బాబు చెప్పిన వీకేఎస్ మంత్రంలో ఏముంది ?
ముఖ్యమంత్రి చంద్రబాబు వారణాసి పర్యటనలో భాగంగా నరేంద్ర మోడీ పుట్టిన రోజు వేడుకలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ వీకేఎస్ మంత్రాన్ని సభికులకు చెప్పడంతో అంతా హర్షద్వానాలు చేశారు.
By: Satya P | 17 Sept 2026 7:28 PM ISTముఖ్యమంత్రి చంద్రబాబు వారణాసి పర్యటనలో భాగంగా నరేంద్ర మోడీ పుట్టిన రోజు వేడుకలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ వీకేఎస్ మంత్రాన్ని సభికులకు చెప్పడంతో అంతా హర్షద్వానాలు చేశారు. ఇంతకీ వీకేఎస్ మంత్రంలో ఏముంది అన్నదే చర్చ. ప్రధాని నరేంద్ర మోడీ గురించి బాబు ఈ సందర్భంగా ఎన్నో మంచి మాటలనే చెప్పారు. అతి సాధారణ కుటుంబంలో జన్మించిన మోడీ ఈ రోజున దేశానికి బలమైన నాయకత్వం అందిస్తున్నారు అని ఆయన కొనియాడారు. ప్రతీ ఒక్కరికీ మోడీ ఒక స్పూర్తి అని ఆయన అంటూ మోడీ అంటే వీకేఎస్ మంత్రం అని ఒక కొత్త మంత్రాన్ని దేశానికే అక్కడ నుంచి వినిపించారు.
ఇంతకీ ఈ మంత్రమేంటి :
చంద్రబాబు ఈ మంత్రం గురించి చాలానే వివరించారు. మోడీ ప్రస్తావనను గురించి ఇందులో మొత్తం ఉంచారు. ఇందులో వీ అంటే మోడీ పుట్టిన స్థలం వాద్‌నగర్, కే అంటే ఆయన మూడు సార్లు గెలిచిన లోక్ సభ నియోజకవర్గం ఆయన కర్మభూమి కాశీ, ఎస్ అంటే మోడీ జన్మించిన సెప్టెంబర్ 17 గా బాబు వివరించారు. వీకేఎస్ అన్నది భారత దేశానికి సరి కొత్త శకంగా మారింది అని ప్రజాస్వామ్యంలో అత్యంత శక్తివంతంగా నిలిచింది అని చంద్రబాబు చెప్పారు. మఒడీ జీవితం చూస్తే ఆయన సామాన్య కుటుంబంలో పుట్టి రైల్వే స్టేషన్ల్ ఓ టీ అమ్ముతూ కష్టపడి చదువుకుని దేశానికి ప్రధానిగా ఈ స్థాయికి వచ్చారు అంటే ఆయన యువతకు అచ్చమైన స్పూర్తి అని చంద్రబాబు అభివర్ణించడం విశేషం.
బాబు స్పీచ్ ఇంట్రెస్టింగ్ :
ఇదిలా ఉంటే మోడీ పుట్టిన రోజున ఉత్తర ప్రదేశ్ వారణాసిలో జరిగిన కాశీ-వాద్‌నగర్ సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమంలో ఏపీ నుంచి ప్రత్యేక అతిధిగా చంద్రబాబు హాజరు అయ్యారు. ఆయన ఎన్ డీయే పక్షాన అటెండ్ అయ్యారు. అంతే కాదు ఈ సమావేశంలో చంద్రబాబు ప్రసంగం అందరికీ ఉత్తేజపరిచింది. రుద్రాక్ష్ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన ఈ సభలో చంద్రబాబు తనదైన బాణీలో చేసిన ఈ ప్రసంగంతో అక్కడి ప్రజలలో హుషార్ తెప్పించారు. దాంతో చంద్రబాబు ప్రసంగానికి కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాధ్ సింగ్ కూడా అభినందనలు తెలపడం విశేషం. బాబు మోడీ విజన్ తో పాటు ఆయన దేశానికి మూడు సార్లు ప్రధానిగా అందిస్తున్న సేవల గురించి ప్రస్తుతించారు.
కరోనా సమయంలో :
మోడీ పరిపాలనలో పాతిక కోట్ల మంది పేదలను బయటకు తీసుకుని రావడం జరిగింది అని బాబు గుర్తు చేశారు. అంతే కాదు కరోనా సమయంలో మోడీ చేపట్టిన కట్టుదిట్టమైన చర్యల ఫలితంగా 140 కోట్ల మంది దాకా దేశ ప్రజలు సురక్షితంగా ఉన్నారని అన్నారు. అదే సమయంలో వంద దేశాలకు ఉచితంగా కరోనా వ్యాక్సిన్ ని మోడీ సరఫరా చేశారు అని చంద్రబాబు గుర్తు చేశారు. మోడీ లాంటి నాయకుడు దేశానికి లభించడం అదృష్టమని కూడా బాబు ప్రశంసించారు. మొత్తానికి మోడీ పుట్టిన రోజున చంద్రబాబు ప్రసంగమే ఆయనకు గొప్ప బహుమతిగా ఉందని అంటున్నారు.
