రేవంత్, స్టాలిన్ ఏం సాధించారు.. సీఎం చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు
తమిళనాడు, తెలంగాణ ముఖ్యమంత్రులు ఎంకే.స్టాలిన్, రేవంత్ రెడ్డిపై ఏపీ సీఎం చంద్రబాబు మండిపడ్డారు.
By: Tupaki Political Desk | 21 April 2026 3:05 PM ISTతమిళనాడు, తెలంగాణ ముఖ్యమంత్రులు ఎంకే.స్టాలిన్, రేవంత్ రెడ్డిపై ఏపీ సీఎం చంద్రబాబు మండిపడ్డారు. మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లులను అడ్డుకుని డీఎంకే, కాంగ్రెస్ ఏం సాధించాయని నిలదీశారు. తమిళనాడు ఎన్నికల ప్రచారం నిమిత్తం ఆ రాష్ట్రంలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు భవిష్యత్తులో జనాభా లెక్కల ప్రకారం డీలిమిటేషన్ జరిగితే దక్షిణాదికి అన్యాయమే జరుగుతుందని స్పష్టం చేశారు. 50 శాతం పెంపు ప్రతిపాదనను వ్యతిరేకించి డీఎంకే, కాంగ్రెస్ పార్టీలు తప్పుచేశాయని సీఎం అభిప్రాయపడ్డారు.
తమిళనాడు రాజధాని చెన్నైలో మీడియాతో ఇష్టాగోష్టి నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు అనేక అంశాలపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తన శిష్యుడు రేవంత్ రెడ్డి పేరు నేరుగా ప్రస్తావించకపోయినా, కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించడం ద్వారా రేవంత్ రెడ్డి వైఖరిని చంద్రబాబు తప్పుపట్టారని అంటున్నారు. ఇక డీఎంకేపై నేరుగా విమర్శలు చేయడం ద్వారా తన పాత మిత్రుడు, ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా తప్పు చేశారని చంద్రబాబు తేల్చేశారని వ్యాఖ్యానిస్తున్నారు.
తమిళ ప్రజల భవిష్యత్తు కోసమే తాను ఎన్నికల ప్రచారానికి వచ్చానని చెప్పారు. దేశాభివృద్ధికి ప్రధాని నరేంద్ర మోదీ ముందు చూపుతో ఆలోచిస్తున్నారని కొనియాడారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏకు ఓటు వేయాలని ఆయన కోరారు. డీఎంకే పాలనలో రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు ఉదాహరణగా రాష్ట్రంలో పెరిగిన కస్టోడియల్ మరణాలను ఆయన ఎత్తిచూపారు. అదేవిధంగా ఒకప్పుడు పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన కోయంబత్తూరు ఎలాంటి ఎదుగుబొదుగు లేకుండా ఉండిపోయిందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.
తాము ఏపీలో వేల ఎకరాల్లో విమానాశ్రయాలను నిర్మిస్తుంటే తమిళనాడులో ఇంకా చిన్న విమానాశ్రయాలే ఉన్నాయని అన్నారు. ఒకప్పుడు దేశంలో ఎక్కడికి వెళ్లాలన్నా చెన్నై వచ్చి విమానం ఎక్కేవారని, కానీ ఇప్పుడు చెన్నై వాసులు ఇతర ప్రాంతాలకు వస్తున్నారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. చెన్నైతో పోల్చుకుంటే బెంగళూరు, హైదరాబాద్ వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. చెన్నైలో మౌలిక సదుపాయాల పరంగా ఎలాంటి మార్పు లేదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. 1995 నుంచి చాలా రోడ్లు అలానే ఉన్నాయని, వర్షం పడితే నగరం ముంపు బారిన పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రకాశవంతమైన భవిష్యత్తు కోసం మంచి ఉద్యోగ అవకాశాలు కావాలంటే ప్రజలు ఈ సారి జాగ్రత్తగా, తెలివిగా ఓటు వేయాలని పిలుపునిచ్చారు.
