బాబు కొత్త నినాదం....వినడానికేనా ?
టీడీపీ అధినేత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సీనియర్ మోస్ట్ లీడర్ అన్న సంగతి తెలిసిందే. ఆయన రాజకీయ జీవితం దాదాపుగా అర్ధ శతాబ్దం పైగా ఉంది.
By: Satya P | 24 Aug 2026 5:00 AM ISTటీడీపీ అధినేత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సీనియర్ మోస్ట్ లీడర్ అన్న సంగతి తెలిసిందే. ఆయన రాజకీయ జీవితం దాదాపుగా అర్ధ శతాబ్దం పైగా ఉంది. చంద్రబాబు ఎర్లీ సెవెంటీస్ నుంచి ఈ రోజు వరకూ రాజకీయాల్లో ఎలాంటి విరామం లేకుండా కొనసాగుతున్నారు. ఆయన ఎన్నో ఎన్నికలను చూశారు, ఎంతో మంది ముఖ్యమంత్రులతో పనిచేశారు. దేశంలో ఉమ్మడి ఏపీలో విభజన ఏపీలో రాజకీయం అంతా ఆయనకు తెలుసు. వివిధ రాజకీయ పార్టీల రాజకీయమూ తెలుసు. మొత్తంగా చెప్పాలీ అంటే బాబు కంటే రాజకీయ అనుభవశాలి వేరే ఎవరూ లేరు. ఆయనకు రాజకీయాల పట్ల అంతటి సాధికారత ఉంది. అలాంటి దిగ్గజ నేత ఏమి చెప్పినా ఏ రకమైన సలహా ఇచ్చినా ఏ విధంగా దిశా నిర్దేశం చేసినా కూడా అది నిశితంగా పరిశీలించాల్సిందే అవుతుంది. అంతే కాదు దాని మీద మేధావుల నుంచి ప్రజా స్వామ్య ప్రియుల నుంచి అంతా సీరియస్ గా దృష్టి పెట్టాల్సి ఉంటుంది.
ఎన్నికల అవినీతి మీద :
చంద్రబాబు ఈ మధ్య పదే పదే ఒక మాట అంటున్నారు. అనడమే కాదు దానిని ఒక నినాదంగా చేసి వినిపిస్తున్నారు. ఆగస్టు 15న తన ఇంట్లో ఉచిత బస్సు ప్రయాణీకులైన మహిళలతో చంద్రబాబు ఇష్టా గోష్టిగా మాట్లాడుతూ చాలా కీలకమైన అంశాలనే చెప్పారు. ఎన్నికల్లో డబ్బు ప్రభావం గురించి చెప్పారు, ఎవరు ఎక్కువ మొత్తాలు ఇస్తే అటు వైపుగా తిరిగిపోతున్నారు అని కూడా ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతో అభివృద్ధి చేసినా కూడా ఎవరు ఎక్కువ ఎన్నికల వేళ ఇస్తున్నారో చూసి ఆ వైపునకే మొగ్గు చూపిస్తున్నారు అని అన్నారు. ఓటుకు నోటు అన్న అంశం మీద చంద్రబాబు ఆ రోజు చెప్పిన మాటలు అయితే వైరల్ అయ్యాయి. ఒక విధంగా చర్చను రేపాయి. సరే మహిళలు అంతా కలసి ఉన్న చోట ఆయన వారికి మంచి చెప్పే ప్రయత్నంలో ఈ విధంగా హితబోధ చేశారు అని అంతా అనుకున్నారు. కానీ మరోసారి అవే మాటలను అనకాపల్లి జిల్లా పర్యటనలో కూడా వల్లె వేశారు. దాంతో బాబు గట్టిగానే ఈ విషయాన్ని జనంలో చర్చకు పెట్టాలని అనుకుంటున్నట్లుగా అర్ధం అవుతోంది.
బాబు ఇచ్చిన పిలుపు :
ఎవరూ కూడా ఎన్నికల్లో డబ్బులు తీసుకోవద్దు అని చంద్రబాబు అనకాపల్లి సభలో పిలుపు ఇచ్చారు. ఒక ప్రభుత్వం చేసే మంచి పనులను బేరీజు వేసుకుని ఓటు చేయాలని ఆయన కోరారు. అంతే తప్ప డబ్బులు ఎవరు ఎక్కువ ఇస్తే వారికి ఓటు వేయడం అన్న దుర్విధానాన్ని మానుకోవాలని బాబు కోరారు. ప్రజలు నిజాయితీగా ఉంటేనే తప్పుడు పనులు చేయడానికి నాయకులు కూడా వెనకేస్తారు అని ఆయన అన్నారు. ఎన్నికల్లో డబ్బు ప్రభావం లేకుండా చేయాలని బాబు గట్టిగా కోరారు. అపుడే రాజకీయాల్లో చెత్త అంతా పక్కన పోతుందని ఆయన స్పష్టం చేఅశారు. ఈ విధంగా బాబు ఉద్వేగంగా చెప్పిన మాటలు ఆ సభలో బాగానే జనాలు విన్నారు, చప్పట్లు కూడా కురిసాయి. కానీ ఆచరణలో అలా జరుగుతుందా అది సాధ్యమేనా అన్నదే చర్చగా ఇపుడు ముందుకు వస్తోంది.
కష్టమే సుమా :
డబ్బులు తీసుకుని ఓటేసే జనాలు అంతకంతకు పెరిగిపోతున్నారు. అది ఏదో పేదవాడు కూలీ నాలీ పని చేసుకునే వారు నిరక్షరాస్యులు డబ్బులు అడుగుతున్నారు అంటే కానే కాదు, చదువుకున్న వారు మంచి ఉద్యోగాలు చేస్తున్న వారు కూడా ఇదే తీరున వ్యవహరిస్తున్నారు. వారు కూడా ఓటుకు నోటు అంటున్నారు. దాంతోనే ఇది ఒక జాడ్యంగా మారింది అని అర్ధం అవుతోంది. ఎన్నికల్లో జనాలను ఆకట్టుకోవడం ఒక వ్యూహం. సులువుగా వారిని ఆకర్షించాలంటే డబ్బులు పంచడమే ఏకైక మార్గంగా రాజకీయ జీవులు ఏనాడో కనిపెట్టేశారు. ఇక దానికి తోడు జనాలు కూడా తమకు ఎన్నికలు అంటే దక్కేది ఓటుకు నోటు తప్ప మరేమీ కాదన్న నైరాశ్యంలో కూరుకుని పోయారు. చేతికి వచ్చిందే దక్కుడు అన్నది సగటు ఓటరు ఆలోచనగా ఉంది. పైగా ఇది అక్కడా ఇక్కడా కాదు అంతటా సాగుతున్న వ్యవహారం. దాంతో చంద్రబాబు ఇచ్చిన పిలుపునకు ఎంత వరకు ఫలితం ఉంటుంది అంటే ఆలోచించాల్సిందే అని అంటున్నారు.
