Begin typing your search above and press return to search.

నా ఫోన్ నెంబ‌ర్ ఇస్తా.. ఎప్పుడైనా రండి: చంద్ర‌బాబు బిగ్ ఆఫ‌ర్‌

అంతేకాదు.. సొంత‌గా ప‌రిశ్ర‌మ‌లు ఏర్పాటు చేసేవారికి, స‌రికొత్త ఆలోచ‌న‌ల‌తో ముందుకు వ‌చ్చే వారికి మ‌రింత ప్రోత్సాహం ల‌భిస్తుంద‌ని చెప్పారు.

By:  Garuda Media   |   6 Jun 2026 1:10 PM IST
నా ఫోన్ నెంబ‌ర్ ఇస్తా.. ఎప్పుడైనా రండి: చంద్ర‌బాబు బిగ్ ఆఫ‌ర్‌
X

ఏపీ సీఎం చంద్ర‌బాబు పెట్టుబ‌డి దారుల‌కు బిగ్ ఆఫ‌ర్ ప్ర‌క‌టించారు. తాను స్వ‌యంగా అందుబాటులో ఉంటాన‌ని.. త‌న ఫోన్ నెంబ‌రుకు ఫోన్ చేసి.. ఎప్పుడైనా రావొచ్చున‌ని తెలిపారు. పెట్టుబ‌డి పెట్టేవారికి ఏపీలో రెడ్ కార్పెట్ ప‌రుస్తున్నామ‌ని చెప్పారు. ఎవ‌రు ఎప్పుడు వ‌చ్చినా స్వాగ‌తిస్తామ‌న్నారు. రాష్ట్రంలో ఏ రంగంలో అయినా పెట్టుబ‌డులు పెట్టేందుకు అవ‌కాశం ఉంద‌ని.. అది పారిశ్రామిక రంగం నుంచి ఆక్వా రంగం వ‌ర‌కు ఏదైనా కావొచ్చ‌న్నారు.

అంతేకాదు.. సొంత‌గా ప‌రిశ్ర‌మ‌లు ఏర్పాటు చేసేవారికి, స‌రికొత్త ఆలోచ‌న‌ల‌తో ముందుకు వ‌చ్చే వారికి మ‌రింత ప్రోత్సాహం ల‌భిస్తుంద‌ని చెప్పారు. ఈ విష‌యంలో నేరుగా త‌న‌తోనే చ‌ర్చ‌లు జ‌రపొచ్చ‌ని వెల్ల‌డించారు. గ‌త 23 నెల‌ల్లో 21 ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌ల పెట్టుబ‌డులు వ‌చ్చాయ‌ని తెలిపారు. వివిధ రంగాల్లో అభివృద్ధి చేసేందుకు పెట్టుబ‌డిదారులు ముందుకు రావాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు. రాష్ట్రంలో మాన‌వ వ‌న‌రుల నుంచి విద్యుత్‌, నీరు వంటివి అందుబాటులో ఉన్నాయ‌ని తెలిపారు.

విశాఖ‌ప‌ట్నంలో జ‌రిగిన ఆక్వా ఎగ్జిబిష‌న్‌లో సీఎం చంద్ర‌బాబు పాల్గొన్నారు. రాష్ట్రం నుంచి ఏటా ఆక్వా ఉత్ప‌త్తులు విదేశాల‌కు వెళ్తున్నాయ‌ని తెలిపారు. దేశంలోని వివిధ రాష్ట్రాల‌తో పోలిస్తే.. ఏపీ నుంచి 28 శాతం మేర‌కు ఉత్ప‌త్తులు విదేశాల‌కు వెళ్తున్న‌ట్టు చెప్పారు. ఆక్వా రంగంలో పెట్టుబ‌డులు పెట్టేందుకు ముందుకు రావాల‌ని పిలుపునిచ్చారు. చేప‌లు, స‌ముద్ర ఉత్ప‌త్తుల వ్యాపారంపై ఆధార‌ప‌డి ల‌క్ష‌ల కుటుంబాలు జీవిస్తున్నాయ‌ని తెలిపారు.

ఆక్వా రంగంలోనూ సాంకేతిక‌త‌ను తీసుకువ‌స్తున్న‌ట్టు తెలిపారు. గ‌తంలో మాదిరిగా సంప్ర‌దాయ వేట స్థానంలో సాంకేతిక‌త‌కు పెద్ద పీట వేస్తున్న‌ట్టు చెప్పారు. రేవుల‌ను అభివృద్ధి చేస్తున్నామ‌న్నారు. విశాఖ స‌హా మ‌చిలీప‌ట్నం, బాప‌ట్ల‌, నెల్లూరు రాష్ట్ర వ్యాప్తంగా చేప‌డుతున్న అభివృద్ధి ప‌నులు త్వ‌ర‌లోనే పూర్త వుతాయ‌న్నారు. వీటిని స‌ద్వినియోగించుకునేందుకు పెట్టుబ‌డి దారుల‌కు పిలుపునిస్తున్న‌ట్టు చెప్పారు. త‌ను ఎప్పుడూ అందుబాటులోనే ఉంటాన‌ని.. మీడియేట‌ర్ల‌తో ప‌నిలేద‌ని, త‌ననే నేరుగా క‌లుసుకుని మాట్లాడ‌వ‌చ్చ‌ని చెప్పారు.