జాతీయ స్థాయిలో పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ ...బాబు కీలక సూచన
పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ విషయంలో జాతీయ స్థాయిలో కూడా ఒక విధానం ఉండాలని ఏపీ సీఎం చంద్రబాబు సూచించారు.
By: Satya P | 12 Jun 2026 1:00 AM ISTపాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ విషయంలో జాతీయ స్థాయిలో కూడా ఒక విధానం ఉండాలని ఏపీ సీఎం చంద్రబాబు సూచించారు. నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ దీనిపై జాతీయ స్థాయిలో కార్యాచరణ అవసరం అని అన్నారు. తాము ఏపీలో ఒక పాలసీని రూపొందిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో సంతానోత్పత్తి రేటు 1.5 కంటే తక్కువకు పడిపోవడం పట్ల బాబు ఆందోళన వ్యక్తం చేశారు. దీని వల్ల పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గుతోందని అన్నారు. భవిష్యత్తులో ఆర్ధిక మానవ వనరుల కొరత ఏర్పడకుండా ఏపీలో పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ రూపొందిస్తున్నామని బాబు చెప్పుకొచ్చారు.
ఏపీ ఫోకస్ అంతా అదే :
నీతి అయోగ్ సమావేశంలో ఏపీ ఫోకస్ ఏమిటి లక్ష్యాలు ఏమిటి అన్నది బాబు సోదాహరణంగా వివరించారు. అభివృద్ధికి మానవ వనరులే పునాదిగా స్వర్ణాంధ్ర 2047 విజన్ రూపకల్పన జరిగిందని చంద్రబాబు చెప్పారు. పేదరిక నిర్మూలన, నైపుణ్యం, ఉపాధి, నీటి ఇంధన భద్రత, అగ్రి టెక్ గ్లోబల్ లాజిస్టిక్స్, డీప్-టెక్ లాంటి 10 సూత్రాలను భాగం చేశామని ఆయన వివరించారు. ఇక ఈ లక్ష్యాలను చేరుకునేందుకు సాంకేతికత, పారదర్శక డేటా డ్రివెన్ పాలనా వ్యవస్థను ఏర్పాటు చేశామని అన్నారు. అలాగే ఆర్టీజీఎస్ ద్వారా కీ పెర్ఫార్మెన్సు ఇండికేటర్లను పర్యవేక్షిస్తున్నామని అన్నారు.
రియల్ టైం లోనే :
అదే విధంగా వాతావరణం, పంటల స్థితిగతులు, భూగర్భ జలాల వంటి 41 రకాల సమాచారాన్ని రియల్ టైమ్ లో విశ్లేషించి ప్రజలకు సమాచారం ఇస్తున్నామని బాబు చెప్పారు. మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్ యాప్ ద్వారా ప్రభుత్వ సేవల్ని పారదర్శకంగా ప్రజల ఇంటివద్దనే అందిస్తున్నామని అన్నారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానంతో గడచిన రెండేళ్ళలో రూ.23 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించామని తెలిపారు. పెట్టుబడుల్ని ఆకర్షించటంలో రాష్ట్రాల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉండాలని అదే సమయంలో అస్థిరమైన విధానాలు మేలు చేయవని బాబు అన్నారు. అత్యుత్తమ స్థాయి మౌలిక సదుపాయాలు, వేగంగా అనుమతుల జారీ లాంటి స్థిరమైన వాతావరణం కల్పనపై దృష్టి పెట్టాలని సూచించారు.
పేదరికం లేని సమాజం :
ఇక ఏపీలో పీ4 లాంటి కార్యక్రమం ద్వారా సమాజంలో ఆర్ధిక అసమానతలు తగ్గించే ప్రయత్నం చేస్తున్నామని ముఖ్యమంత్రి చెప్పారు. ప్రజల వైద్యారోగ్య పరిరక్షణకు సంజీవని అనే వినూత్న కార్యక్రమం ద్వారా డిజిటల్ హెల్త్ రికార్డులు తయారు చేస్తున్నామని తెలిపారు. ఆయుష్మాన్ భారత్‌తో అనుసంధానించటం ద్వారా ప్రతీ ఒక్కరికీ ఆరోగ్య రక్షణ అందించటమే లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు. యోగా మెడిటేషన్ లాంటి ఆరోగ్యకరమైన అలవాట్లను ప్రజల్లోకి తీసుకెళ్లేలా మానవ వనరుల అభివృద్ధిపై దృష్టి పెట్టామని అన్నారు.
అన్నింటా డిజిటల్ కనెక్టివిటీ :
ఇక ఏపీలో గృహ నిర్మాణం, పారిశుద్ధ్యం, కుళాయి నీరు, వంటగ్యాస్, విద్యుత్, డిజిటల్ కనెక్టివిటీ, డీబీటీ లాంటి ప్రజలకు అందించాలన్నదే తమ లక్ష్యమని చెప్పారు. విద్యారంగంలో ప్రాథమిక అభ్యాసం నుంచి ఉన్నత విద్య వరకూ సమూల సంస్కరణలు చేపట్టామని అన్నారు. గ్యారంటీడ్ ఎఫ్ఎల్ఎన్ కార్యక్రమంతో పాటు ఏఐ ఆధారిత అడాప్టివ్ లెర్నింగ్ వ్యవస్థలతో ఫలితాలను మెరుగు పరుస్తున్నామని గుర్తు చేశారు. నైపుణ్యం వెబ్ పోర్టల్, పీఎం సేతు ద్వారా ఏఐ, క్వాంటం టెక్నాలజీస్ లాంటి రంగాల్లో యువతను సిద్ధం చేస్తున్నామని అన్నారు.
అభివృద్ధి భారత్ :
ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో పాలసీ పెరాలసిస్ నుంచి గత దశాబ్ద కాలంగా భారత్ పాలసీ గ్రోత్ వైపుగా అడుగులు వేసింది అని చంద్రబాబు అన్నారు. మోదీ హయాంలో డిజిటల్ ఇండియా, జన్ ధన్, ఆధార్, యూపీఐ, మేక్ ఇన్ ఇండియా లాంటి కార్యక్రమాలు వచ్చాయని తెలిపారు. సరళీకరణ, పాలనా సంస్కరణలు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లు భారతదేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేశాయని బాబు పేర్కొన్నారు. భౌగోళిక రాజకీయ అనిశ్చితి పరిస్థితులు ఉన్నా భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న పెద్ద ఆర్థిక వ్యవస్థ అవతరించిందని తెలిపారు. ప్రధాని మోదీ రూపకల్పన చేసిన వికసిత్ భారత్ 2047కు ఏపీ కూడా స్వర్ణాంధ్ర విజన్‌ను అనుసంధానం చేశామని బాబు ప్రకటించారు.
