Begin typing your search above and press return to search.

చంద్రబాబు ఫోన్ గురించి ఆసక్తిగా అడిగిన కేంద్రమంత్రి

విశాఖలో గూగుల్ డేటా సెంటర్ శంకుస్థాపన సందర్భంగా ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది.

By:  Garuda Media   |   29 April 2026 10:56 AM IST
చంద్రబాబు ఫోన్ గురించి ఆసక్తిగా అడిగిన కేంద్రమంత్రి
X

విశాఖలో గూగుల్ డేటా సెంటర్ శంకుస్థాపన సందర్భంగా ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ హాజరు కావటం తెలిసిందే. కార్యక్రమం జరుగుతున్న వేళ.. చంద్రబాబు ఫోన్ కేంద్రమంత్రిని ఆకర్షించింది. మీదేం ఫోన్? ఏ మోడల్? ఆసక్తిగా అడగటమే కాదు.. చేతిలోకి తీసుకొని మాట్లాడటం కనిపించింది. దీనికి స్పందించిన చంద్రబాబు ఫోన్ గురించి వివరించటంతో పాటు.. తన ఫోల్డబుల్ ఫోన్ ను ఓపెన్ చేసి చూపించిన తీరు అందరిని ఆకర్షించింది. ఇక్కడ ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అంశం ఏమంటే.. కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ కేంద్ర కమ్యునికేషన్ల శాఖా మంత్రి కూడా. అలాంటి ఆయనను సైతం చంద్రబాబు వాడుతున్న ఫోన్ ఆకర్షించటం చూస్తే.. చంద్రబాబు టెక్నాలజీ వాడే విషయంలో ఎంత అప్డేటెడ్ గా ఉంటారన్నది అర్థమవుతుంది.

పల్చగా ఉన్న మూడు మడతల్లో ఉన్న ఫోన్ ను ఓపెన్ చేసిన వేళ.. కార్యక్రమాన్ని కవర్ చేస్తున్న కెమేరాలన్ని ఆ వైపు ఫోకస్ చేయటం గమనార్హం. ఇంతకూ చంద్రబాబు వాడే ఫోన్ ఏంటి? దాని ఫీచర్లు ఏంటి? గతంలో ఆయన ఏ ఫోన్ వాడేవారు? టెక్నో సీఎం అన్న పిలుపునకు తగ్గట్లే.. చంద్రబాబు అప్డేటెడ్ గా ఉండటం.. అత్యాధునిక ఫోన్ వినియోగించే తీరు చూస్తే.. ఈ వయసులో ఇంత చురుకుగా ఉండటాన్ని చూసినప్పుడు వావ్ అనుకోకుండా ఉండలేం. ఈ సంఘటనపై సోషల్ మీడియాలోనూ ఆసక్తికర చర్చ జరుగుతోంది. కేంద్రమంత్రిని సైతం ఆకర్షించేలా ఉన్న చంద్రబాబు ఫోన్ విశేషాలేంటి? దాని ధర ఏంత? ఫీచర్ల మాటేంటి? లాంటి వివరాల్లోకి వెళితే..

సీఎం చంద్రబాబు ప్రస్తుతం గూగుల్ కు చెందిన గూగుల్ పిక్సెల్ 9ప్రో ఫోల్డ్ ఫోన్ వాడుతున్నారు. ఈ ఫోన్ ప్రత్యేకత ఏమంటే.. పుస్తకంలా మడవగలిగే డిజైన్ కలిగి ఉంటుంది. ఇందులో ఎనిమిది అంగుళాల మొయిన్ డిస్ ప్లే.. 6.3 అంగులాల కవర్ డిస్ ప్లే (బయటవైపు) ఉంటాయి. గూగుల్ తయారు చేసిన ఈ ఫోన్ లో టెన్ సర్ జీ4 చిప్ సెట్ తో ఈ ఫోన్ పని చేస్తుంది. ఈ ఫోన్ లో గరిష్ఠంగా 16 జీబీ ర్యామ్ ఉండటంతో వేగవంతంగా పని చేసేలా దీన్ని రూపొందించారు.

అద్భుతమైన ఫోటోల కోసం వెనుక వైపు 48ఎంపీ ప్రధాన కెమెరాతో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉండటం మరో ప్రత్యేకత. గూగుల్ అధునాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లను ఇది సపోర్టు చేస్తుంది. దీంతోస్మార్ట్ సలహాలు.. ఫోటో ఎడిటింగ్.. ఇతర పనులు సులువుగా చేయొచ్చు. ఇక.. ధర విషయానికి వస్తే మన దేశంలో దీని ధర దాదాపు రూ.1.73 లక్షలుగా చెబుతున్నారు. మన దేశంలో 16 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ కలిగిన వేరియంట్ మాత్రమే అమ్ముతున్నారు.

ఈ ఫోన్ కు ఉన్న మరో ప్రత్యేకత ఏమంటే.. ప్రస్తుతం మార్కెట్ లో ఉన్న సన్నటి పోల్డబుల్ ఫోన్లలో ఇది ముందు ఉంటుందని చెబుతారు. మూసి ఉంచినప్పుడు మామూలు ఫోన్ లా కనిపిస్తుంది. తెరిచినప్పుడు టాబ్లెట్ లా కనిపిస్తుంది. దీని మెటాలిక్ ఫినిషింగ్ లగ్జరీ లుక్ ను తెచ్చి పెట్టటమే కాదు.. అందరి చూపు దీనిపై పడేలా చేస్తుందని చెప్పాలి. ప్రస్తుతం గూగుల్ పిక్సెల్ 9ప్రో వాడుతున్న చంద్రబాబు.. గతంలో ఏ ఫోన్ వాడేవారన్నది చూస్తే.. ఆయన ఐఫోన్ వాడేవారని చెబుతారు.

చాలాకాలం పాటు ఆయన యాపిల్ ఐఫోన్ వాడేవారని.. గూగుల్ ఏఐ డేటా సెంటర్ శంకుస్థాపన సందర్భంగా ఈ కొత్త ఫోల్డబుల్ ఫోన్ తో కనిపించినట్లు చెబుతున్నారు. ఇక్కడే మరో ఆసక్తికర అంశాన్ని ప్రస్తావిస్తే.. టెక్నాలజీని తన రోజువారీ జీవితంలో చంద్రబాబు ఎంతలా వాడతారన్న దానికి నిదర్శనంగా నిలుస్తుంది. 2015లో విశాఖపట్నంలో షియోమీ తన తొలి మేడ్ ఇన్ ఇండియా ఫోన్ విడుదల చేసినప్పుడు ఆ ఫోన్ ను (రెడ్ మీ 2 ప్రైమ్) కొంతకాలం పాటు వాడినట్లుగా ఆయన సన్నిహితులు చెబుతుంటారు.