చంద్రబాబు చెప్పిన 'పేదింటి కథ' విన్నారా?
ఏపీ సీఎం చంద్రబాబు గతానికి భిన్నంగా విజయవాడలో శనివారం జరిగిన.. ఆటో డ్రైవర్ల సేవలో.. కార్య క్రమంలో వినూత్న విషయాన్ని వెల్లడించారు.
By: Garuda Media | 5 Oct 2025 4:20 PM ISTఏపీ సీఎం చంద్రబాబు గతానికి భిన్నంగా విజయవాడలో శనివారం జరిగిన.. ఆటో డ్రైవర్ల సేవలో.. కార్య క్రమంలో వినూత్న విషయాన్ని వెల్లడించారు. గత 15 నెలలుగా రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు పేదలకు ఎలా మేలు చేస్తున్నాయన్న విషయాన్ని ఆయన ఆసక్తిగా వివరించారు. ఒక్కొక్క కుటుంబానికి కూటమి ప్రభుత్వం చేస్తున్న మేలును గణాంకాలతో సహా పేర్కొన్నారు. ``రాష్ట్రంలో ఒక పేద కుటుంబం ఉందనుకోండి. ఆ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి మేలు చేస్తోందో ఇప్పుడు చెబుతా వినండి`` అంటూ ఆయన ప్రారంభించారు.
+ ఉదయం టిఫిన్లు: అన్న క్యాంటీన్లలో రూ.5తో సరిపోతుంది.
+ మధ్యాహ్నం భోజనం: అన్న క్యాంటీన్లలో రుచికరమైన భోజనాన్ని రూ.5కే ఇంటిల్లిపాదీ తినొచ్చు.
+ రాత్రికి భోజనం: అదే క్యాంటీన్లలో రూ.5తో కుటుంబం మొత్తం సంతృప్తిగా తినొచ్చు.
+ ఒకవేళ ఇంట్లోనే వండుకుని తినాలని అనుకుంటే.. ప్రభుత్వమే ఉచితంగా రేషన్ ఇస్తోంది. బయట సరుకులు కొనే అవసరం కూడా లేదు.
+ దీపం పథకం కింద ఏడాదికి మూడు సిలిండర్లను ఉచితంగా ఇస్తున్నాం. ఇక, ఇబ్బంది లేదు.
+ పేదల కుటుంబాల్లోని పిల్లలు చదువుకునేందుకు ఎంత మంది ఉన్నా.. తల్లికి వందనం పథకం కింద రూ.15 వేలు ఇస్తున్నాం.
+ ప్రభుత్వ పాఠశాలల్లో చక్కని సౌకర్యాలు కల్పించాం. యూనిఫాం ఇస్తున్నాం. మధ్యాహ్న భోజనం పెడుతున్నాం.
+ మహిళలు ఎక్కడికైనా వెళ్లాలని అనుకుంటే.. స్త్రీ శక్తి పథకం కింద.. ఉచిత బస్సు ప్రయాణాన్ని చేరువ చేశాం. ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించొచ్చు.
+ నెల నెలా 1నే సామాజిక పింఛన్లు అందిస్తున్నాం.
+ ఇంట్లో ఎంత మంది పింఛనుకు అర్హులు ఉన్నా.. వారందరికీ ఇస్తున్నాం. దీంతో ఒక పేద కుటుంబం చాలా హాయిగా జీవించడమే కాకుండా.. జీఎస్టీ-2.0తో పొదుపు కూడా చేసుకునేలా ప్రోత్సహిస్తున్నాం. అని చంద్రబాబు వివరించారు.
