చంద్రబాబు స్మార్ట్ వర్క్.. ఇప్పుడు కావాల్సిందిదే కదా?
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పనితీరు పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు పని రాక్షసుడిగా అందరినీ భయపెట్టిన చంద్రబాబు.. ఇప్పుడు స్మార్ట్ వర్కుకే ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారు.
By: Tupaki Desk | 29 Oct 2025 10:54 AM ISTఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పనితీరు పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు పని రాక్షసుడిగా అందరినీ భయపెట్టిన చంద్రబాబు.. ఇప్పుడు స్మార్ట్ వర్కుకే ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారు. గతంలో రోజుకు 18 గంటల చొప్పున పనిచేసి తాను నిద్రపోక, చుట్టుపక్కల ఉన్నవారెవరినీ నిద్రపోనివ్వక ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు, సిబ్బందికి సింహస్వప్నంలా కనిపించిన చంద్రబాబులో పూర్తిగా భిన్నమైన వైఖరి కనిపిస్తోందని అంటున్నారు. ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య సెక్రటేరియట్ కు వస్తున్న చంద్రబాబు సాయంత్రం 6 గంటలకల్లా తిరిగి ఇంటికి వెళ్లిపోతున్నారు. దీంతో సచివాలయ ఉద్యోగులు కూడా ఊపిరిపీల్చుకుంటున్నారు.
ఇక విపత్తుల సమయాల్లో అధికారుల సూచనలు పట్టించుకోకుండా క్షేత్ర స్థాయి పర్యటనలకు వెళ్లి సహాయక, చర్యలను పర్యవేక్షించడానికి ప్రాధాన్యమిచ్చే సీఎం చంద్రబాబు.. ఆ పద్ధతికి వీలైనంత దూరంగా ఉంటున్నట్లు ప్రస్తుత పరిస్థితులు తెలియజేస్తున్నాయని అంటున్నారు. మొంథా తుఫాను విషయంలో చంద్రబాబు స్మార్టుగా పనిచేసి ఫలితం సాధించారని చెబుతున్నారు. సోమ, మంగళవారాల్లో సెక్రటేరియట్ నుంచే తుఫాను పరిస్థితులపై సమీక్షించిన చంద్రబాబు అధికారులకు దిశానిర్దేశం చేశారు. గతంలో వలే కాకుండా తాను కంగారు పడకుండా, అధికారులను హడలెత్తించకుండా చాలా శాంతంగా పనిచేయడం వల్ల మంచి ఫలితం వచ్చిందని అంటున్నారు.
మొంథా తుఫాను ప్రభావం తీవ్రంగా ఉంటుందని తెలిసిన వెంటనే రంగంలోకి దిగిన సీఎం చంద్రబాబు, ప్రభుత్వంలో అన్ని శాఖలు, అన్ని జిల్లాల అధికారులను అప్రమత్తం చేశారు. జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు చేయించడంతోపాటు ప్రత్యేక అధికారులను నియమించారు. అంతేకాకుండా మంత్రులు, ప్రత్యేకాధికారులను జిల్లాలకు పంపి నేరుగా సచివాలయం నుంచే పర్యవేక్షించారు. అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు చెప్పిన సమాచారానికే పరిమితం కాకుండా, రాష్ట్రంలో ప్రతి ఊరిలోను ఉన్న ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రానికి అనుసంధానించి అక్కడి నుంచే ఏం జరుగుతుందో ప్రత్యక్షంగా తెలుసుకునేవారు. దీంతో సేవల్లో ఎక్కడా లోపం లేకుండా అధికారులు పనిచేశారు.
ఇక మంగళవారం రాత్రి తుపాను విరుచుపడిన తరువాత కరెంటు సరఫరాకు ఆటంకం ఏర్పడింది. దీన్ని ముందుగానే గమనించిన సీఎం చంద్రబాబు ఏ ప్రాంతంలో విద్యుత్ అంతరాయం ఉంటుందనే విషయాన్ని కచ్చితంగా అంచనా వేసి ప్రత్యేక బృందాలను ముందుగానే రెడీ చేశారు. తుఫాను ప్రభావం తగ్గిన వెంటనే వీరు రంగంలోకి కరెంటు సరఫరాను పునరుద్ధరించేలా జాగ్రత్తలు తీసుకున్నారు. నిజానికి విపత్తుల నిర్వహణలో చంద్రబాబుకు ప్రత్యేక మేనేజిమెంట్ స్కిల్ ఉంటుందని చెబుతున్నారు. విపత్కాలంలో ఆయన స్పందించే తీరు ప్రజలను ఫిదా చేస్తుంది. అయితే గతంలో తీవ్రంగా కష్టపడి ఇతరులను సైతం తనలా కష్టపడేలా చేయడానికి శ్రమించే చంద్రబాబు ఈ సారి మాత్రం చాలా స్మార్టుగా ఫలితం సాధించారని ప్రశంసలు అందుకుంటున్నారు.
