టీవీకేపై నో కామెంట్.. చంద్రబాబు స్పందన ఆసక్తికరం
తమిళనాడులో కొత్తగా పార్టీని ప్రారంభించి, ఎన్నికలను త్రిముఖ పోటీగా మార్చేసిన విజయ్ పార్టీపై తాను ఎలాంటి కామెంట్ చేయనని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు.
By: Tupaki Political Desk | 20 April 2026 5:40 PM ISTతమిళనాడులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన ప్రారంభమైంది. ఎన్డీఏ కూటమి తరఫున ఎన్నికల ప్రచారం కోసం వచ్చిన సీఎం చంద్రబాబు ముందుగా కోయంబత్తూరులో పలువురు ప్రముఖులతో ముఖాముఖి సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాతోనూ మాట్లాడారు. ముందుగా తమిళంలో తన ప్రసంగాన్ని ప్రారంభించిన చంద్రబాబు సభికులను ఆకట్టుకున్నారు. అనంతం మాతృభాష తెలుగులో తన ప్రసంగాన్ని కొనసాగించారు. ఇక ఎన్డీఏ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు, అధికార డీఎంకే-కాంగ్రెస్ పార్టీతో చేతులు కలపడాన్ని ఆక్షేపించారు. ఇదే సందర్భంలో దళపతి విజయ్ స్థాపించిన టీవీకే పార్టీపై స్పందించాల్సిందిగా విలేఖరులు కోరగా, చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
తమిళనాడులో కొత్తగా పార్టీని ప్రారంభించి, ఎన్నికలను త్రిముఖ పోటీగా మార్చేసిన విజయ్ పార్టీపై తాను ఎలాంటి కామెంట్ చేయనని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో ప్రజలే తీర్పు నిస్తారని స్పష్టం చేశారు. కొత్తగా పార్టీ పెట్టి తమిళనాడులో రెండు ప్రధాన పార్టీలకు చెమటలు పట్టిస్తున్నట్లు ప్రచారం జరుగుతున్న టీవీకేను ముఖ్యమంత్రి చంద్రబాబు తేలిగ్గా తీసుకున్నట్లు మాట్లాడటం చర్చనీయాంశంగా మారింది. అయితే కొత్తగా పార్టీ పెట్టిన విజయ్ ని విమర్శించి ప్రాధాన్యం పెంచడం ఎందుకన్న వ్యూహమే చంద్రబాబు అలా మాట్లాడేందుకు కారణమై ఉంటుందని అంటున్నారు.
మరోవైపు తమిళనాడు ప్రచారంలో అధికార డీఎంకే పార్టీపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ను వ్యతిరేకిస్తూ అన్నాదురై 1967లో డీఎంకే పార్టీని ప్రారంభిస్తే, స్టాలిన్ నాయకత్వంలోని ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేయడాన్ని ఆక్షేపించారు. శ్రీలంకలో తమిళుల కష్టాలకు కాంగ్రెస్, డీఎంకే కారణమని చంద్రబాబు ఆరోపించారు. తమిళనాడు ప్రయోజనాలతోపాటు దేశ ప్రగతి కోరుకునే పార్టీలను గుర్తు పెట్టుకోవాలని కోరారు.
అన్నాడీఎంకే అంటే అందరికీ జయలలిత గుర్తుకు వస్తారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. జయలలిత బతికి ఉన్నప్పుడు తాను కోయంబత్తూరు వచ్చి ఎన్నికల ప్రచారం చేశానని చంద్రబాబు గుర్తు చేశారు. ఆ ఎన్నికల్లో జయలలిత గెలిచారని, ఆ తర్వాత తాను జయలలిత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే కార్యక్రమానికి సైతం హాజరయ్యానని వెల్లడించారు. ఈ ఎన్నికల్లో కూడా ఏడీఎంకే, బీజేపీ కూటమి గెలుస్తుందని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు.
