'పీ-4' విఫలమా.. సఫలమా.. పొలిటికల్ డిబేట్..!
ఏపీ సీఎం చంద్రబాబు ప్రవచించిన కీలక కార్యక్రమం పీ-4. ప్రజలను-ప్రైవేటు వ్యక్తులను అనుసంధానం చేస్తూ... ప్రభుత్వ పర్యవేక్షణలో పేదలను ఉన్నత స్థాయి వర్గాలుగా తీర్చిదిద్దే కార్యక్రమం ఇది.
By: Tupaki Desk | 7 April 2025 3:00 PM ISTఏపీ సీఎం చంద్రబాబు ప్రవచించిన కీలక కార్యక్రమం పీ-4. ప్రజలను-ప్రైవేటు వ్యక్తులను అనుసంధానం చేస్తూ... ప్రభుత్వ పర్యవేక్షణలో పేదలను ఉన్నత స్థాయి వర్గాలుగా తీర్చిదిద్దే కార్యక్రమం ఇది. దీనిని సీఎం చంద్రబాబు చాలా ప్రతిష్టాత్మకంగా కూడా తీసుకున్నారు. ఉన్నతస్థాయి వర్గాలు..పేదలను ఆదుకునేలా ఆయన ప్రోత్సహిస్తున్నారు. అయితే.. ఇది ప్రారంభించి.. వారం అయిన నేపథ్యంలో పీ-4పై సామాజిక మాధ్యమాల్లో అనేక చర్చలు వస్తున్నాయి.
మేధావుల నుంచి రాజకీయ విశ్లేషకుల వరకు అనేక మంది పీ-4పై పెద్ద ఎత్తున చర్చిస్తున్నారు. మరి ఇది సఫలమైందా? లేక.. ఇంకా పుంజుకోవాల్సింది ఉందా? అనేది కీలక ప్రశ్న. ఈ విషయంలో ప్రస్తుతానికి రెండోదే ఖాయమని తెలుస్తోంది. ప్రజల్లోకి పీ-4 వెళ్లినా.. ఉన్నతస్థాయి వర్గాల్లోకి ఈ కాన్సెప్టు ఇంకా వెళ్లలేదు. దీనిని బలంగా తీసుకువెళ్లేందుకు ప్రభుత్వం నుంచి ప్రయత్నాలు మరింత ముమ్మరంగా జరగాల్సి ఉంది. లేకపోతే.. మరికొన్ని రోజుల్లో దీనిని మరిచిపోయే ప్రమాదం కూడా ఉంది.
ఏం చేయాలి..
గతంలో చంద్రబాబు పాలనలో చేపట్టిన `జన్మభూమి` కార్యక్రమంతో పీ-4 కార్యక్రమాన్ని పోలుస్తున్నారు. అయితే.. ఆ రేంజ్‌లో దీనిని ప్రజల్లోకి తీసుకువెళ్లలేకపోతున్నారు. దీనిపై ఇప్పుడు దృష్టి పెట్టాలి. ముఖ్యంగా పారిశ్రామిక వేత్తలు, ఉన్నత వర్గాలు, ఎన్నారైలు, ఐటీఉద్యోగులు.. ఇలా సమాజంలోని వివిధ రంగాలకు చెందిన వారు ఉన్నారు. వారిని ఏకీకృతం చేయాల్సిన అవసరం ఉంది. ముందుగా వారికి దీనిపై అవగాహన కల్పించాలి.
ఇక, సమాజంలో ఒకరు సాయం చేస్తే.. తాము వారి చేతికింద బతకాల్సి వస్తుందనే అపప్రద ఉంది. దీనిని తరిమి కొట్టేందుకు కూడా ప్రభుత్వం వైపు ప్రయత్నం చేయాల్సి ఉంది. ప్రభుత్వం నుంచి సాయం అందుకునేందుకు ముందుకు వచ్చే పేదలు.. అదేసమయంలో పారిశ్రామిక వేత్తల నుంచి సాయం పొందేందుకు చిన్నతనంగా భావిస్తున్నారు. వీరికి ఆ భావనను పోగొట్టాల్సిన అవసరం ఉంది. ఈ రెండు ప్రయత్నాలు చేస్తే.. పీ-4 చంద్రబాబు ఆశలకు తగిన విధంగా సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది.
