గంగా కావేరీ నదుల అనుసంధానం- బాబు బ్లూ ప్రింట్
దేశంలో ఉత్తరాదిన గంగా నది ఉంది. అది అఖండమైన జీవ నది , దక్షిణాన కావేరీ నది ఉంది. ఆ నది కూడా జీవనది.
By: Satya P | 27 Feb 2026 8:00 AM ISTదేశంలో ఉత్తరాదిన గంగా నది ఉంది. అది అఖండమైన జీవ నది , దక్షిణాన కావేరీ నది ఉంది. ఆ నది కూడా జీవనది. ఇలా ఉత్తర దక్షిణాదులను కలుపుతూ రెండు జీవ నదులను పవిత్ర సంగమం చేయాలన్నది ఎప్పటి నుంచో ప్రతిపాదన. నదుల అనుసంధానం జరిగితే కనుక ఈ దేశంలో ఒక్క చుక్క నీరు కూడా వృధాగా సముద్రంలోకి వెళ్ళదు, సాగు నీరు, తాగు నీరు తో పాటు పరిశ్రమలకు విద్యుత్ కి నీరు పూర్తిగా అందుబాటులోకి వస్తుంది. గంగా కావేరీ సహా నదుల అనుసంధానం జరగాలని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. అసెంబ్లీలో సాగు నీటి ప్రాజెక్టుల మీద చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అది తన బలమైన కోరికగా వ్యక్తం చేశారు. ఈ నదుల అనుసంధానం గురించి గతంలోనే చర్చలు జరిగాయని ఆయన గుర్తు చేశారు.
వాజ్ పేయ్ హయాంలోనే :
ఇదిలా ఉంటే దేశంలోనూ గంగా- కావేరి నదుల అనుసంధానం జరగాలన్నది తన బలమైన ఆకాంక్ష అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. గతంలో వాజ్ పేయి ప్రభుత్వంలో గంగా- కావేరీ నదుల అనుసంధాన సాధ్యాసాధ్యాలపై చర్చలు జరిగాయన్నారు. అందుకే రాష్ట్రంలో నదులు అనుసంధానం చేసి తెలుగు తల్లికి జలహారతి ఇచ్చేలా ప్రణాళికలు చేస్తున్నామని ముఖ్యమంత్రి వెల్లడించారు. రాష్ట్రంలోని వంశధార నుంచి పెన్నా వరకూ రాష్ట్రంలోని నదులను అనుసంధానిస్తే నీటి సమస్యలు పరిష్కారం అవుతాయని చంద్రబాబు చెప్పారు. ప్రతీ ఏటా గోదావరి నది నుంచి సగటున మూడు వేల టీఎంసీల వరద నీరు వృధాగా సముద్రంలో కలుస్తున్నాయని అన్నారు. వాటిని అడ్డుకుంటూ రాష్ట్రానికి ఉపయోగపడేలా ప్రాజెక్టులు చేపడుతున్నామని అన్నారు.
నీటి భద్రతపై దీర్ఘకాలిక విజన్
రాష్ట్రంలోని నీటి భద్రత విషయంలో సానుకూల విధానం కూటమి ప్రభుత్వానిది అని బాబు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రాజెక్టులను పూర్తి చేసే అంశంపై త్వరలోనే బ్లూ ప్రింట్ తయారు చేస్తామని బాబు చెప్పుకొచ్చారు. రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులు రావాలన్నా నీటి భద్రత అత్యంత కీలకమని ఆయన వ్యాఖ్యానించారు. జలాలను అత్యంత విలువైన వనరులుగా భావించి బాధ్యతగా వ్యవహరిస్తున్నామని బాబు అన్నారు.
ఉత్తరాంధ్రా ప్రాజెక్టుల కోసం :
ఏపీలో అన్ని ప్రాంతాలలో ప్రాజెక్టులను దశల వారీగా పూర్తికి యాక్షన్ ప్లాన్ రెడీ చేశామని చెప్పారు. రెండు వేల కోట్లతో ఉత్తరాంధ్ర ప్రాజెక్టులన్నీ దశలవారీగా పూర్తి చేస్తామని బాబు వివరించారు. రాష్ట్రానికి జీవనాడి పోలవరం ప్రాజెక్టును పరుగులు పెట్టించి పుష్కరాల కంటే ముందే పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని చంద్రబాబు చెప్పారు. అలాగే చింతలపూడి ఎత్తిపోతలను పూర్తి చేసి ఏలూరు, కృష్ణా జిల్లా ఎగువ భూములకు నీరందేలా చర్యలు చేపడతామన్నారు. నదులు పారే చివరి రాష్ట్రంగా ఏపీకి ఉండే నీటి భద్రత మరే రాష్ట్రానికీ లేదన్నారు.
పోలవరం-నల్లమల సాగర్
ఇక పోలవరం -నల్లమల సాగర్ లింకు ప్రాజెక్టు వల్ల రెండు రాష్ట్రాలకూ లాభమే అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. పోలవరం - నల్లమల సాగర్ అనుసంధాన ప్రాజెక్టు వల్ల ఎవరికీ నష్టం లేదని ఆయన స్పష్టం చేశారు. . పొరుగు రాష్ట్రం దీనిపై అభ్యంతరాలను తెలియచేయాల్సిన అవసరం లేదని అన్నారు. గోదావరి నుంచి వృధాగా సముద్రంలోకి వెళ్లే వరద జలాలను మాత్రమే తరలించేలా ఈ ప్రాజెక్టు చేపట్టామని అన్నారు. గోదావరిపై ఎగువ రాష్ట్రం కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినా దీనికి తాము ఎప్పుడూ అభ్యంతరం చెప్పలేదని బాబు స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టుతో రెండు తెలుగు రాష్ట్రాలకూ మేలు జరుగుతుందన్నారు
