Begin typing your search above and press return to search.

చంద్రబాబు వన్ వే యాక్షన్.. ఎమ్మెల్యేలు, మంత్రుల పనే లేదా?

ఏడాది క్రితం 4.O ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సీఎం చంద్రబాబుపై విపక్షం కన్నా ఎక్కువగా స్వపక్షమే విమర్శలు గుప్పిస్తోంది.

By:  Tupaki Desk   |   10 Aug 2025 11:00 PM IST
చంద్రబాబు వన్ వే యాక్షన్.. ఎమ్మెల్యేలు, మంత్రుల పనే లేదా?
X

నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు 95 సీఎం అంటూ దూసుకుపోతున్నారు. గత మూడు పర్యాయాలకు భిన్నంగా వ్యవహరిస్తూ, వినూత్న రాజకీయాన్ని ఆవిష్కరిస్తున్నారు. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడం, పెట్టుబడులను ఆకర్షించి కొత్త ఉద్యోగాలు సృష్టించడం అన్న లక్ష్యాలతో ముఖ్యమంత్రి పనిచేస్తున్నారు. గడిచిన 14 నెలలుగా పాలనలో సంస్కరణలు తీసుకువచ్చిన చంద్రబాబు ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టానని అంటున్నారు. అదే సమయంలో సంక్షేమ పథకాలకు డబ్బు కేటాయించి వైసీపీ విమర్శలు తిప్పికొడుతున్నారు. తన పనితీరుతో అందరితో శభాష్ అనిపించుకోవాలని తాపత్రయపడుతున్న సీఎం.. సొంత కేడర్ నుంచి ఎదురవుతున్న విమర్శల నుంచి తప్పించుకోలేకపోతున్నారని అంటున్నారు.

సోషల్ సైన్యం విమర్శలు

ఏడాది క్రితం 4.O ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సీఎం చంద్రబాబుపై విపక్షం కన్నా ఎక్కువగా స్వపక్షమే విమర్శలు గుప్పిస్తోంది. 95 సీఎం అంటూ వేగంగా అడుగులు వేస్తున్న చంద్రబాబు.. కార్యకర్తలను సంతృప్తి పరిచే నిర్ణయాలు తీసుకోవడంలో ఎడతెగని జాప్యం చేస్తున్నారని విమర్శలు ఎదుర్కొంటున్నారు. దీనికి టీడీపీ సోషల్ మీడియా వేదికలనే ఉదాహరణగా చెబుతున్నారు. రాజకీయ నిర్ణయాలు తీసుకోవడంలో చంద్రబాబు నాన్చుడు ధోరణిపై సోషల్ మీడియా సైనికులు అధికారంలోకి వచ్చిన తొలిరోజు నుంచి మండిపడుతున్నారు. అయితే సోషల్ సైనికులు ఒత్తిడికి తలొగ్గి తొందరపాటు నిర్ణయాలు తీసుకోలేమని పార్టీ పెద్దలు తొలుత చెప్పుకొచ్చారు. సొంత వారి విమర్శల నుంచి చంద్రబాబును రక్షించే ప్రయత్నం చేశారు. అయితే ఏడాది అయినా ఈ పరిస్థితిలో మార్పు రాకపోవడంతో సోషల్ మీడియా శ్రేణులు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు చెబుతున్నారు.

అధికార చట్రంలో బంధీ

మరోవైపు తాను పూర్తిగా మారిపోయినట్లు చెప్పుకుంటున్న సీఎం చంద్రబాబు.. మళ్లీ అధికారుల చట్రబంధంలోకి క్రమంగా ఇరుక్కుంటున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. పార్టీ కార్యకర్తలకు చంద్రబాబుకు మధ్య యథావిధిగా గ్యాప్ వచ్చేస్తోందని అంటున్నారు. చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా కార్యకర్తలకన్నా అధికార యంత్రాంగానికి ఎక్కువ విలువనివ్వడం వల్ల రాజకీయంగా నష్టపోతున్నామని వ్యాఖ్యలు ఇటీవల కాలంలో ఎక్కువగా వినిపిస్తున్నాయని చెబుతున్నారు. గత 14 నెలలో సీఎం ఎక్కువగా అధికార కార్యక్రమాలకే ప్రాధాన్యమిస్తున్నారని, కార్యకర్తల సాధకబాధలు తెలుసుకోడానికి అసలు సమయం కేటాయించడం లేదని విమర్శలు ఎక్కువవుతున్నాయి.

ఎమ్మెల్యేల నిరసన

ఇదే సమయంలో తాను పూర్తిస్థాయిలో పనిచేస్తున్నా, మంత్రులు, ఎమ్మెల్యేలు సరిగా పనిచేయడం లేదన్న చంద్రబాబు వ్యాఖ్యలపైనా నిరసన వ్యక్తమవుతోందని అంటున్నారు. చంద్రబాబు సీఎంగా వ్యవహరిస్తున్నారే కానీ, పార్టీ అధినేతగా తమ సమస్యలు తెలుసుకోవడం లేదని ఎమ్మెల్యేలు, మంత్రులు అంతర్గత సంభాషణల్లో వాపోతున్నారని చెబుతున్నారు. వచ్చేఎన్నికల నాటికి పేదరికం అంతం చేయాలన్న లక్ష్యంతో పనిచేస్తున్న చంద్రబాబు నియోజకవర్గాల్లో తమ పరిస్థితిని అర్థం చేసుకోకుండా టార్గెట్లు పెట్టడంపైనా ఎమ్మెల్యేలు, మంత్రులు లబోదిబోమంటున్నారని అంటున్నారు.

అందుబాటులో లేని అధినేత

ఈ సారి పాలనలో తనలో పూర్తిస్థాయి రాజకీయ నాయకుడిని చూస్తారని గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పిన విషయంపైనా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. గతంలో ఓ సారి మంత్రి, ఎమ్మెల్యేలతో డిన్నర్ భేటీలు నిర్వహిస్తానని చెప్పిన చంద్రబాబు.. ఒకరోజు మాత్రమే ఆ పనిచేశారని అంటున్నారు. నిత్యం బిజీ షెడ్యూలుతో సీఎం ఉండటం వల్ల పార్టీ పరమైన సమస్యలు, రాజకీయ నిర్ణయాల విషయంలో ఆయనను సంప్రదించడం కుదరడం లేదని అంటున్నారు. పార్టీ పరంగా మంత్రి లోకేశ్, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పల్లా అందుబాటులో ఉంటున్నా, చంద్రబాబు దృష్టికి తేకుండా ఏ నిర్ణయం తీసుకోలేని వాతావరణం ఉండటం కూడా నియోజకవర్గాల్లో ఇబ్బందులు సృష్టిస్తోందని ఎమ్మెల్యేలు వాపోతున్నారు. దీంతో చంద్రబాబు ఎప్పటిలా వన్ వేలో ప్రయాణిస్తూ తమను వెనక్కి వదిలేస్తున్నారని టీడీపీ ప్రజాప్రతినిధులు లబోదిబోమంటున్నారు.