కెపాసిటీ బిల్డింగ్ అంటే.. మోడీనే : చంద్రబాబు
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏఐ లాంటి అధునాతన టెక్నాలజీ, అపారమైన అవకాశాలు, యువత, దేశ ప్రజల ఆకాంక్ష లు మన ఎదుట ఉన్నాయన్నారు.
By: Garuda Media | 29 Sept 2026 5:12 PM ISTకెపాసిటీ బిల్డింగ్ అంటే.. ప్రధాని నరేంద్ర మోడీనేని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. `కెపాసిటి బిల్డింగ్ కమి షన్` విజయవాడలో నిర్వహిస్తున్న `మిషన్ కర్మయోగి` వర్క్ షాప్‌లో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏఐ లాంటి అధునాతన టెక్నాలజీ, అపారమైన అవకాశాలు, యువత, దేశ ప్రజల ఆకాంక్ష లు మన ఎదుట ఉన్నాయన్నారు. మన పాలనా వ్యవస్థలు, సంస్థలు ప్రజల ఆకాంక్షల్ని ఏమేరకు తీర్చగలం అన్నదే ప్రధానమైన అంశమని పేర్కొన్నారు.
వచ్చే 20 ఏళ్లు భారత్ అభివృద్ధికి అత్యంత కీలకమైన సమయమని, ఈ సమయంలోనే మన వ్యవస్థలు, సంస్థలు విప్లవాత్మకమైన మార్పుల్ని సంతరించుకోవాల్సి ఉందని చంద్రబాబు తెలిపారు. ''రైల్వే స్టేషన్‌లో చాయ్ విక్రేత నుంచి ఇప్పుడు దేశ ప్రధాని వరకూ ఎదిగిన ప్రధాని మోడీ కెపాసిటీ బిల్డింగ్‌కు ఓ ప్రత్యక్ష ఉదాహరణ'' అని ప్రశం సలు గుప్పించారు. భారత్ లో ఉన్న అపారమైన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలన్నదే ఇప్పుడు అందరి లక్ష్యమని, అందుకే కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ ద్వారా ఐగాట్- మిషన్ కర్మయోగి కార్యక్రమాన్ని ప్రధాని చేపట్టారని తెలిపారు.
ఎప్పటికప్పుడు సామర్ధ్యాలు పెంచుకునేలా ఆన్ లైన్ శిక్షణ ఐగాట్ - మిషన్ కర్మయోగి ద్వారా అందుతోందని చంద్రబాబు తెలిపారు. రాష్ట్ర స్థాయి నుంచి క్షేత్రస్థాయి వరకు ఎప్పటికప్పుడు ప్రభుత్వ శాఖల్లో అధికారులు, ఉద్యోగులు శిక్షణ పొందితేనే నాణ్యమైన సేవలు అందించగలమన్నారు. చైనా 1978లో మొదలు పెట్టి కొన్ని దశాబ్దాల్లోనే తన సామార్ధ్యాలను విపరీతంగా పెంచుకోగలిగిందన్నారు. ఆర్ధికంగా ఉన్నతస్థాయిలో ఇప్పుడు ఆ దేశం తన సామర్ధ్యాలను గణనీయంగా నమోదు చేస్తోందన్నారు. ఆ దేశంతో సమానంగానే అపారమైన అవకాశాలు, వనరులు ఉండి మనం ఎందుకు వెనుకబడ్డామన్నది బేరీజు వేసుకోవాలన్నారు.
ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా భారతీయులు తమ నైపుణ్యాలను అంతర్జాతీయంగా చాటి చెప్పారని తెలిపారు. రాజ కీయంగా పాలన మారవచ్చు కానీ భారతీయులుగా మనం అంతా దేశాన్ని అత్యున్నతస్థాయిలో నిలిపేలా పనిచేయాల్సిందేనని చంద్రబాబు ఉద్ఘాటించారు. ఆర్ధిక సంస్కరణల తర్వాత భారతీయుల ఆకాంక్షలు మారిపోయాయన్న ఆయన.. . అందుకు అనుగుణంగా వ్యవస్థలూ నడవాలన్నారు. ప్రపంచ వ్యాప్తంగా వివిధ గూగుల్, మైక్రోసాఫ్ట్ లాంటి అగ్రగామి కంపెనీలకు భారతీయులే సారధ్యం వహిస్తున్నారని, గతంలో ఐటీ విప్లవం వచ్చింది, ఇప్పుడు ఏఐ కాలం నడుస్తోంది. దానికి అనుగుణంగా మనం మారాల్సిందేనని తెలిపారు.
