టీడీపీ పని అయిపోలేదని టీవీల్లో చూస్తున్నారు: చంద్రబాబు
కడప జిల్లాలో తొలిసారి నిర్వహిస్తున్న టీడీపీ పసుపు పండుగ మహానాడు అంగరంగ వైభవంగా మంగళవా రం ప్రారంభమైంది.
By: Tupaki Desk | 27 May 2025 1:37 PM IST''టీడీపీ పని అయిపోయిందని.. ఇక ఆ పార్టీ లేదని చెప్పిన వారు..ఇప్పుడు ఇళ్లలో కూర్చుని టీవీలు చూ స్తూ.. టీడీపీ పని అయిపోలేదని..ఈ పార్టీ మరింత దూకుడుగా ముందుకు సాగుతోందని.. తెలుసుకుంటున్నారు. ఇంతకన్నా పార్టీకి ఇంకేం కావాలి. ఇదంతా కార్యకర్తల కృషి.. వారి త్యాగాలకు నిదర్శనం`` అని టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు.
కడప జిల్లాలో తొలిసారి నిర్వహిస్తున్న టీడీపీ పసుపు పండుగ మహానాడు అంగరంగ వైభవంగా మంగళవా రం ప్రారంభమైంది. ఈ మహానాడు తొలిరోజు సభకు మంత్రి పయ్యావుల కేశవ్ అధ్యక్షత వహించారు. తొలుత సభను ఉద్దేశించి చంద్రబాబు ప్రసంగించారు. దాదాపు గంటా 20 నిమిషాలకు పైగానే చంద్రబాబు ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన సీమ అభివృద్ధి నుంచి గత ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి వచ్చే వరకు జరిగిన అనేక పరిణామాలను వివరించారు.
ముఖ్యంగా వైసీపీ హయాంలో పార్టీ ఎదుర్కొన్న సమస్యలను ఆయన ఏకరువు పెట్టారు. పార్టీ కోసం పట్టిన జెండా దింపకుండా.. ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేశారని అన్నారు. ముఖ్యంగా పల్నాడు జిల్లాకు చెందిన తోట చంద్రయ్య హత్యను ఆయన ప్రస్తావించారు. ప్రాణం పోతున్నా.. పార్టీ జెండాను.. పార్టీ నినాదాన్ని వదిలి పెట్టకుండా చివరకు ప్రాణాలు సైతం అర్పించిన తోట చంద్రయ్య పార్టీలోని ప్రతి నాయకుడికి.. కార్యకర్తకు కూడా స్ఫూర్తి మంతమని పేర్కొన్నారు.
''చాలా మంది అన్నా.. ఇంకేముంది .. పార్టీ పని అయిపోందని. కానీ,.. పిడికిలి బిగించిన కార్యకర్తలు.. పార్టీని నిలబెట్టారు. అధికారంలోకి వచ్చే వరకు పట్టుబట్టి ముందుకు నడిచారు. అలాంటి ప్రతి ఒక్కరికీ.. మహానాడు వేదికగా.. అభినందనలు తెలుపుతున్నా.'' అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. అయితే.. అసలు లక్ష్యాలు అనేకం ఉన్నాయని.. వాటిని సాధించుకునేందుకు ముందుకు సాగాల్సిన అవసరం ఉందని చెప్పుకొచ్చారు.
