మంత్రుల నోట పధకాలు గటగటా
రానున్న కాలంలో తల్లికి వందనం, అన్న దాతా సుఖీభవ కార్యక్రమాలను అమలు చేస్తామని ఆర్టీసీ బస్సులలో ఉచితంగా మహిళలకు ప్రయాణ సదుపాయం కల్పిస్తామని కూడా చెప్పారు.
By: Tupaki Desk | 1 Jun 2025 12:08 AM ISTఎంతైనా అక్కడ ఉన్నది రాజకీయ అపర చాణక్యుడు చంద్రబాబు. ఆయన నిద్రపోరూ అవతల వారిని నిద్రపోనీయరు. ఆయన పని చేస్తారు. అవతల వారినీ చేయమంటారు. దాంతో ఎవరికి అయినా ఉత్సాహం పుట్టాల్సిందే. జనం బాట పట్టాల్సిందే. తాజాగా బాబు పార్టీ నేతలకు తీసుకున్న టెలి కాన్ఫరెన్స్ క్లాస్ బాగా పని చేసినట్లుంది.
ఎన్టీఆర్ సామాజిక పెన్షన్ భరోసా కార్యక్రమంలో పెద్ద ఎత్తున టీడీపీ నాయకులు పాల్గొన్నారు. తెల్లవారుతూనే పేదింట్లో వాలిపోయారు. నేల మీద కూర్చుని వారి సాధక బాధకాలు తెలుసుకున్నారు. వారి చేతిలో పెన్షన్ పెట్టి ముఖంలో నవ్వులు చూశారు.
కొందరు అయితే ఏకంగా ఇంటిలోకి వెళ్ళి వారి జీవన పరిస్థితులను స్వయంగా తెలుసుకుని సాయం చేస్తామని చెప్పి మరీ వచ్చారు. హోం మంత్రి వంగలపూడి అనిత అయితే తన సొంత నియోజకవర్గం పాయకరావుపేటలో ఒక పేద ఇంట్లోకి వెళ్ళి మరీ టీ కాచారు. వారి ఇంటి మనిషిగా మారి వారి సమస్యలకు తన పరిష్కారాలు చూపించారు.
అదే విధంగా మంత్రులు అంతా పేదల ఇళ్ళ వద్దకే క్యూ కట్టారు కేవలం పెన్షన్ ఇవ్వడమే కాదు గత ఏడాదిగా తమ ప్రభుత్వం అమలు చేస్తూ వస్తున్న అనేక సంక్షేమ కార్యక్రమాలను అభివృద్ధి కార్యక్రమాలను వారిని వివరించారు. అక్కడ ప్రజలకు కూడా ప్రభుత్వ విజయాలను వివరించారు.
రానున్న కాలంలో తల్లికి వందనం, అన్న దాతా సుఖీభవ కార్యక్రమాలను అమలు చేస్తామని ఆర్టీసీ బస్సులలో ఉచితంగా మహిళలకు ప్రయాణ సదుపాయం కల్పిస్తామని కూడా చెప్పారు. రాష్ట్రంలో పాలన తీరు తెన్నులను వివరించి వారి నుంచి ఫీడ్ బ్యాక్ ని కూడా కొందరు పార్టీ నాయకులు రాబట్టారు.
ఇక మంత్రులు అంతా ప్రజలలో ఉండాలని పేద వారి గడప తొక్కాలని ప్రతీ మంత్రి వర్గ సమావేశంలో చంద్రబాబు దిశా నిర్దేశం చేస్తూ ఉంటారు దానికి తగినట్లుగా ఇపుడు మంత్రులలో ఆ స్పందన కనిపించింది అని అంటున్నారు.
ప్రతీ పధకం గురించి కూడా మంత్రులు పార్టీ నాయకులు గటగటా చెప్పేస్తున్నారు. ఒక విధంగా ప్రభుత్వం పని తీరు గురించి సాధించిన విజయాల గురించి మంత్రులు పార్టీ నాయకులు చెబితే ప్రజల వద్దకు తరచూ వెళ్ళి వారికి భరోసాగా నిలిస్తే ఇంతకు మించిన ప్రచారం కానీ రాజకీయ వ్యూహం కానీ వేరేది ఉంటుందా అని అంటున్నారు.
స్వామి కార్యక్రం స్వకార్యం అన్నట్లుగా టీడీపీ అధినాయకత్వం ఈ విధంగా పెన్షన్ ఇస్తూనే ప్రభుత్వం గురించి కూడా వివరించి చెబుతోంది. గతంలో సామాజిక పెన్షన్లను వైసీపీ ప్రభుత్వం పంచేది. కానీ అక్కడ ఏ ఒక్క వైసీపీ లీడర్ కాదు కదా కార్యకర్త కూడా ఉండేవారు కాదు. వాలంటీర్ల ద్వారానే అంతా జరిగిపోయేది.
తీరా ఎన్నికల వేళకు వాలంటీరు లేడు వైసీపీ నేతలకు జనంతో కనెక్షన్ కూడా లేకుండా పోయింది. అలా వైసీపీ పధకాలను అమలు చేసినా కూడా క్రెడిట్ ని సాధించుకోలేకపోయింది. చంద్రబాబు అయితే గత పన్నెండు నెలలుగా ఠంచనుగా ప్రజల వద్దకు వెళ్ళి మరీ పెన్షన్ ఇస్తున్నారు.
ఈసారి అయితే పొలాలలో ఉన్న ఉపాధి హామీ కూలీల వద్దకు వెళ్ళి పెన్షన్ ఇచ్చారు. వారి సాధక బాధకాలు తెలుసుకున్నారు. బాబు తో పాటు మంత్రులు మొత్తం టీడీపీ సైన్యం అంతా పంపిణీలో పాలు పంచుకోవడంతో టీడీపీ కూటమికి ఎక్కడ లేని మైలేజ్ దక్కింది అని అంటున్నారు.
