని అంటున్నారు. అదే సమయంలో బీజేపీకి దూరంగా జరగడం చేయదని అంటున్నారు. కీలక మిత్ర పక్షాలు రెండింటిలో జేడీయూ కంటే టీడీపీ విలువ గౌరవం ఇంకా ఎక్కువగా ఎన్డీయేలో పెరుగుతుంది అని అంటున్నారు. ఎన్డీయేకు నమ్మకం అయిన మిత్రుడిగా చంద్రబాబు టీడీపీ బలంగా ఉన్నారని కూడా అంటున్నారు. రానున్న కాలంలో అంటే 2029 ఎన్నికలు దగ్గరపడే కొద్దీ ఎన్డీయేలో బాబు రాజకీయ ప్రధాన్యత పెరగడం ఖాయమని అంటున్నారు.
