Begin typing your search above and press return to search.

తమ్ముళ్లు గెలిచి బాబును ఓడించేశారా? టీడీపీలో కొత్త కల్చర్!

రాజకీయాల్లో రాజకీయం అవసరమే కానీ అదే మొత్తం కాకూడదన్న వాదనను వినిపించే అధినేతల్లో టీడీపీ అధినేత చంద్రబాబు ఒకరు

By:  Garuda Media   |   23 Oct 2026 12:43 PM IST
తమ్ముళ్లు గెలిచి బాబును ఓడించేశారా? టీడీపీలో కొత్త కల్చర్!
X

రాజకీయాల్లో రాజకీయం అవసరమే కానీ అదే మొత్తం కాకూడదన్న వాదనను వినిపించే అధినేతల్లో టీడీపీ అధినేత చంద్రబాబు ఒకరు. దేశ రాజకీయ చరిత్రలో నమ్మిన సిద్ధాంతాన్ని పక్కాగా ఫాలో అయ్యే అధినేతల నుంచి అవసరాలకు అనుగుణంగా సిద్ధాంతాల్ని పాక్షికంగా మార్పులు చేర్పులు చేసుకుంటూ ముందుకు సాగిన రాజకీయ తరానికి చెందిన అధినేతగా చంద్రబాబును చెప్పొచ్చు. అలాంటి ఆయన రాజకీయాల్లో అధిక్యత కోసం తనను తాను మార్చుకున్న తన కోర్ సిద్ధాంతాన్ని మార్చుకున్న దాఖలాలు ఇప్పటివరకు కనిపించదు. ప్రత్యర్థి పార్టీలు ఎంత దూకుడు ప్రదర్శించినా.. కొంత పెద్దరికాన్ని ప్రదర్శించాలన్న తీరును ఆయన అనుసరిస్తుంటారు.

క్యాడర్ ఎంతగా అరిచి గీపెట్టినా.. దూకుడు.. దుందుడుకు రాజకీయాలను ప్రదర్శించే విషయంలో ఆయన నెమ్మదితనాన్ని ప్రదర్శించటం కనిపిస్తుంది. నేతలు.. క్యాడర్ నుంచి ఒత్తిడి వచ్చినా.. సరేనంటూ తన మార్క్ రాజకీయం నుంచి బయటకు రావటం కనిపించదు. ఈ కారణంతోనే చంద్రబాబును అమితంగా ఆరాధించే టీడీపీ అభిమానులు సైతం ఆయనపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తుంటారు. ఆయన రాజకీయ జీవితంలో ఒక దశ వరకు కాలానికి అనుగుణంగా మార్పుల్ని ఆహ్వానించినప్పటికి.. దూకుడు రాజకీయాల విషయంలో మాత్రం ఆయన తనను తాను మార్చుకునే విషయంలో వెనుకబడి ఉన్నారన్న విమర్శ సొంత పార్టీ నుంచే బలంగా వినిపించే పరిస్థితి.

ఈ తీరుకు తాజాగా ఏపీలో జరుగుతున్న స్థానిక ఎన్నికలతో చెక్ పడినట్లే. 2024 ఎన్నికలకు ముందు చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలు.. చంద్రబాబు సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎప్పుడూ ఎదుర్కోని గడ్డు పరిస్థితులు మాత్రమే కాదు.. వారాల తరబడి జైలు జీవితాన్ని చవిచూసిన చంద్రబాబు తనను తాను మార్చుకునే విషయంలో గతంలో పెట్టుకున్న పరిమితుల్ని పక్కన పెట్టేశారని చెప్పాలి. అలా అని పూర్తిగా కాకున్నా.. పాక్షికంగా సడలించేశారు. అలా అని తాజా మార్పులకు తాను ప్రత్యక్షంగా ప్రోత్సహిస్తున్నానన్న అపవాదు రాకుండా.. వ్యూహాత్మక మౌనాన్ని ఆశ్రయిస్తున్నట్లుగా చెప్పాలి.

తెలుగుదేశం పార్టీకి రథసారధిగా పగ్గాలు చేపట్టిన నాటి నుంచి ఇప్పటివరకు ఒకలా వ్యవహరించిన చంద్రబాబు.. తాజాగా జరుగుతున్న స్థానిక ఎన్నికల వేళ వ్యవహరిస్తున్న తీరుకు స్పష్టమైన మార్పు ఉందన్న మాట బలంగా వినిపిస్తోంది. తన రాజకీయ ప్రత్యర్థికి ఏ మాత్రం తీసిపోని విధంగా క్యాడర్ ను ప్రోత్సహించక తప్పని పరిస్థితులు చంద్రబాబుకు ఎదురైనట్లుగా చెబుతున్నారు. పాతకాలపు సౌమ్య రాజకీయ శైలికి భిన్నంగా పార్టీ మారకపోతే.. రానున్నరోజుల్లో మరిన్ని ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయన్నవాదనకు తలొగ్గినట్లుగా కనిపిస్తోంది. ఈ కారణంగానే ప్రత్యర్థి వైసీపీ దూకుడుకు తగ్గట్లే తాము కూడా దూకుడు ప్రదర్శిస్తే..తమకు ముకుతాడు వేసే పగ్గాలు చంద్రబాబు నుంచి తప్పించినట్లుగా చెప్పాలి. ఇదంతా చూస్తున్న కొందరు చంద్రబాబును ఓడించి తమ్ముళ్లు గెలిచేశారన్న వ్యంగ్య వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే.. ఇందులో నిజం ఎంతన్నది చూస్తే మాత్రం విషయం మరోలా కనిపిస్తుంది.

పాత పద్దతుల్ని పాటించే విషయంలో చంద్రబాబు దారిని వదిలేసి..లోకేశ్ యువ నాయకత్వంలో దెబ్బకు దెబ్బ అదే అధికారాన్ని తమకు సొంతం చేస్తుందన్న వాదనకు టీడీపీ క్యాడర్ షిఫ్ట్ అయ్యిందని చెప్పాలి. తెగింపు.. మొరటుతనంతోనే ప్రత్యర్థిని ఢీకొట్టాలే తప్పించి..పాతకాలం సౌమ్య విధానాన్ని పాటిస్తే పార్టీ మొత్తంగా మునుగుతుందన్న వాదనను నమ్మినట్లుగా కనిపిస్తోంది. మొత్తంగా చూస్తే.. ఏపీలో జరుగుతున్న తాజా స్థానిక ఎన్నికల సందర్భంగా టీడీపీ నేతలు.. క్యాడర్ వ్యవహారశైలి చూస్తే.. తెలుగుదేశం కొత్త తరం పగ్గాల్ని పూర్తిగా తీసేసుకున్నట్లుగా కనిపిస్తోంది. మార్పును అంగీకరిస్తూ.. మారిన కాలానికి అనుగుణంగా రాజకీయ వ్యూహరచన చేసే యువ నాయకత్వాన్ని చంద్రబాబు మౌనంగా చూస్తున్నట్లుగా చెబుతున్నారు.