Begin typing your search above and press return to search.

కుప్పంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నూతన గృహప్రవేశం

నూతన గృహప్రవేశం ఉండటంతో ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబ సభ్యులు శనివారం రాత్రికే తమ సొంత ఇంటికి చేరుకున్నారు.

By:  Tupaki Desk   |   25 May 2025 10:52 AM IST
కుప్పంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నూతన గృహప్రవేశం
X

ముఖ్యమంత్రి చంద్రబాబు తన సొంత నియోజకవర్గం కుప్పంలో నూతన గృహప్రవేశం చేశారు. ఆదివారం వేకువజామున 4.30 గంటలకు సంప్రదాయబద్ధం పూజా కార్యక్రమాలు నిర్వహించి గృహప్రవేశం పూర్తి చేశారు. 1989 నుంచి కుప్పం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న చంద్రబాబుకు కుప్పంలో ఇంతవరకు సొంత ఇల్లు లేదు. గత ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు శాంతిపురం మండలం శివపురం గ్రామంలో రెండు ఎకరాల స్థలంలో చంద్రబాబు సొంత ఇంటిని నిర్మించుకున్నారు.

నూతన గృహప్రవేశం ఉండటంతో ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబ సభ్యులు శనివారం రాత్రికే తమ సొంత ఇంటికి చేరుకున్నారు. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి అందరికన్నా ముందుగా శనివారం మధ్యాహ్నం నాటికి శివపురం వచ్చారు. గృహప్రవేశ కార్యక్రమాలను పర్యవేక్షించారు. రాత్రి 8 గంటల సమయానికి మంత్రి నారా లోకేశ్, ఆయన భార్య బ్రహ్మణి, కుమారుడు దేవాన్ష్ వచ్చారు. ఢిల్లీ పర్యటన ముగించుకుని అర్ధరాత్రి సమయానికి ముఖ్యమంత్రి చంద్రబాబు వచ్చారు. ఈ కార్యక్రమం పూర్తిగా తన ప్రైవేటు కార్యక్రమం కావడంతో సీఎం ఆదివారం నాడు ఎలాంటి అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు.

కొత్త ఇల్లు నిర్మించుకున్న సందర్భంగా కుప్పం నియోజకవర్గ వాసులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదివారం విందు భోజనం ఏర్పాటు చేశారు. నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి ఆహ్వాన పత్రాలు పంపారు. టీడీపీ నేతలు ఇంటింటికి వెళ్లి విందు భోజనాలకు ఆహ్వాన పత్రికలు అందజేశారు. దాదాపు 30 వేల మంది భోజనాలకు వస్తారని అంచనా వేస్తున్నారు. ఇందుకు తగ్గ ఏర్పాట్లు పూర్తి చేశారు. శనివారం రాత్రి, ఆదివారం ఉదయం కూడా బంధువులు, పార్టీ నేతలు, కార్యకర్తలకు అల్పాహారం, భోజన ఏర్పాటు చేశారు.

దాదాపు 35 ఏళ్లగా తమతోనే ఉంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత ఇల్లు నిర్మించుకోవడంపై కుప్పం వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ తమ ఇంటి కార్యక్రమంగా భావిస్తూ చంద్రబాబు నూతన గృహప్రవేశ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఆసక్తి చూపుతున్నారు. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి దగ్గరుండి వంటకాలను సిద్ధం చేయిస్తున్నారు. కాగా, చంద్రబాబు నూతన గృహప్రవేశం ఫొటోలు ఆన్ లైన్ లో వైరల్ అవుతున్నాయి.