పథకాల వెంట బాబు పరుగు !
తెలుగుదేశం అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు విషయం తీసుకుంటే ఆయన అభివృద్ధి ప్రేమికుడు.
By: Tupaki Desk | 14 Jun 2025 9:25 AM ISTతెలుగుదేశం అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు విషయం తీసుకుంటే ఆయన అభివృద్ధి ప్రేమికుడు. ఆయన ఆలోచనలు చాలా భారీగా ఉంటాయి. ఆయన విజన్ గొప్పగా ఉంటుంది. అందరూ రేపటి గురించి ఆలోచిస్తే బాబు మరో ఇరవై పాతికేళ్ళ గురించి ఆలోచిస్తారు. అందుకే బాబు 1999లో రెండోసారి నెగ్గగానే విజన 2020 అని అనగలిగారు.
ఈ శతాబ్దం నాది అని మహాకవి శ్రీశ్రీ అన్నట్లుగా 21 శతాబ్దం తనదని బాబు చెప్పుకుంటూ అభివృద్ధి విషయంలో తన ముద్ర బలంగా ఉండేలా అనేక చర్యలు చేపట్టారు. అయితే ఆయన అభివృద్ధి సంస్కరణలు అని ముందుకు పోతే 2004లో జరిగిన ఎన్నికల్లో సంక్షేమ అజెండాతో వచ్చి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఓడించారు. దాంతో బాబు కూడా రూట్ మార్చి 2009 ఎన్నికల నుంచి ఉచిత పధకాల వైపు మొగ్గు చూపారు
అలా బాబు తనలోని విజనరీని కాస్తా పక్కన పెట్టి ఆల్ ఫ్రీ స్లోగన్ అందుకున్నా 2009 ఎన్నికల్లో నెగ్గలేదు. కానీ 2014లో విభజన ఏపీలో ఆ మంత్రం బాగా పనిచేసింది అయితే గెలిచిన తరువాత బాబు మళ్ళీ తన పాలనలో అభివృద్ధి వైపు ఎక్కువగా మొగ్గు చూపించారు. దాంతో 2019లో మరోసారి ఓటమి ఎదురైంది.
ఈసారి సంక్షేమ అజెండాతో వచ్చిన వైఎస్సార్ కుమారుడు జగన్ చేతిలో బాబు ఓడారు. అయితే అయిదేళ్ళ ప్రతిపక్షంలో బాబు అన్నీ సమీక్షించుకుని మళ్ళీ సంక్షేమ బాటనే పట్టారు. సూపర్ సిక్స్ అని 2024 ఎన్నికల ముందు అద్భుతమైన మేనిఫేస్టోని రెడీ చేసి జనం ముందుకు వెళ్ళారు. దాంతో అదిరిపోయే విజయం దక్కింది.
అయితే 2024లో గెలిచిన తరువాత కూటమి సారధిగా బాబు తొలి ఏడాది సూపర్ సిక్స్ ని పెద్దగా అమలు చేయలేకపోయారు అదే సమయంలో అమరావతి రాజధానిని పరుగులు పెట్టించారు. పోలవరాన్ని దారిన పట్టించారు. అభివృద్ధి అజెండాను మళ్ళీ తలకెత్తుకున్నారు సంపద సృష్టిస్తేనే సంక్షేమం జరుగుతుందని జనాలకు చెప్పే ప్రయత్నం చేశారు.
కానీ వైసీపీ నుంచి వచ్చిన విమర్శలతో పాటు తొలి ఏడాది తన పాలన మీద వచ్చిన సర్వేల ఫలితాలో ఏమో తెలియదు కానీ ఇపుడు సూపర్ వేగంతో సూపర్ సిక్స్ పధకాలకు సై అంటున్నారు. తల్లికి వందనం అమలు చేశారు. అన్నదాతా సుఖీభవ కూడా చేయబోతున్నారు ఆగస్ట్ నుంచి ఉచిత బస్సు పధకం అమలు అని చెబుతున్నారు.
ఇలా జగన్ కి ఏ మాత్రం చాన్స్ ఇవ్వరాదని బాబు సంక్షేమం విషయంలో దూకుడు చూపిస్తున్నారు. అయితే ఏపీ విపరీతమైన అప్పులలో ఉంది. జగన్ అయితే అభివృద్ధిని పక్కన పెట్టి సంక్షేమానికి మొగ్గు చూపించారు. బాబు అలా కాదు అమరావతి వంటి భారీ ప్రాజెక్ట్ ని తలకెత్తుకున్నారు. దానికి లక్షల కోట్ల నిధులు అవసరం అవుతాయి. అలాగే పోలవరం ప్రాజెక్ట్ ఉంది. పోలవరం బనకచర్ల ఉంది. అంతే కాకుండా ప్రాంతాల వారీగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంది వీటికి నిధులు ఎక్కడ నుంచి వస్తాయన్న చర్చ సాగుతోంది.
పథకాల వెంట బాబు లాంటి వారు పరుగులు తీయడం వల్ల ఉపయోగం ఉంటుందా అన్నది చర్చగా ఉంది. జగన్ స్టైల్ వేరు, ఆయన ఆలోచనలు వేరు, బాబు విజన్ ని మెచ్చే ప్రత్యేకమైన సెక్షన్ ఉంది. అతి పెద్ద ఓటు బ్యాంక్ ఉంది. మరి ఉచిత పధకాలు అని భారీగా విదిలిస్తే టాక్స్ పేయర్స్ ఊరుకుంటారా ఏపీ అప్పుల కుప్ప అయితే మేధావులు సహిస్తారా అన్నదే చర్చగా ఉంది. బాబు తన తొలి రూట్ అయిన అభివృద్ధి అజెండానే నమ్ముకుంటే బెటర్ అన్న మాట ఉంది. ఎందుకంటే 2029 ఎన్నికల్లో బాబు కంటే ఎక్కువ సంక్షేమ పధకాలు ఇస్తామని జగన్ జనం ముందుకు వస్తే అపుడు సీన్ ఏంటి అన్న చర్చ కూడా ఉందని అంటున్నారు
