ఎన్డీయే కూటమి ఫ్యూచర్ పై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు!
ఏపీలో రెండోసారి, కేంద్రంలో వరుసగా మూడోసారి ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 11 Jun 2025 11:35 AM ISTఏపీలో రెండోసారి, కేంద్రంలో వరుసగా మూడోసారి ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే.. మూడోసారి కేంద్రంలో ఎన్డీయే కూటమి అధికారంలోకి రావడంతో ఏపీలో టీడీపీ పాత్ర కీలకంగా మారింది. దీంతో.. హస్తినలో చంద్రబాబుకు గౌరవం, ప్రాధాన్యత మరింతగా పెరిగాయని అంటున్నారు. ఈ సమయంలో టీడీపీ - బీజేపీ అలయన్స్ పై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
అవును... టీడీపీ - బీజేపీ కలిసి చేసిన ప్రయాణం ఎప్పుడూ సక్సెస్ అనే చెప్పాలి. ఈ రెండు పార్టీలూ కలిసి కూటమిగా పోటీ చేస్తే కచ్చితంగా విజయం సాధించేవారు. ఇక ఈ సారి ఎన్డీయే కూటమిలో జనసేన కూడా జాయిన్ అయ్యింది. దీంతో.. ఏపీలో కూటమి బలం మరింత పెరిగిందని అంటున్నారు. ఈ నేపథ్యంలో 2029 తర్వాత కూడా టీడీపీ - బీజేపీ కూటమి ఉంటుందా అనే ప్రశ్నకు చంద్రబాబు ఆసక్తికరంగా స్పందించారు.
నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీయే) మూడోసారి అధికారంలోకి వచ్చి ఏడాది కాలం పూర్తైన సందర్భంగా చంద్రబాబు తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా మోడీ నాయకత్వంపైనా ప్రశంసల జల్లులు కురిపించారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థ 10వ స్థానం నుండి నాల్గవ స్థానానికి మారిందని అన్నారు. గత 11 సంవత్సరాలుగా ఎన్డీయే ప్రభుత్వం చాలా బాగా పనిచేస్తోందని తెలిపారు.
ఇదే సమయంలో... మరో రెండు సంవత్సరాలలో, భారతదేశం మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుందని.. అప్పుడే చైనా, అమెరికాతో నిజమైన పోరాటం ప్రారంభమవుతుందని చంద్రబాబు తెలిపారు. అయితే.. నరేంద్ర మోడీ నాయకత్వంలో ప్రతిదీ సాధ్యమేనని అన్నారు. రాబోయే 20 సంవత్సరాలు భారతదేశానికి, భారతీయులకు చాలా స్ఫూర్తిదాయకంగా ఉండబోతున్నాయని చంద్రబాబు తెలిపారు.
ఇదే క్రమంలో.. ఈ కూటమి 2029 వరకూ మాత్రమే కాకుండా, అంతకు మించి ముందుకు సాగుతుందని తెలిపారు. కుటుంబాలతో, వ్యక్తిగత స్థాయిలో ఎదుర్కొనే చిన్న చిన్న విభేదాలు సహజమని.. అయితే, వాటిని తాము సామరస్యంగా పరిష్కరించుకుంటామని.. దేశ, రాష్ట్ర అభివృద్ధి కోసం ముందుకు సాగుతామని స్పష్టం చేశారు.
