అభివృద్ధి వైకుంఠ పాళి కాకూడదు....బాబు సీరియస్ కామెంట్స్
ఏపీలో ఉన్న ఒక సంప్రదాయం ఏంటి అంటే ప్రతీ అయిదేళ్ళకు అధికారంలో ప్రభుత్వాన్ని మార్చేసి ప్రతిపక్షాన్ని గద్దెనెక్కించడం.
By: Satya P | 10 March 2026 4:00 AM ISTఏపీలో ఉన్న ఒక సంప్రదాయం ఏంటి అంటే ప్రతీ అయిదేళ్ళకు అధికారంలో ప్రభుత్వాన్ని మార్చేసి ప్రతిపక్షాన్ని గద్దెనెక్కించడం. 2014 నుంచి చూస్తే ఇదే జరుగుతూ వస్తోంది. 2014లో టీడీపీ గెలిస్తే 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. 2024లో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది. 2029లో జనాలు ఎలా రియాక్ట్ అవుతారు అన్న చర్చ ఉండనే ఉంది. అందుకే కూటమి ప్రభుత్వం పెద్దలు పదే పదే ఒక మాట అంటూ వస్తున్నారు. అభివృద్ధి నిరాటంకంగా సాగాలి అంటే కచ్చితంగా టీడీపీ కూటమి మరో పదిహేనేళ్ళ పాటు అధికారంలో ఉండాలని వారు కోరుతున్నారు. ప్రతీ సభలో ఇదే విషయం ముఖ్యమంత్రి చంద్రబాబు విడమరచి చెబుతున్నారు. అభివృద్ధి వైకుంఠ పాళి కాకూడదు అని ఆయన చెప్పడం వెనక ఉద్దేశం ఇదే. తాజాగా డోన్ పర్యటనలో బాబు ఇదే విషయం చెప్పారు.
కూటమి ఎంతో చేస్తోంది :
చంద్రబాబు డోన్ సభలో మాట్లాడుతూ గడచిన 21 నెలలలో తమ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు ఎంతో మేలు చేసింది అని చెప్పుకొచ్చారు. తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలున్నా15 వేలు ఇస్తున్నామని, అలాగే శక్తి ద్వారా ఇప్పటి వరకు మహిళలు ఉచితంగా 50 కోట్ల ప్రయాణాలు చేశారని వెల్లడించారు. ప్రజల కోసమే కూటమి ప్రభుత్వం అందుబాటులో ఉంటుందని చెప్పారు. పంచాయతీ రాజ్ రోడ్లలో గుంతలు లేకుండా చేసేందుకు 4 వేల కోట్ల రూపాయలు కేటాయిస్తున్నామని చెప్పారు. కర్నూలులో డ్రోన్ సిటీ ఏర్పాటు చేస్తున్నామని, అనంతపురంను ఎయిరో స్పేస్ సిటీగా చేస్తామని బాబు వివరించారు. ఏపీలో కూటమి పాలనలోనే రాష్ట్రానికి పెట్టుబడులు పెద్ద ఎత్తున వస్తున్నాయని బాబు వివరించారు.
రాసిపెట్టుకోండి :
ఇదిలా ఉంటే వైసీపీ ప్రభుత్వంలో ఏకంగా ఎనిమిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజల మీద 32 వేల కోట్ల భారం మోపారని బాబు విమర్శించారు. తాము అధికారంలోకి వస్తే కరెంట్ ఛార్జీలు పెంచబోమని చెప్పామని అదే చేస్తున్నామ్ని అన్నారు ఇక మీదట కూడా అదే జరుగుతుందని అని బాబు అన్నారు. రాసిపెట్టుకోండి ఏపీలో కరెంట్ ఛార్జీలు పెంచే ప్రసక్తే లేదని ఆయన కచ్చితంగా చెప్పారు. అంతే కాదు పేదలను ఆదుకునేందుకు పీ4 విధానం తీసుకొచ్చామని దీనిని అంతా వినియోగించుకోవాలని ఆయన కోరారు. తాను కష్టపడేది పేదల కోసమేనని బాబు చెబుతూ పేదలకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు.
