మనం రాజకీయ కక్ష సాధింపులకు దిగలేం: చంద్రబాబు
బుధవారం ఏపీ మంత్రి వర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మంత్రులు.. నాటి సంగతులను గుర్తు చేశారు.
By: Tupaki Desk | 4 Jun 2025 9:45 PM ISTకూటమి ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపులకు దిగబోదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ``గతంలో మనల్ని ఇబ్బంది పెట్టారు. వాస్తవానికి మీ కంటే కూడా.. నేనే ఎక్కువగా బాధపడ్డాను. నన్ను అన్యాయంగా 53 రోజుల పాటు జైల్లో ఉంచారు. దోమలు కుట్టాయి. అయినా.. కనీసంమానవత్వం కూడా చూపకుండా మంచినీళ్లకుకూడా ఎదురు చూసే పరిస్థితి తెచ్చారు. ఇవన్నీ కక్ష సాధింపు చర్యలేనని నాకు తెలుసు. అయినా.. ఇప్పుడు అలాంటి వారిపై నేను చర్యలు తీసుకోలేను. దీనికి కారణం.. మనం రాజకీయ కక్ష సాధింపులకు దిగేందుకు ప్రజలు మనకు అధికారం ఇవ్వలేదు`` అని చంద్రబాబు తేల్చి చెప్పారు.
బుధవారం ఏపీ మంత్రి వర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మంత్రులు.. నాటి సంగతులను గుర్తు చేశారు. వైసీపీ హయాంలో టీడీపీ నాయకులు, మాజీ మంత్రులను అక్రమంగా అరెస్టు చేశారని.. కానీ.. ఇప్పుడు అలాంటి వారే బహిరంగంగా స్వేచ్ఛగా తిరుగుతున్నారని పలువురు మంత్రులు వ్యాఖ్యానించారు. వారిపైనా చర్యలు తీసుకోవాలని.. మంత్రు లు అచ్చెన్నాయుడు, సుధారాణి, కొల్లు రవీంద్రలుసీఎం చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. ఈ సమయంలో చంద్రబాబు వారితో మాట్లాడుతూ.. నేరం చేసిన వారిని వదిలి పెట్టేది లేదన్నారు. అయితే.. గతంలో వారేదో చేశారని.. ఇప్పుడు మనం కూడా అదే విధంగా చేస్తామంటే కుదరదని అన్నారు.
ఇక, నాయకులు, మంత్రులు నిరంతరం ప్రజల్లోనే ఉండాలని చంద్రబాబు సూచించారు. ప్రజలకు చేరువ కావాలన్నారు. రాష్ట్రం లో చిత్రమైన రాజకీయాలు నడుస్తున్నాయని, నేరస్తులకు అండగా ఉండేవారు పెరుగుతున్నారని.. పరోక్షంగా తెనాలిలో రౌడీషీ టర్ల కుటుంబాలకు జగన్ పరామర్శించిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. నేరస్తులకు అండగా ఉంటామని చెబుతూ.. అసలు రాజకీయాలను ఎటు తీసుకువెళ్తున్నారో కూడా అర్ధం కాని పరిస్థితి ఏర్పడుతోందన్నారు. ఈ నేపథ్యంలో మంత్రులు నిరంతరం ప్రజల మధ్యే ఉండాలని సూచించారు. వారు ప్రజలతో మమేకం కావాలన్నారు.
ఏడాది పాలనపై ప్రజలు సంతృప్తితో , సంతోషంతో ఉన్నారని చెప్పారు. ఆ సంతృప్తిని మరింత పెంచేందుకు కృషి చేయాలని సీఎం సూచించారు. ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు ప్రయత్నించాలని సూచించారు. ప్రజల సమస్యలు వినేందుకు.. వాటిని పరిష్కరించేందుకు మరింత ఎక్కువ సమయం కేటాయించాలని పేర్కొన్నారు. అదే అసలైన సంతృప్తిని ఇస్తుందని తెలిపారు. రాష్ట్రంలో రాజకీయాలను ఎప్పటికప్పుడు గమనిస్తూ.. వాటిపై చర్చ పెట్టాలని సీఎం చంద్రబాబు సూచించారు. కూటమి పార్టీల మధ్య ఐక్యత ముఖ్యమని.. ఆ ఐక్యతను కూడా కాపాడుకుంటూ.. ముందుకు సాగాలన్నారు.
