మహిళా బిల్లు దేవునికే తెలియాలి..బాబు మార్క్ కామెంట్స్
మహిళా బిల్లు ఎప్పుడు పాస్ అవుతుందో ఆ దేవునికే తెలియాలి అంటూ చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు.
By: Satya P | 19 April 2026 12:03 AM ISTమహిళా బిల్లు ఎప్పుడు పాస్ అవుతుందో ఆ దేవునికే తెలియాలి అంటూ చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. అంతే కాదు కాంగ్రెస్ మిత్ర పక్షాలు మహిళా బిల్లు ఆమోదం పొందకుండా అడ్డుకోవడం మీద ఆయన ఫైర్ అయ్యారు. 1996 నుంచి 2026 వరకూ 30 ఏళ్లుగా కాంగ్రెస్ దాని మిత్రులు మోసం చేస్తూనే ఉన్నారని బాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మహిళా రిజర్వేషన్ల బిల్లుకు మద్దతుగా తాము 2017లోనే అసెంబ్లీలో తీర్మానం చేశామని గుర్తు చేశారు. అయితే కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు మహిళలకు చేసిన మోసంపై ప్రజా చైతన్యం తీసుకొస్తామని ఆయన స్పష్టం చేశారు. మహిళలను చట్టసభల్లో చూడాలన్నది తన ఆకాంక్ష అని బాబు చెప్పడం విశేషం.
టార్గెట్ కాంగ్రెస్ :
కాంగ్రెస్ పార్టీ ఏపీలో ఉనికి పోరాటం చేస్తోంది. ఆ ప్లేస్ లో వైసీపీ పుట్టుకొచ్చింది. దాంతో ఏపీలో టీడీపీ వర్సెస్ వైసీపీగా పొలిటికల్ వార్ సాగుతోంది. మరో వైపు చూస్తే జాతీయ స్థాయిలో ఎన్డీయేకు ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ కూటమి ఉంది. అయితే బాబు జాతీయ స్థాయి రాజకీయాల గురించి పెద్దగా మాట్లాడడం లేదు. దాంతో కాంగ్రెస్ ని ఎక్కడా విమర్శించాల్సిన సందర్భం కానీ అవసరం కానీ లేకుండా పోయింది. కానీ చాలా కాలం తరువాత కాంగ్రెస్ గురించి బాబు గట్టిగా మాట్లాడాల్సి వచ్చింది. మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్ లో వీగిపోయిన నేపథ్యంలో ఎన్డీయే పక్ష నేతలు అంతా కాంగ్రెస్ ని గట్టిగా విమర్శిస్తున్నారు. దాంతో చంద్రబాబు కూడా కాంగ్రెస్ మీద తీవ్ర స్థాయిలో ఎటాక్ చేస్తున్నారు.
మోసం చేయడం అలవాటు :
మహిళలను మోసం చేయడం కాంగ్రెస్ కి అలవాటు అని చంద్రబాబు నిడదవోలు సభలో తీవ్రంగా విమర్శించారు. అసలు మహిళల ఓట్లు అడిగే పార్టీలు రిజర్వేషన్ బిల్లు అడ్డుకోవడమేంటి అని ఆయన ప్రశ్నించారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలయ్యే దాకా పోరాడతామని చంద్రబాబు స్పష్టం చేశారు. కాంగ్రెస్ నేతృత్వంలోని మిత్రపక్షాలు సహకరిస్తే మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందేదని ఆయన అన్నారు. మహిళలకు వ్యతిరేకంగా పనిచేసే పార్టీలు ఎన్నటికీ మనుగడ సాగించలేవని చంద్రబాబు చెప్పుకొచ్చారు ఆడబిడ్డలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని కేంద్రం బిల్లు పెడితే కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్షాలు అడ్డుకున్నాయని బాబు మండిపడ్డారు.
సమాధానం చెప్పాలి :
అసలు మహిళలకు సంబంధించిన రిజర్వేషన్ల బిల్లుని ఎందుకు అడ్డుకున్నారో కాంగ్రెస్ మిత్ర పార్టీలు సమాధానం చెప్పాలని బాబు డిమాండ్ చేశారు. 1996లో దేవెగౌడ ప్రధానిగా ఉన్నప్పుడు.తాను యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్ గా ఉన్నపుడు తొలిసారిగా ఆనాడు మహిళా రిజర్వేషన్ బిల్లు పెట్టేందుకు నిర్ణయించామని బాబు చెప్పారు అయితే ఈ బిల్లుకు కాంగ్రెస్ సపోర్టు చేసేందుకు ఒప్పుకోకపోవడంతో విత్ డ్రా చేసుకోవాల్సి వచ్చిందని గతాన్ని గుర్తు చేశారు. ఆ తర్వాత ప్రధానిగా వాజ్ పేయి హయాంలో నాలుగు సార్లు బిల్లు తెచ్చారని, కానీ ప్రతిసారీ బిల్లు పాస్ కాకుండా కాంగ్రెస్ పార్టీనే అడ్డుకుందని బాబు ఫైర్ అయ్యారు. అంతే కాదు 2010లో యూపీఏ అధికారంలో ఉండగా మహిళా బిల్లు రాజ్యసభలో ఆమోదించారు. దాన్ని బీజేపీ కూడా సమర్థించిందని అన్నారు. కానీ లోక్ సభకు బిల్లు తీసుకురాకుండా మహిళలకు కాంగ్రెస్ ద్రోహం చేసిందని బాబు విమర్శించారు.
అన్యాయం జరగదు :
దేశంలో చిన్న రాష్ట్రాలు, దక్షణాది రాష్ట్రాలకు డీ లిమిటేషన్ వల్ల అన్యాయం జరుగుతుందంటున్నారని అసలు ఆ లాజిక్ ఏంటో తనకు అర్ధం కావడం లేదని బాబు అన్నారు. ప్రస్తుతం ఉన్న సీట్ల కంటే 50 శాతం పెరుగుతాయని పార్లమెంటు సాక్షిగా హోం మంత్రి అమిత్ షా స్పష్టం చేశారని గుర్తు చేశారు. ఇక కాంగ్రెస్ పార్టీ నేతలు మహిళా బిల్లు విషయంలో చేస్తున్న మోసాలను ఎండగడతామని బాబు అన్నారు.
