Begin typing your search above and press return to search.

పెట్టుబ‌డుల‌తో ఇన్‌క‌మ్‌.. బాబు లెక్క ఇదీ.. !

ఏపీకి భారీ ఎత్తున పెట్టుబ‌డులు తీసుకురావాల‌న్న‌ది సీఎం చంద్ర‌బాబు, మంత్రి నారా లోకేష్ సంక‌ల్పం. ఈ క్ర‌మంలో వారు అనేక ప్ర‌య‌త్నాలు చేశారు.

By:  Garuda Media   |   17 Nov 2025 6:00 PM IST
పెట్టుబ‌డుల‌తో ఇన్‌క‌మ్‌.. బాబు లెక్క ఇదీ.. !
X

ఏపీ కి భారీ ఎత్తున పెట్టుబ‌డులు తీసుకురావాల‌న్న‌ది సీఎం చంద్ర‌బాబు, మంత్రి నారా లోకేష్ సంక‌ల్పం. ఈ క్ర‌మంలో వారు అనేక ప్ర‌య‌త్నాలు చేశారు. ఇప్ప‌టి వ‌ర‌కు అంటే.. 17 మాసాల అతి త‌క్కువ కాలంలో నే మొత్తం 23 ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌ల మేర‌కు పెట్టుబ‌డులు తీసుకువ‌చ్చారు. త‌ద్వారా క‌నీసంలో క‌నీసం.. 5 ల‌క్ష‌ల మందికి ఉపాధి, ఉద్యోగ అవ‌కాశాలు కూడా వ‌చ్చాయి. అయితే.. ఇవి ఇప్ప‌టికిప్పుడు క‌నిపించవ‌న్న‌ది వాస్త‌వం. ఆయా సంస్థ‌లు వ‌చ్చి ఏర్పాట‌య్యాక ఖ‌చ్చితంగా చంద్ర‌బాబు కృషి క‌నిపిస్తుంది.

ఇదిలావుంటే.. తాజా గా వ‌చ్చిన‌, వ‌స్తున్న కీల‌క విమ‌ర్శ‌లు కూడా ఉన్నాయి. పెట్టుబడుల పేరుతో వ‌స్తున్న కంపెనీల‌కుప్ర‌భుత్వం భూములు ఇస్తోంద‌ని.. అయితే.. ఆదాయం మాటేంట‌ని కొంద‌రు ప్ర‌శ్నిస్తున్నారు. వాస్త‌వ‌మే. దీనిలోనూ ప‌స ఉంద‌నే ఒప్పుకోవాలి. ఎక‌రాల‌కు ఎక‌రాలు భూములు ఇస్తున‌ప్పుడు.. సంస్థ‌లు ఏర్పాటు చేస్తున్న‌ప్పుడు.. స‌ర్కారు అనేక రాయితీలు ప్ర‌క‌టిస్తున్న‌ప్పుడు.. మ‌రి ప్ర‌భుత్వానికి ఆదాయం మాటేంట‌న్న ప్ర‌శ్న తెర‌మీదికి వ‌స్తుంది. దీనిని ఆలోచ‌న చేయ‌కుండానే సీఎం భూములు ఇస్తున్నారా? అనేది మరో కీల‌క అంశం.

ఈ విష‌యంపైనే తాజా గా చంద్ర‌బాబు కీల‌క అధికారుల‌తో చ‌ర్చించారు. మంత్రులు పయ్యావుల కేశ‌వ్ స‌హా.. ఇత‌ర అధికారుల‌తోనూ పెట్టుబ‌డుల ద్వారా రాష్ట్రానికి వ‌చ్చే ఆదాయాన్ని ఆయ‌న చ‌ర్చించారు. ఈ క్ర‌మంలో మొత్తం 4 మార్గాల్లో స‌ర్కారుకు ఆదాయం రానుంద‌ని లెక్క‌లు తేల్చారు.

దీని ప్ర‌కారం..

1) కంపెనీలు గ్రౌండ్ అయిన ఆరు మాసాల త‌ర్వాత‌.. ప‌న్నుల రూపంలో ఆదాయం వ‌స్తుంది.

2) రెండేళ్ల త‌ర్వాత‌.. విద్యుత్ బిల్లుల రూపంలో ప్ర‌భుత్వం ఆదాయం తెచ్చుకుంటుంది.

3) స‌ద‌రు కంపెనీలు ఇచ్చే ఉద్యోగాల ద్వారా.. అనేక మందికి చేతిలో డ‌బ్బులు వ‌స్తాయి. ఫ‌లితంగా.. వారి వినియోగ శ‌క్తి పెరుగుతుంది. దీంతో మార్కెట్లు పుంజుకుని.. ప్ర‌భుత్వానికి జీఎస్టీ రూపంలో మ‌రింత ఆదాయం పెరుగుతుంది.

4) ర‌వాణా, విమాన స‌ర్వీసులు పెరిగి.. త‌ద్వారా కూడా రాష్ట్రానికి ఆదాయం చేకూరుతుంది. అలానే కంపెనీల రాక‌తో భూముల ధ‌ర‌లు పెరిగి.. రిజిస్ట్రేష‌న్ రూపంలో స‌ర్కారు రెవెన్యూ పెరుగుతుంది. ఇలా.. ఈ నాలుగు అంశాల‌తో పాటు.. మ‌రికొన్ని అంశాలు కూడా ఉన్నాయి. అయితే.. ఇదంతా ప్ర‌త్యక్ష ఆదాయం కాదు. ప‌రోక్షంగా స‌ర్కారు కు చేకూరేకీల‌క ఆదాయ‌మ‌ని సీఎం చంద్ర‌బాబు లెక్క‌లు వేశారు.