కూటమి బంధం బహు గట్టిది...బాబు లోకేష్ అదే మాట !
ఏ ముహూర్తాన ఏపీలో టీడీపీ జనసేన బీజేపీల మధ్య బంధం కుదిరిందో కానీ ఆ ముహూర్తం గొప్పది అని అంటున్నారు. ఇది పుబ్బలో పుట్టి మఖలో మాడేది కాదని కూడా చెబుతున్నారు.
By: Satya P | 18 Sept 2026 4:00 AM ISTఏ ముహూర్తాన ఏపీలో టీడీపీ జనసేన బీజేపీల మధ్య బంధం కుదిరిందో కానీ ఆ ముహూర్తం గొప్పది అని అంటున్నారు. ఇది పుబ్బలో పుట్టి మఖలో మాడేది కాదని కూడా చెబుతున్నారు. కనీసంగా రెండు దశాబ్దాల దాకా ఈ బంధం కొనసాగుతుందని కూటమి పార్టీలే చెబుతున్నాయి. ఏపీలో కూటమి పొత్తులు దేశానికే స్పూర్తిగా ఉంటున్నాయి, అంతే కాదు రాజకీయ పరిభాషను విశ్లేషణలకు మార్చేసి కొత్త అర్ధాలు చెబుతున్నాయని అంటున్నారు. సాధారణంగా అధికారంలో ఉన్నపుడు ఎంతటి పొత్తు అయినా విచ్చిన్నం అవుతుంది. తమిళనాడులో నాలుగు నెలల క్రితం ఏర్పాటు అయిన టీవీకే కూటమిలో అపుడే చిన్నపాటి అసంతృప్తులు మొదలయ్యాయి. కానీ ఏపీలో 27 నెలలుగా కొనసాగుతున్న కూటమిలో నానాటికీ బంధం మరింతగా పటిష్టం అవుతుందే తప్ప వీడిపోవడం లేదని కూడా తలపండిన రాజకీయ పరిశీలకులే గుర్తు చేస్తున్నారు
కూటమి బంధం విడదీయనిది :
ఈ మాటలు అన్నది ముఖ్యమంత్రి చంద్రబాబు. ఆయన వారణాసిలో నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా నిర్వహించిన కాశీ వాద్‌నగర్ సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమంలో మాట్లాడుతూ ఏపీలో పొత్తుల మీద అలాగే దేశంలో ఎన్ డీయే గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ముందుగా ఏపీ గురించి మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి బంధం విడదీయరానిదని చంద్రబాబు స్పష్టం చేయడం విశేషం. మేం కలిసే ఉన్నామని, భవిష్యత్తులోనూ కలిసే ఉంటామని మన ఐక్యతే దేశానికి బలమని గట్టిగా చెప్పారు. నాయకుడు అంటేనే నరేంద్ర మోదీ అని ఆయన చెప్పడం గమనార్హం. కేంద్రంలో కూడా మోడీ లాంటి సరైన నాయకుడు ఉండటం దేశానికి లభించిన గొప్ప అదృష్టమని బాబు చెప్పారు. సరైన సమయంలో సరైన ప్రదేశంలో మోడీ లాంటి నాయకుడు ఈ రోజు ఉన్నారని చంద్రబాబు అభివర్ణించారు.
ఏపీకి అండగా ఉంటూ :
ఇక కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం ఏపీకి ఎంతగానో అండగా ఉందని చంద్రబాబు చెప్పారు. రాజధాని అమరావతి నిర్మాణం పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎంతో అండగా నిలిచిందని చెప్పారు. సహకార సమాఖ్య స్ఫూర్తి కేవలం నినాదం కాదని అది ఏపీకి సంబంధించి రోజువారీ అనుభవంగా బాబు విశ్లేషించారు. దీనిని బట్టి బాబు మరిన్ని ఎన్నికల్లో ఏపీలో ఎన్డీయేతో పొత్తు ఉంటుందని స్పష్టం చేశారు. విడదీయరాని బంధం అని ఆయన చెప్పడం చూస్తే ఎన్ డీయేలో టీడీపీ అత్యంత నమ్మకమైన పార్టీగా ఉందని గుర్తు చేస్తున్నారు.
లోకేష్ చెప్పింది కూడా :
ఇక ఒక రోజు ముందు నెల్లూరు జిల్లాలో పార్టీ కార్యకర్తల సమావేశంలో మంత్రి టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ కూడా అదే చెప్పారు. ఒక ఎన్నిక కాదు మరో మూడు ఎన్నికలలో కూటమి కలిసికట్టుగా ముందుకు సాగుతుందని లోకేష్ స్పష్టం చేశారు. అంటే 2029, 2034, 2039 ఎన్నికల్లో సైతం కూటమిగానే వస్తామని లోకేష్ పక్కాగా క్లారిటీ ఇచ్చినట్లు అయింది. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తరచూ ఇదే విషయం చెప్పడం కూడా అంతా చూస్తూ వస్తున్నారు. బీజేపీ కేంద్రంలో ఎపుడూ మిత్రులను తానుగా వదులుకున్న చరిత్ర లేదు, దాంతో 2018 లో టీడీపీ తానుగానే కూటమి నుంచి వెళ్ళిపోయింది అని ఫ్లాష్ బ్యాక్ గురించి చెబుతున్నారు. ఇపుడు అలాంటి పరిస్థితి రాదని టీడీపీ పెద్దలే అంటున్నారు. దాంతో ఏపీలో టీడీపీ కూటమి 2024 ఎన్నికల ముందు కంటే మరింత బలోపేతం అయిందని అంటున్నారు. అంతే కాదు జాతీయ రాజకీయాల్లో టీడీపీ తన స్టాండ్ ఏమిటో చెప్పి దానిని శాశ్వతం కూడా చేస్తోంది. ఇవనీ చూసినపుడు ఏపీలో కూటమి చెక్కు చెదరదని అలా అవుతుందని ఎవరైనా అనుకుంటే అది పూర్తిగా భ్రమలే అని అర్ధం అవుతోంది.