టోటల్ ప్రక్షాళన :
ఏపీలో అనేక అంశాలలో కూటమి ప్రభుత్వం ప్రక్షాళన చేస్తోంది అని చంద్రబాబు చెప్పారు. తిరుమల లడ్డూ కల్తీ, మద్యం అవినీతి, భూ దోపిడీ వంటి వాటిపై సీరియస్ గానే ఉన్నామని అన్ని వ్యవస్థలలలో ప్రక్షాళన చేస్తున్నామని చెప్పారు శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయాన్ని అపవిత్రం చేస్తే ఉపేక్షించేది లదని బాబు స్పష్టం చేశారు. వివేకానంద రెడ్డిని హత్య చేసి తన చేతిలోనే కత్తి పెట్టి నారాసుర రక్త చరిత్ర అని రాశారని ఆయన వైసీపీ మీద మండిపడ్డారు. గతంలో వారే నేరాలు ఘోరాలు చేశారని బాబు చెబుతూ ఆఖరుకి జగన్ చేసిన అన్యాయాన్ని ఆయన సోదరి సునీత కూడా తెలుసుకున్నారని గుర్తు చేశారు.
అంతా అస్తవ్యస్తం :
ఇక గత వైసీపీ ప్రభుత్వంలో రెవెన్యూ శాఖను అస్తవ్యస్తం చేశారని చంద్రబాబు విమర్శించారు.అడిగిన భూమి ఇవ్వకపోతే వాటిని 22ఏలో పెట్టేసేలా గత ప్రభుత్వం వ్యవహరించిందని నిందించారు. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ తెచ్చి ప్రైవేట్ భూములపై అజమాయిషీని తమకు నచ్చిన వారికి సొంత వాళ్లకు కట్టబెట్టాలని చూశారని ఆరోపించారు. ఆఖరుకు వారసత్వంగా వచ్చిన భూములు, సొంత శ్రమతో కొనుగోలు చేసిన భూములకు చెందిన పుస్తకాలపై ఫోటోలు వేసుకున్నారని బాబు ఫైర్ అయ్యారు. ఫోటోల పిచ్చితో జీవితాలతో ఆడుకునే పరిస్థితికి వచ్చారని అన్నారు. ఆనాటి ప్రభుత్వం చేసిన అస్తవ్యస్తమైన పరిస్థితిని మార్చేందుకు కూటమి ప్రభుత్వానికి ఇరవై నెలలు పట్టిందని బాబు అన్నారు. ప్రస్తుతం రూపాయి అవినీతి లేకుండా కొత్త పట్టాదార్ పాసు పుస్తకాలు ఇస్తున్నామని చెప్పారు.
ప్రజలు నమ్మి అధికారం :
మూడు పార్టీలు కలిసి కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేశామని అయన చెప్పరు. రాష్ట్రానికి పూర్వవైభవాన్ని తీసుకొస్తామన్న కూటమి పెద్దల మాటను నమ్మి అధికారం ఇచ్చారని అన్నారు. ఇక రాయలసీమలో వైసీపీకి కేవలం 7 సీట్లు తప్ప అన్నింటా కూటమి అభ్యర్థులను గెలిపించారని బాబు గుర్తు చేశారు. అందువల్లనే ప్రజాహితం కోసం కూటమి ప్రభుత్వం పని చేస్తోందని అన్నారు. ఎవరేమి చేశారు అన్నది జనాలు తెలుసుకోవాలని గతాన్ని గుర్తు పెట్టుకుంటేనే భవిష్యత్ బాగుంటుందని బాబు ప్రజలకు సూచించారు. రాయలసీమకు ఎంతో మేలు చేసింది తెలుగుదేశం ప్రభుత్వమే అని ఆయన చెప్పారు. అందువల్ల అభివృద్ధిని కొనసాగనిచ్చేలా ప్రజలు వ్యవహరించాలని బాబు కోరారు.
