Begin typing your search above and press return to search.

‘‘మా ఎమ్మెల్యే వేరే ఆఫీసుపై పడ్డాడు’’ - సీఎం చంద్రబాబు

కూటమి ఎమ్మెల్యేల ప్రవర్తనపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వర్క్ టెన్షన్ తో ఇబ్బంది పడితే మెడిటేషన్ చేయండి అంటూ హితవు పలికారు.

By:  Tupaki Political Desk   |   1 April 2026 5:54 PM IST
‘‘మా ఎమ్మెల్యే వేరే ఆఫీసుపై పడ్డాడు’’ - సీఎం చంద్రబాబు
X

కూటమి ఎమ్మెల్యేల ప్రవర్తనపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వర్క్ టెన్షన్ తో ఇబ్బంది పడితే మెడిటేషన్ చేయండి అంటూ హితవు పలికారు. అవసరమైతే యోగా క్లాసులు పెట్టిస్తానని వ్యాఖ్యానించారు. మైండ్ ను కంట్రోల్ చేసుకోండి అంటూ సుతిమెత్తగా హెచ్చరించారు. ఉదయగిరి నియోజకవర్గం వింజమూరులో నిర్వహించిన ‘పేదల సేవలో కార్యక్రమంలో’ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో చంద్రబాబు మానసిక ఒత్తిడికి గురికావొద్దంటూ ప్రజలకు సూచించడమే కాకుండా, పరోక్షంగా టీడీపీకి చెందిన నరసారావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబుకు చురకలు అంటించారు.

వింజమూరు సభలో ప్రసంగించిన సీఎం చంద్రబాబు నవ్వుతూ మాట్లాడుతూనే తమ పార్టీ ఎమ్మెల్యేకి చీవాట్లు పెట్టారు. ఎమ్మెల్యే అరవిందబాబు పేరు ప్రత్యేకంగా ప్రస్తావించకపోయినా, సీఎం మాటలు మాత్రం ఆయనను ఉద్దేశించినవే అంటున్నారు ‘‘నిన్ననే మా ఎమ్మెల్యే వేరే ఆఫీసుపై పడ్డాడు. నేను ఒకటే చెబుతున్నా, అధికారులు, ప్రజాప్రతినిధులు, పబ్లిక్ ఎవరైనా సరే టెన్షన్ ఎక్కువగా పడితే మైండ్ ను కంట్రోల్ చేసుకోండి’’ అంటూ సలహా ఇచ్చారు. ఇందుకోసం తాను యోగా క్లాసులు పెడతానని వెల్లడించారు. ఎక్కువ ఒత్తిడికి గురైతే అనారోగ్యానికి గురికావాల్సిరావొచ్చని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు.

ప్రజలు, ప్రజాప్రతిధులు, అధికారుల ఆరోగ్యం విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడినా, నిన్న తమ ఎమ్మెల్యే ఓ ఆఫీసుపై పడ్డాడని చెప్పడం పరిశీలిస్తే, నరసారావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబుకు స్వీట్ వార్నింగ్ ఇచ్చినట్లే అంటున్నారు. మైండ్ కంట్రోల్ లో లేకుండా ఇష్టానుసారం వ్యవహరించొద్దని ఎమ్మెల్యేకు సీఎం హితవు పలికారని, తాను ఇలాంటి పరిణామాలను చూస్తూ ఊరుకోనని సుతిమెత్తగా హెచ్చరించారని అంటున్నారు. ఆరోగ్యం పాడుచేసుకోద్దని సలహాను లోతుగా పరిశీలిస్తే, ఎమ్మెల్యే గిరిని కోల్పోవద్దని వార్నింగ్ ఇచ్చినట్లే అంటున్నారు.

మంగళవారం నరసారావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు జిల్లా ఎస్పీ కార్యాలయంలో నానా హడావిడి చేశారు. గతంలో తాను సూచించిన వ్యక్తికి ఔట్ సోర్సింగు ఉద్యోగం ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే అరవిందబాబు జిల్లా ఎస్పీ కార్యాలయంలో సుమారు మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు బైఠాయించారు. తాను సూచించిన వ్యక్తికి ఉద్యోగ నియామక పత్రం ఇచ్చిన తర్వాతే ఆఫీసు నుంచి బయటకు వెళతానని తెగేసి చెప్పారు. దీంతో ఒకానొక సమయంలో జిల్లా ఎస్పీతో ఎమ్మెల్యేకి తీవ్ర వాగ్వాదం జరిగిందని చెబుతున్నారు. దీనిపై మంత్రి గొట్టిపాటి రవికుమార్ కల్పించుకున్నా ఎమ్మెల్యే వినిపించుకోలేదని అంటున్నారు.

తన పరిధిలో లేకపోయినా, ఉద్యోగ నియామకంపై ఎమ్మెల్యే పట్టుబడుతున్నారని ఎస్పీ ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకువెళ్లగా, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు రంగంలోకి దిగి, ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠినీ నరసారావుపేట పంపి ఎమ్మెల్యేతో మాట్లాడించినట్లు సమాచారం. అయితే ఎమ్మెల్యే అరవింద బాబు మాత్రం ఉద్యోగ నియామకపత్రాలు ఇచ్చేవరకు కదలను అంటూ ఐజీతో కూడా మాట్లాడనని భీష్మించుకుని కూర్చున్నారని, బాత్ రూంలో దాగున్నారని చెబుతున్నారు. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్ అయినట్లు ప్రచారం జరుగుతోంది. ఇక మైండ్ కంట్రోల్ లో లేకపోవడం వల్లే ఇలా ప్రవర్తిస్తున్నారని ఎమ్మెల్యేని సీఎం మందలించినట్లు వ్యాఖ్యానిస్తున్నారు.