ఆ ఆలోచనల్లో దేశంలోనే చంద్రబాబు ఫస్ట్!
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచన విధానం మారుతోందని అంటున్నారు. 75 ఏళ్ల వయసులో నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు తరచూ ప్రజలకు ఆరోగ్య చిట్కాలు చెబుతుండటం ఆకట్టుకుంటోంది.
By: Tupaki Desk | 15 May 2025 8:00 PM ISTఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచన విధానం మారుతోందని అంటున్నారు. 75 ఏళ్ల వయసులో నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు తరచూ ప్రజలకు ఆరోగ్య చిట్కాలు చెబుతుండటం ఆకట్టుకుంటోంది. ఎప్పుడూ టెక్నాలజీ, సంపద సృష్టి, పారదర్శక పాలన, నాలెడ్జ్ ఎకానమీ అంటూ మాట్లాడే చంద్రబాబు ఇప్పుడు ఇలా మారిపోయారేంటి? అనే చర్చ జరుగుతోంది. గత ఏప్రిల్ లో రోజూ ఏం తినాలి? ఎంత తినాలి అనే అంశాలపై మాట్లాడిన చంద్రబాబు ఇప్పుడు ప్రొటీన్ ఫుడ్ పై ప్రజలు ఫోకస్ చేయాలని అంటున్నారు. దీంతో ప్రజల తీసుకునే ఆహారంపై శ్రద్ధ పెట్టే ముఖ్యమంత్రిగా కూడా ఆయన గుర్తింపు తెచ్చుకుంటున్నారని అంటున్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు చాలా ఆహార నియమాలు పాటిస్తారు. అందుకే 75 ఏళ్ల వయసులోనూ ఆయన హుషారుగా ఉంటారు. నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తనలా అందరూ యాక్టివ్ గా ఉండాలని, ఆరోగ్యానికి ఎక్కువ ప్రాధాన్యమివ్వాలని ఎప్పటికప్పుడు సలహాలిస్తున్నారు చంద్రబాబు. చంద్రబాబు నుంచి ఇలాంటి మాటలు వింటున్నవారు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఓ డాక్టరులా ఆయన ఇస్తున్న సలహాలుపై తీవ్ర చర్చ జరుగుతుండటం విశేషం.
ఆధునిక కాలంలో ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లకు మారాలని తరచూ చెబుతున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. పౌష్టికాహారం తీసుకుంటే దీర్ఘాయుష్షుతో బతకొచ్చని ఆయన చెబుతున్న విధానం ఆకట్టుకుంటోంది. ఉప్పు, నూనె వినియోగాన్ని బాగా తగ్గించాలని గత నెలలో సూచించిన చంద్రబాబు ఇప్పుడు మిలెట్స్ తినమంటూ ప్రజలను ప్రోత్సహిస్తున్నారు. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన కిలో రెండు రూపాయల బియ్యం పథకం వల్ల ప్రజలు ఎక్కువగా వైట్ రైస్ తినడానికి అలవాటు పడ్డారని, దీనివల్ల మధుమేహం రోగులు పెరిగిపోయారని ఆయన చెప్పడం గమనార్హం.
మధుమేహం అదుపు చేయడానికి పియోటిన్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలని, అల్పాహారంలో ఎగ్ ఆమ్లెట్ తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలని ఆయన సలహా ఇవ్వడంతోపాటు ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలని సూచిస్తున్నారు. దీంతో చంద్రబాబు చిట్కాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎప్పుడు రాష్ట్రం కోసం మాట్లాడే చంద్రబాబు.. ఇప్పుడు స్టైల్ మార్చి ప్రజల ఆరోగ్యంపై దృష్టి పెట్టడం కొత్తగా ఉందని టీడీపీలోనూ చర్చ జరుగుతోంది.
