Begin typing your search above and press return to search.

అసెంబ్లీని బహిష్కరించడం చరిత్రలోనే లేదు : చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

ప్రజాస్వామ్యంలో అత్యున్నత వేదిక అసెంబ్లీ అని, అసెంబ్లీని ఐదేళ్లపాటు బహిష్కరించాలని నిర్ణయించుకున్న పార్టీని తాను జీవితంలో చూడలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు.

By:  Tupaki Desk   |   19 Aug 2026 3:17 PM IST
అసెంబ్లీని బహిష్కరించడం చరిత్రలోనే లేదు : చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
X

ప్రజాస్వామ్యంలో అత్యున్నత వేదిక అసెంబ్లీ అని, అసెంబ్లీని ఐదేళ్లపాటు బహిష్కరించాలని నిర్ణయించుకున్న పార్టీని తాను జీవితంలో చూడలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ గైర్హాజరు అవుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు తొలిసారిగా మాట్లాడారు. రెండేళ్లుగా వైసీపీ ఎప్పుడూ సభకు రాకపోయినా, పెద్దగా పట్టించుకోని ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ సారి మాత్రం వైసీపీపై ఒత్తిడి పెంచేలా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజాసమస్యలపై అసెంబ్లీకి వచ్చి మాట్లాడితేనే విలువ ఉంటుందని, అంతేకాని బయట ఎక్కడో కూర్చుని మాట్లాడటం వల్ల ఉపయోగం ఉండదని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య దేవాలయం వంటి అసెంబ్లీని బహిష్కరించడం చరిత్రలోనే లేదని చంద్రబాబు తెలిపారు.

అసెంబ్లీ వర్షాకాల సమావేశాల సందర్భంగా మూడో రోజు సభకు హాజరయ్యేందుకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీ ఆవరణలో తన కార్యాలయం వద్ద మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. విపక్షం వైసీపీ ఐదేళ్లపాటు సభను బహిష్కరించడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. గత అసెంబ్లీలో తాను అసెంబ్లీకి రాకపోయిన తమ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలకు హాజరైన విషయాన్ని గుర్తు చేశారు. 1978లో జైపాల్ రెడ్డి, వెంకయ్యనాయుడు మాత్రమే ప్రతిపక్ష సభ్యులుగా ఉన్నప్పటికీ అసెంబ్లీలో వివిధ అంశాలపై చర్చించేవారని చంద్రబాబు తెలిపారు. అదేవిధంగా 1989-91 మధ్య తమ నాయకుడు ఎన్టీఆర్ అసెంబ్లీకి రాకపోయినా, తాము వెళ్లేవారమని వివరించారు.

ప్రస్తుతం ప్రతిపక్ష హోదా లేనిదే అసెంబ్లీకి రామని చెబుతున్న వైసీపీ తీరును చంద్రబాబు ఆక్షేపించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో శాసనసభ అత్యున్నత వేదిక అని, ప్రజా సమస్యలపై ఎక్కడో బయట కూర్చుని ఎంత మాట్లాడినా దానికి తగిన విలువ ఉండదని సీఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు. కేవలం అసెంబ్లీ వేదికగా ప్రభుత్వాన్ని నిలదీసి, సమస్యలపై చర్చిస్తేనే ప్రజలకు నిజమైన న్యాయం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రజలు ఎమ్మెల్యేలను సమస్యలపై గట్టిగా పోరాడేందుకే ఎన్నుకుంటారు గానీ, సభకు హాజరుకాకుండా పారిపోయేందుకు కాదని ఆయన హితవు పలికారు.

సొంత రాజకీయ ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ, తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో మొత్తం అసెంబ్లీని బహిష్కరించిన ఉదంతాన్ని తాను ఎప్పుడూ చూడలేదని చంద్రబాబు స్పష్టం చేశారు. 2019-24 మధ్య తాము కూడా సభలో తీవ్ర సవాళ్లను ఎదుర్కొంటూనే ప్రజా సమస్యలపై చివరి వరకు పోరాడామని, అసెంబ్లీలో చేసిన ఆ పోరాటమే అందరిలోనూ ఆలోచనలను రేకెత్తించిందని తెలిపారు. ప్రతిపక్షం బాధ్యతాయుతంగా వ్యవహరించి సభకు రావాలని, ప్రజా సమస్యలపై చర్చించేందుకు దమ్ముంటే అసెంబ్లీకి రావాలని ఆయన సవాల్ విసిరారు. ప్రభుత్వంలో ఉంటేనే అసెంబ్లీకి వస్తాం, లేదంటే వచ్చేది లేనట్లు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి వ్యవహరిస్తున్న తీరును ఆయన తప్పుబట్టారు. ఎమ్మెల్యేగా గెలిచిన నేతలు తమ బాధ్యత నెరవేర్చకపోవడం సరికాదన్నారు. ఇక గ్రూప్ - 1 అక్రమాలు కప్పిపుచ్చుకోడానికే డీఎస్సీపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. దేవాలయం వంటి అసెంబ్లీని అవమానిస్తున్నారని మండిపడ్డారు.