Begin typing your search above and press return to search.

‘సంక్షేమం’లో చంద్రబాబు రికార్డు.. ఆ విషయంలో జగన్ రికార్డును చెరిపేస్తారా?

సుపరిపాలన అంటూ పగ్గాలు చేపట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు తన 4.0 ప్రభుత్వంలో సంక్షేమ పథకాలకు పదును పెడుతున్నారు.

By:  Tupaki Political Desk   |   4 Oct 2025 1:45 PM IST
‘సంక్షేమం’లో చంద్రబాబు రికార్డు.. ఆ విషయంలో జగన్ రికార్డును చెరిపేస్తారా?
X

సుపరిపాలన అంటూ పగ్గాలు చేపట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు తన 4.0 ప్రభుత్వంలో సంక్షేమ పథకాలకు పదును పెడుతున్నారు. అధికారంలోకి వచ్చిన ఏడాది తరువాత వరుసగా కొత్త పథకాలను ఆవిష్కరిస్తూ సంక్షేమానికి బ్రాండ్ అంబాసిడర్ గా చెప్పుకునే మాజీ ముఖ్యమంత్రి జగన్ రికార్డును అధిగమిస్తున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబుకు సంక్షేమ పథకాలకు నిధులు కేటాయించడం కొత్త కాకపోయినప్పటికీ, గత ప్రభుత్వంలో అనేక పథకాలను ప్రవేశపెట్టి ప్రజలకు డబ్బులు పంచడమే ప్రధాన వ్యాపకంగా చేసుకున్న వైసీపీ అధినేత జగన్.. తనదైన మార్క్ సాధించారు. ఐదేళ్ల పాలనలో రూ.2.70 లక్షల కోట్లు పంచిపెట్టామని ఘనంగా చాటుకున్నారు. అయితే ఈ ఏడాది జూన్ నుంచి సంక్షేమ పథకాల జాతరను ప్రారంభించిన చంద్రబాబు మాజీ సీఎం జగన్ రికార్డులను చెరిపేసేలా అడుగు వేస్తున్నట్లు కనిపిస్తున్నారు.

శనివారం ‘ఆటో డ్రైవర్ల సేవలో’ పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రారంభించారు. ఈ పథకం కింద రాష్ట్రంలో ప్రతి ఆటో డ్రైవర్ కు ఏడాదికి రూ.15 వేలు చొప్పున ఆర్థిక సాయం చేయనున్నారు. గత ప్రభుత్వంలో కూడా ఆటో డ్రైవర్లకు ఏటా ఆర్థిక సాయం చేసేవారు. అయితే అప్పట్లో ఏడాదికి రూ.10 వేలు చొప్పున పంపిణీ చేయగా, ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం ఆ మొత్తాన్ని మరో ఐదు వేలు పెంచి రూ.15 వేలు అందిస్తున్నారు. అంతేకాకుండా గత ప్రభుత్వం గత ప్రభుత్వంలో 2,61,516 మందికి మాత్రమే పథకం వర్తింప చేయగా, ప్రస్తుత ప్రభుత్వం అదనంగా 29 వేల మందికి కూడా ఈ పథకం కిందకు తీసుకువచ్చింది. ప్రస్తుతం మొత్తం 2,90,669 మంది ఆటో, క్యాబ్ డ్రైవర్లకు రూ.15 వేలు చొప్పున ఆర్థిక సాయం చేస్తున్నారు.

‘ఆటో డ్రైవర్ల సేవలో’ పథకాన్ని ఘనంగా ప్రారంభించిన ప్రభుత్వం.. ఇది తమ ఎన్నికల హామీ కాదన్న విషయాన్ని గుర్తుచేస్తోంది. ఎన్నికల్లో సూపర్ సిక్స్ హామీలు ఇచ్చిన ప్రభుత్వం.. గత ప్రభుత్వం అమలు చేసిన వాహనమిత్ర పథకాన్ని కొనసాగిస్తామని మాత్రం చెప్పలేదు. అయితే గత ఆగస్టులో ‘స్త్రీశక్తి’ ప్రారంభించడంతో ఆటో డ్రైవర్లకు ఆర్థిక కష్టాలు మొదలయ్యాయని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీంతో ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందని అప్రమత్తమైన ముఖ్యమంత్రి చంద్రబాబు ‘స్త్రీశక్తి’ ప్రారంభించిన రెండు నెలలకే ‘ఆటోడ్రైవర్ సేవలో’ పథకాన్ని తీసుకువచ్చారు.

ఇక ఆర్థిక సాయం విషయంలో కూడా గత ప్రభుత్వానికి మించిన రీతిలో నిధులు విడుదల చేస్తున్నారు. అమ్మఒడి పేరుతో విద్యార్థులకు రూ.13 వేల చొప్పున జగన్ ఆర్థిక సాయం చేస్తే... అదే పథకాన్ని ‘తల్లికి వందనం’గా మార్చి ఇంట్లో ఎంతమంది ఉంటే అందరికీ రూ.13 వేల చొప్పున డబ్బులు జమ చేశారు. నిజానికి ఈ పథకానికి నిధులు విడుదల చేసే వరకు కూటమి ప్రభుత్వంపై కొద్దిగా అసంతృప్తి చెలరేగిందని కథనాలు వచ్చాయి. ప్రతిపక్షం వైసీపీ కూడా కూటమిపై ప్రజా వ్యతిరేకత మొదలైందని సంబరం చేసుకుందని అంటున్నారు. కానీ, చంద్రబాబు మాత్రం తాపీగా అమలు చేసినా భారీగా నిధులు కేటాయించి ఎన్నికల్లో చెప్పినట్లే ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికివందనం వర్తింపజేయడంతో ఆ అసంతృప్తిని అధిగమించారని అంటున్నారు.

అదేవిధంగా మత్స్యకార భరోసా, అన్నదాతా సుఖీభవ వంటి పథకాలకు సైతం గతం కంటే ఎక్కువ నిధులు కేటాయించారు. మత్స్యకార భరోసాకు గతంలో రూ.10 వేలు ఇస్తే ప్రస్తుతం రూ.20 వేలు, అన్నదాతా సుఖీభవకు గతంలో రూ.14 వేలు ఇస్తే ఇప్పుడు రూ.20 వేలు అందిస్తున్నారు. ఇక గత ప్రభుత్వం అమలు చేయని ‘స్త్రీశక్తి’ని దిగ్విజయంగా కొనసాగిస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో ఎదురైన సమస్యలను అధిగమించి రాష్ట్రంలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం తీసుకురావడం కూడా ఓ రికార్డుగా టీడీపీ చెప్పుకుంటోంది. ఇలా సంక్షేమం అంటే బ్రాండ్ అంబాసిడరుగా గుర్తొచ్చే జగన్ ను మరిపించేలా ముఖ్యమంత్రి చంద్రబాబు అడుగులు వేయడం విశేషంగా చెబుతున్నారు. అయితే ఐదేళ్లపాటు జగన్ కొనసాగించిన పథకాలను ఆర్థిక కష్టాలు వెంటాడుతున్న వేళ చంద్రబాబు కొనసాగించగలరా? అన్నదే ఆసక్తికరంగా మారిందని చెబుతున్నారు.