మోడీ ప్రసంగానికి చంద్రబాబు ముందుమాట!
ఆశ్చర్యం కాదు నిజమే. `ఆపరేషన్ సిందూర్` నేపథ్యంలో జాతిని ఉద్దేశించి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సోమవారం రాత్రి 8 గం టలకు టీవీలో ప్రసంగించారు.
By: Tupaki Desk | 13 May 2025 6:31 AMఆశ్చర్యం కాదు నిజమే. `ఆపరేషన్ సిందూర్` నేపథ్యంలో జాతిని ఉద్దేశించి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సోమవారం రాత్రి 8 గం టలకు టీవీలో ప్రసంగించారు. ఆయన ప్రసంగాన్ని భారతీయులు ఎంతో జాగ్రత్తగా ఆలకించారు. పాకిస్థాన్ కు గట్టిగా బుద్ధి చెప్పేందుకు యావత్ భారత దేశం సంసిద్ధంగా ఉందన్న సంకేతాలను మోడీ బలంగా వినిపించారు. ఉగ్రవాదం-చర్చలు, ఉగ్రవాదం-వాణిజ్యం, నీరు-నెత్తురు కలిసి ప్రయాణించలేవని కుండబద్దలు కొట్టారు. తద్వారా భారత్ ఏం ఆశిస్తోందో.. మోడీ చెప్పనే చెప్పారు. కాగా.. మోడీ ప్రసంగాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు తన నివాసంలోనే స్వయంగా వీక్షించారు.
అనంతరం.. సామాజిక మాధ్యమం `ఎక్స్`లో చంద్రబాబు సుదీర్ఘ పోస్టు రాసుకొచ్చారు. యావత్ భారతం ప్రధాని నరేంద్ర మోడీ వెంటే ఉంటుందన్నారు. ``ప్రధాని మోడీ కేవలం మాట్లాడటమే కాదు, భారతదేశ కొత్త సిద్ధాంతాన్ని రూపొందించారు. ఆయన ప్రసంగం పాకిస్థాన్ ప్రాయోజిత ఉగ్రవాదులకు కఠినమైన హెచ్చరిక. ప్రపంచానికి బలాన్ని తెలియజేసే స్పష్టమైన సందేశం. `` అని చంద్రబాబు పేర్కొన్నారు. అంతేకాదు.. ``నేడు బుద్ధ పూర్ణిమ. మనం శాంతి మార్గాన్ని ఎంచుకున్నాం. దానిలోనే పయనిస్తున్నాం. కానీ, చరిత్ర మనకు బోధించినట్లుగా, శాశ్వత శాంతి `బలం` ద్వారానే లభిస్తుంది.`` అని తెలిపారు.
``మనం శాంతి మార్గంలో నడుస్తాం. కానీ మనం ఉగ్రవాదం పట్ల అత్యంత కఠినంగా వ్యవహరిస్తాం. ఇదే విషయాన్ని మోడీ స్పష్టం చేశారు. నేడు, భారతదేశం దాని పురాతన ఆధ్యాత్మిక వారసత్వం. అత్యాధునిక ఆధునిక సామర్థ్యాల రెండింటికీ ప్రపంచవ్యాప్తంగా గౌరవాన్ని కలిగి ఉంది. ఆపరేషన్ సిందూర్ సమయంలో.. సరిహద్దులో పాక్ ప్రాయోజిత ఉగ్రవాదానికి ఆజ్యం పోసిన కీలక మౌలిక సదుపాయాలను నాశనం చేయడానికి స్వదేశీంగా అభివృద్ధి చేసిన(మేకిన్ ఇండియా) డ్రోన్‌లు, ఆయుధాలను విజయవంతంగా మోహరించాం`` అని చంద్రబాబు పేర్కొన్నారు.
మన మేడ్-ఇన్-ఇండియా రక్షణ సాంకేతికత మన దేశాన్ని రక్షించడానికి ఆధునిక యుద్ధానికి మన సంసిద్ధతను చూపించింద ని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ``ఇది ప్రతి భారతీయుడిని గర్వపడేలా చేసింది.`` అని తెలిపారు. ప్రధాని మోడీ నాయకత్వంలో మన దేశం సమున్నతంగా నిలుస్తుందని, శాంతియుతంగా ఉంటుందని పేర్కొన్నారు. ``శక్తిలో బలీయమైనది ఉద్దేశ్యంలో ద్రుఢమైంది. భారతీయులుగా... మనం ఐక్యంగా ఉంటాం. ఎల్లప్పుడూ దేశాన్ని ముందుంచుతాం`` అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. అయితే.. సీఎం చంద్రబాబు ఇంత సుదీర్ఘ పోస్టును పెట్టడం ఇటీవల కాలంలో ఇదే తొలిసారి కావడం గమనార్హం.