Begin typing your search above and press return to search.

జర్నలిస్టులకు గుడ్ న్యూస్ చెప్పిన చంద్రబాబు

ఆయన సీఎం అయిన ఈ కాలంలో జర్నలిస్టులకు ఇళ్ళ స్థలాలు ఇస్తామన్న హామీ పెద్దగా అమలుకు నోచుకోలేదు అని విమర్శలు ఉన్నాయి.

By:  Tupaki Desk   |   4 July 2025 9:37 PM IST
జర్నలిస్టులకు గుడ్ న్యూస్ చెప్పిన చంద్రబాబు
X

తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు ఏపీలోని జర్నలిస్టులకు గుడ్ న్యూస్ చెప్పారు. వారి దీర్ఘకాల డిమాండ్ కి ఆయన ఓకే చెప్పారు. దాంతో పాత్రికేయ లోకం హర్షం వ్యక్తం చేస్తోంది. ఇంతకీ బాబు చెప్పిన ఆ శుభవార్త ఏమిటి అంటే పాత్రికేయులకు ఇళ్ళ స్థలాలను ఇస్తామని. దాని కోసం ఆయన అమరావతిలో శుక్రవారం జరిగిన రెవిన్యూ శాఖ సమీక్షా సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జ‌ర్న‌లిస్ట్ ల‌కు ఇళ్ల‌స్థ‌లాలు ఇవ్వాల‌ని అధికారులకు చంద్ర‌బాబు ఆదేశం ఇచ్చారు. ఇందుకోసం ముగ్గురు మంత్రుల‌తో మంత్రి వ‌ర్గ ఉప‌సంఘం ఏర్పాటు కూడా చేశారు. ఈ మంత్రివర్గ ఉప సంఘంలో రెవిన్యూ మంత్రి అన‌గాని స‌త్య‌ప్ర‌సాద్, సమాచార శాఖ గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్ధసార‌ధి, పురపాలక శాఖ మంత్రి పి నారాయ‌ణ సభ్యులుగా ఉంటారు. సాధ్యమైనంత త్వ‌ర‌లోనే ఉపసంఘం భేటీ అయి జర్నలిస్టులకు ఇళ్ళ స్థలాల కోసం ఏ విధంగా చేయాలి అన్నది పరిశీలించి విధి విధానాలను ఖరారు చేస్తుందని చెబుతున్నారు.

ఇదిలా ఉంటే చంద్రబాబు ఉమ్మడి ఏపీలో రెండు సార్లు విభజన ఏపీలో రెండు సార్లు సీఎం అయ్యారు. ఆయన సీఎం అయిన ఈ కాలంలో జర్నలిస్టులకు ఇళ్ళ స్థలాలు ఇస్తామన్న హామీ పెద్దగా అమలుకు నోచుకోలేదు అని విమర్శలు ఉన్నాయి. 2004లో ఉమ్మడి ఏపీలో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్ మాత్రం జర్నలిస్టులకు ఇళ్ళ స్థలాలను మంజూరు చేసి మంచి పేరు తెచ్చుకున్నారు.

ఇక 2014లో అధికారంలోకి వచ్చిన బాబు తాను కూడా ఇళ్ల స్థలాలను ఇస్తామని చెప్పారు. అయితే దాని కోసం దరఖాస్తులను ఆహ్వానించారు. ఒక విధంగా తీవ్ర స్థాయిలో కసరత్తు జరిగింది. పాత్రికేయులకు ప్రత్యేకంగా గృహ నిర్మాణ శాఖ ద్వారా ఇళ్ళు కట్టించి ఇవ్వాలని వారికి రుణాలు కూడా ఇచ్చి సొంతింటి వారిగా చూడాలని ఆనాటి టీడీపీ ప్రభుత్వం ఆలోచించింది. కానీ అది మాత్రం నెరవేరలేదు.

ఇపుడు మళ్ళీ బాబు అధికారంలోకి వచ్చారు. దాంతో ఆనాటి ప్రయత్నాలను ప్రతిపాదనలను పలుమార్లు జర్నలిస్టు సంఘాలు బాబు దృష్టిలో పెట్టాయి. మొత్తానికి చంద్రబాబు జర్నలిస్టులకు గుడ్ న్యూస్ వినిపించారు. ఇక తొందరలోనే సమావేశం అయ్యే మంత్రి వర్గ ఉప సంఘం జర్నలిస్టులకు అనుకూలంగా సమంజసమైన ప్రతిపాధనలు విధి విధానాలను రూపొందించాలని సంఘాల నేతలు కోరుతున్నారు.

అంతే కాదు సాధ్యమైనంత తొందరలోనే జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని వారు వినతి చేస్తున్నారు. మొత్తానికి పాత్రికేయ లోకానికి బాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం పూర్తి న్యాయం చేస్తుందని సంఘాల నేతలు భావిస్తున్నారు.