చంద్రబాబు... అంబాసిడర్ కారు
ఇక ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా 393 నెంబర్ ఉన్న అంబా సిడర్ కాన్వాయిలోనే చంద్రబాబు రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించేవారు.
By: Satya P | 1 Nov 2025 9:07 AM ISTఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పని విషయంలో కఠినంగా ఉంటారు. అదే సమయంలో బాగా పనిచేసే వారిని ఆయన దగ్గరకు తీస్తారు. ఆయనకు మెచ్చుకోలు కబుర్లు చెప్పేవారు కంటే పనిచేసే వారే ఎక్కువ ఇష్టం. ఇక బాబు నిరంతరం బిజీగా గడుపుతారు. ఆయన ఒక రోజులో అత్యధిక కాలం పని చేస్తూనే ఉంటారు. దాంతో బాబుకు వేరే వ్యాపకాలు లేవా ఆయన బంధాలు అనుబంధాలు భావోద్వేగాలు గురించిన సంగతులు ఏమిటి అని అంతా ఆలోచిస్తారు. బాబు కూడా అందరి లాంటి వారే. ఆయనకు ఎన్నో తీపి గుర్తులు జ్ఞాపకాలు ఉంటాయి. ఆయన కూడా వాటిని తన వారితో పంచుకుంటారు.
కారుతో అనుబంధం :
ఇదిలా ఉంటే చంద్రబాబు తాజాగా ఒక అనుబంధం గురించి గుర్తు చేసుకుని ఎమోషన్ అయ్యారు. అదేంటి అంటే అంబాసిడర్ కారు. ఆయన ఆ కారును సీఎంగా 1995లో అయిన కొత్తల్లో ఉపయోగించేవారు. ఆ కారు నంబర్ 393. ఈ నంబర్ తో ఉంటే బాబు సొంత వాహనం అప్పట్లో ఉమ్మడి ఏపీ రాజధాని హైదరాబాద్ వీధుల్లో దర్జాగా తిరిగింది. నాటి యంగ్ చీఫ్ మినిస్టర్ గా డైనమిక్ లీడర్ గా ఉన్న బాబుని ఆయన కోరుకున్న చోటకు తీసుకుని వెళ్తూ ఎన్నో వందల వేల కిలోమీటర్లు ప్రయాణించింది.
బాబు కాన్వాయ్ లో :
ఇక ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా 393 నెంబర్ ఉన్న అంబా సిడర్ కాన్వాయిలోనే చంద్రబాబు రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించేవారు. 393 అంబాసిడర్ అంటేనే సీబీఎన్ బ్రాండ్ కార్ అనేలా ఈ కారు అనాటి కాలంలో ఎంతగానో గుర్తింపు పొందింది. అలా బాబుకు ఈ కారుకు ఒక తీయని అనుబంధం ఉంది. బాబు ఎన్నో కార్లను తన జీవితంలో చూశారు కానీ సీఎం గా తొలినాళ్లలో వాడిన ఈ అంబాసిడర్ అంటేనే ఆయనకు ఎపుడూ ప్రత్యేకమే అని చెబుతారు.
ఆధునాతన వాహనాల్లో :
అయితే కాలం మారింది. బాబుకు కూడా భద్రత అధికం అయింది. దాంతో ఏపీకి ప్రస్తుతం నాలుగోసారి ముఖ్యమంత్రి గా ఉన్న చంద్రబాబు నాయుడు భధ్రతా పరంగా ఉన్న కారణాల రిత్యా ఆధునిక వాహనాలను వినియోగిస్తున్నారు. అయితే అంతమాత్రం చేత ఆయన తన సొంత కారు అయిన నాటి అంబాసిడర్ ను మాత్రం ఎక్కడా వీడడం లేదు. పైగా దానిని ఆయన ఎంతగానో అపురూపంగానే చూసుకుంటున్నారు.
బాబు ముచ్చట :
ఇక ఈ అంబాసిడర్ కారుని బాబు ప్రత్యేకంగా తెప్పించారు. ఇది ఇప్పటి వరకు హైదరాబాదులో అక్కడి పార్టీ ఆఫీసులో ఉండేది. అలా ఉన్న ఈ కారును ప్రస్తుతం అమరావతిలోని తెలుగు దేశం పార్టీ కేంద్ర కార్యాలయంలోకి బాబు తెప్పించారు. ఇదిలా ఉంటే శనివారం పార్టీ కార్యాలయానికి వచ్చిన బాబు తిరిగి వెళ్తున్న సమయంలో ఆనాడు తాను వాడిన అంబాసిడర్ కారును చంద్రబాబు దగ్గర ఒక్కసారిగా ఆగిపోయారు. దానిని ఆయన ఆసాంతం పరిశీలించి ఎంతో అనుభూతిని పొందారు. ఆ కారులో తన ప్రయాణ స్మృతులను ఈ సందర్భంగా చంద్రబాబు గుర్తు చేసుకుని పార్టీ వారికి దాని గురించి చెప్పారు. బాబు ఎంతగానో ప్రేమించిన 393 అంబాసిడర్ కారు ఇక మీదట మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉంటుంది. దానిని అక్కడే ఉంచమని బాబు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. మరి బాబు మదిని దోచిన తొలి కారు అది అందుకే ఆయనకు అంత ముచ్చట.
