వదిలేస్తే.. వైసీపీలోకా.. బీజేపీలోకా..!
టీడీపీ నాయకుల వ్యవహారంపై ఆపార్టీ అధినేత, సీఎంచంద్రబాబు కూపీ లాగుతున్నారు.
By: Garuda Media | 25 Aug 2025 9:28 AM ISTటీడీపీ నాయకుల వ్యవహారంపై ఆపార్టీ అధినేత, సీఎంచంద్రబాబు కూపీ లాగుతున్నారు. తాను పదే పదే హెచ్చరిస్తున్నా.. కొందరు నాయకులు ఏమాత్రం వినిపించుకోకపోవడం, విన్నట్టే నటించడం.. తర్వాత యథా ప్రకారం వారి పనులు వారు చేసుకుని పోతుండడంపై చంద్రబాబు సీరియస్ అయ్యారు. అవుతు న్నారు కూడా. ''అసలిలాఎందుకు చేస్తున్నారు?'' అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఇదే విషయంపై చంద్రబాబు అంతర్గతంగా శనివారం చర్చించారు. ఏం జరుగుతోంది? అనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.
''మనోళ్లు వేరేవాళ్లకు టచ్‌లో ఉంటున్నారా?'' అని కీలక నాయకుడిని అడిగిన చంద్రబాబు దీనిపై అంత ర్గత విచారణ చేయాలని కూడా చెప్పుకొచ్చినట్టు తెలిసింది. శనివారం వీడియో కాన్ఫరెన్సు ద్వారా పార్టీ నాయకులతో చంద్రబాబు రెండు గంటలకు పైగానే చర్చలు జరిపారు. ఈ సమావేశంలో ప్రధానంగా పార్టీ లో దూకుడుగా ఉన్న నాయకులు, పార్టీ పరువుకు భంగం కలిగిస్తున్న నాయకుల వ్యవహారంపై చర్చించా రు. ఒకరిద్దరు ఎమ్మెల్యేల నుంచి ఓ ఎంపీ వరకు పార్టీలో దూకుడుగా వ్యవహరిస్తున్నారు.
ప్రజల కన్నా.. వివాదాల చుట్టూనే వారు తిరుగుతున్నారు. ఈ వ్యవహారం చంద్రబాబును కలవరపరుస్తోంది. అయితే.. వారిని ఇప్పటికే రెండు నుంచి మూడు సార్లు హెచ్చరించారు. కానీ, మార్పు మాత్రం కనిపించడం లేదు. దీంతో వారి ధైర్యం-ధీమా వ్యవహారాలపై చంద్రబాబు కూపీ లాగినట్టు తెలిసింది. వారేమైనా.. ఇతర పార్టీలతో టచ్‌లో ఉన్నారా? అని ఆరా తీశారు. వాస్తవానికి చాలా మంది నాయకులు ఇతర పార్టీలతో టచ్‌లో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ నేతలతో ఇంకా టచ్‌లోనే ఉన్నారు.
ఇటీవల కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి శ్రీకాంత్‌కు పెరోల్ ఇప్పించారు. ఈయన వైసీపీ నాయకుడు. ఇది వివాదంగా మారింది. శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి కూడా.. వైసీపీ నాయకులతో టచ్‌లో ఉన్నారని తెలిసింది. ఇక, ఎన్టీఆర్ జిల్లాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా.. వైసీపీ అగ్రనేతలతో టచ్‌లో ఉన్నారు. దీంతో వారంతా ఏమాత్రం కఠిన చర్యలు తీసుకున్నా.. ఆ పార్టీకి టచ్‌లోకి వెళ్లిపోవడమే కాదు.. కండువాలు మార్చినా మారుస్తారన్న చర్చ జరుగుతోంది. ఇది కాకపోతే.. బీజేపీ కూడా రెడీగానే ఉంది. ఇటీవల మాధవ్.. పరోక్షంగా ఈ విషయాన్ని చెప్పుకొచ్చారు. దీంతో చంద్రబాబు.. తర్జన భర్జన పడుతున్నారు.
