8 ఏళ్ల తర్వాత.. గన్నవరానికి చంద్రబాబు!
దాదాపు 8 సంవత్సరాల తర్వాత.. టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు ఉమ్మడి కృష్ణాజిల్లాలోని కీలక నియోజకవర్గం గన్నవరం లో పర్యటించనున్నారు.
By: Garuda Media | 12 March 2026 5:00 AM ISTదాదాపు 8 సంవత్సరాల తర్వాత.. టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు ఉమ్మడి కృష్ణాజిల్లాలోని కీలక నియోజకవర్గం గన్నవరం లో పర్యటించనున్నారు. వాస్తవానికి ముఖ్యమంత్రిగా ఆయన పర్యటనకు ప్రాధన్యం ఉన్నా.. గన్నవరం నియోజకవర్గంలో పర్యటించడం మరింత ప్రాధాన్యం ఉన్న విషయం. టీడీపీకి కంచుకోట వంటి ఈ నియోజకవర్గంలో వైసీపీ పాగా వేసేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో 2019లో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీకి ఎదురుగాలి వీచినా.. ఇక్కడ మాత్రం విజయం సాధించిన వల్లభనేని వంశీని తనవైపు తిప్పుకొంది. ఆ తర్వాత.. వంశీ పార్టీపై తీవ్ర విమర్శలు కూడా చేశారు.
సీఎం చంద్రబాబు కుటుంబంపైనే వంశీ కామెంట్లు చేయడం గమనార్హం. ఇక, ఆ తర్వాత.. పార్టీ కార్యాలయంపైనా దాడి చేయిం చారు. పార్టీ ఐటీడీపీ అనుచరుడిని కూడా అపహరించిన కేసు ఇప్పటికీ విచారణలోనే ఉంది. దీనిలోనే వంశీ జైలుకు కూడా వెళ్లారు. మరోవైపు.. పార్టీ పరంగా అత్యంత కీలకమే కాకుండా.. ఓటు బ్యాంకు పరంగా కూడా ఇది టీడీపీకి ముఖ్యమైన నియోజకవర్గం. అయితే.. 2019 ఎన్నికలకు ముందు 2018లో పర్యటించిన చంద్రబాబు ఆ తర్వాత.. ఎప్పుడూ ఈ నియోజకవర్గానికి రాలేదు. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన 2024లో..ప్రమాణ స్వీకారం ఇక్కడే చేసినా.. కేవలం వేదిక వరకే పరిమితం అయ్యారు.
ఈ నేపథ్యంలో తాజాగా సీఎం చంద్రబాబు గన్నవరంలో పర్యటించాలని నిర్ణయించడం పార్టీ శ్రేణులకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తోంది. ప్రస్తుతం వైసీపీ నుంచి గత ఎన్నికలకు ముందు టీడీపీలోకి వచ్చిన యార్లగడ్డ వెంకట్రావు ఈ నియోజకవర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అభివృద్ధి-సంక్షేమాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. అయితే.. అంతర్గత కుమ్ములాటలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడింది. నాయకులను చక్కదిద్దడం.. అందరినీ ఏకతాటిపై నడిపించడం.. ముఖ్యంగా కూటమిలో కుమ్ములాటలు లేకుండా చూడడం ఇప్పుడు చంద్రబాబుముందున లక్ష్యాలు.
ఎందుకు వెళ్తున్నారు?
సూపర్ సిక్స్ హామీల్లో ఒకటైన అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులకు ఏటా 20 వేల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చా రు. కేంద్రం ఇచ్చే 6 వేల రూపాయలతోపాటు.. రాష్ట్ర ప్రభుత్వం 14 వేల రూపాయలనుకలిపి ఇస్తుంది. ఈ క్రమంలో అన్నదాత సుఖీభవ పథకం నిధులను, కేంద్ర ప్రభుత్వ పీఎం కిసాన్ నిధులతో కలిపి ఈ నెల 13న రైతుల ఖాతాల్లో జమ చేసే కార్యక్రమా న్ని సీఎం చంద్రబాబు గన్నవరం నియోజకవర్గంలోనే శ్రీకారం చుట్టనున్నారు. ఈ రాష్ట్ర స్థాయి కార్యక్రమంలో సుమారు 46 లక్షల 80 వేల మంది రైతుల ఖాతాల్లో నగదును జమ చేస్తారు. రాష్ట్ర సర్కారు వాటా 6 వేలు+ కేంద్రం ఇచ్చే రూ.2వేలు కలిపి మొత్తం 8 వేలను రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు.
