Begin typing your search above and press return to search.

చంద్ర‌బాబు సింగ‌పూర్ టూర్‌-కొన్ని రాజ‌కీయాలు ..!

సీఎం చంద్రబాబు ఈనెల 26 నుంచి సింగపూర్లో పర్యటించనున్నారు. ఆయన వెంట మంత్రులు నారా లోకేష్, టీ జీ భరత్ కూడా సింగపూర్ కు వెళ్తారు

By:  Tupaki Desk   |   25 July 2025 9:00 PM IST
చంద్ర‌బాబు సింగ‌పూర్ టూర్‌-కొన్ని రాజ‌కీయాలు ..!
X

సీఎం చంద్రబాబు ఈనెల 26 నుంచి సింగపూర్లో పర్యటించనున్నారు. ఆయన వెంట మంత్రులు నారా లోకేష్, టీ జీ భరత్ కూడా సింగపూర్ కు వెళ్తారు. దాదాపు ఆరు రోజులు పాటు సింగపూర్లో పర్యటించే ముఖ్యమంత్రి.. అమరావతి రాజధాని సహా రాష్ట్రంలో పెట్టుబడులకు సంబంధించిన అంశాలపై అక్కడి వ్యాపారవేత్తలు ప్రభుత్వ ప్రతినిధులు, అధికారులతో చర్చించనున్నారు. ఈ మేర‌కు రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్న మాట. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏర్పాట్లు చేసింది.

సుమారు 30 మందితో కూడిన బృందంతో సీఎం చంద్రబాబు సింగపూర్ కు వెళ్తారని తెలుస్తోంది. అయితే మూడు నెలల కిందట దావోస్ లో పర్యటించి పెట్టుబడులు తెచ్చామని సీఎం చంద్రబాబు చెప్పారు. కానీ.. దావోస్ లో ఒప్పందం కుదుర్చుకున్న ఒక కంపెనీ కూడా ఇప్పటివరకు ఏపీకి రాకపోవడం ఒక విషయం అయితే.. ఇప్పుడు మళ్లీ పెట్టుబడుల పేరుతో సింగపూర్ కు వెళుతుండటం.. దీనికి సుమారు 40 నుంచి 50 కోట్ల వరకు ఖర్చు పెడుతున్నారనేది ప్రత్యర్థులు చేస్తున్న ఆరోపణ.

దీనిపై ప్రభుత్వం సైలెంట్ గా ఉన్నప్పటికీ సోషల్ మీడియా సహా ఇతర సామాజిక మాధ్య‌మాల్లో ఇది చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి సింగపూర్ పర్యటన వెనుక మరో కారణం కూడా ఉందని తెలుస్తోంది. అమరావతి రాజధానికి సంబంధించిన పెట్టుబడుల విషయంలో వైసిపి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోందని.. రాజధానికి పెట్టుబడులు రాకుండా చేసేందుకు తనవంతు ప్రయత్నం చేస్తుందన్నది రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కాలంలో చెబుతున్న మాట.

అమరావతి రాజధాని కి సంబంధించిన పెట్టుబడులు.. అధిక మొత్తంలో సింగపూర్ నుంచి రావాల్సి ఉంది. అయితే, వీటిని వైసిపి అడ్డుకుంటున్న క్రమంలో వాటిపై వివరణ ఇచ్చేందుకు ఏ ఏ కారణాలతో వైసిపి ప్రచారం చేస్తుందో వాటిని తిప్పికొట్టేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని అందుకే ఆయన విదేశీ పర్యటనకు వెళ్తున్నారనేది మరో వాదన వినిపిస్తోంది. దీనికి తోడు పి-ఫోర్ పథకంలో భాగంగా సింగపూర్ నుంచి ప్రవాస ఆంధ్రులను ఏపీకి రప్పించి కొన్ని గ్రామాలు కుటుంబాలను దత్తతకు ఇవ్వాలన్న ఉద్దేశం కూడా ఉందని తెలిసింది.

దీనిపై ప్రత్యేక కార్యాచరణ కూడా రూపొందించారని తెలుస్తోంది. ఏదేమైనా సింగపూర్ పర్యటన అత్యంత కీలకంగా అదేవిధంగా అత్యంత ప్రాధాన్యంగా మారింది. ఇదే సమయంలో దీనిపై విమర్శలు కూడా వస్తుండడం గమనార్హం. మ‌రి ప్ర‌భుత్వం ఏం చెబుతుందో చూడాలి.