31 ఏళ్ల కిందట ఇదే రోజు.. 'చంద్రబాబు అనేనేను...'
తెలుగు వారి అన్నగారు.. ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీలో 1994-95 మధ్య సంక్షోభం తలెత్తింది.
By: Garuda Media | 1 Sept 2026 2:04 PM ISTప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రిగా నాలుగోసారి బాధ్యతలు చేపట్టి.. రెండున్నరేళ్లు పూర్తి చేసుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు తొలిసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రోజు ఇదే. సెప్టెంబరు, 1 1995నాడు ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ``చంద్రబాబు అనే నేను.. `` అంటూ.. ఆనాడు ఎల్బీ స్టేడియంలో ఆయన ప్రమాణం చేసి.. నేటికి సరిగ్గా 31 సంవత్సరాలు పూర్తయ్యాయి. తెలుగు వారి ఆత్మగౌరవ నినాదంతో ఏర్పడిన తెలుగు దేశం పార్టీలో ఏర్పడిన సంక్షోభం.. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యేందుకు దారితీసింది.
తెలుగు వారి అన్నగారు.. ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీలో 1994-95 మధ్య సంక్షోభం తలెత్తింది. లక్ష్మీపార్వతిని అన్నగారు వివాహం చేసుకోవడం.. ఆమె రాజకీయంగా ఆధిపత్యం చలాయించడం వంటివి అప్పటి టీడీపీ నాయకులకు నచ్చలేదు. దీంతో అన్నగారిపై తిరుబాటు ఎగురవేసి.. చంద్రబాబుకు జై కొట్టారు. అప్పటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో చంద్రబాబు 45 ఏళ్ల వయసులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 13వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
పాలనలో సంస్కరణలు
ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన చంద్రబాబుకు తనదైన పాలన ప్రారంభించడం పెద్ద సవాల్‌గా మారిందనే చెప్పాలి. దీంతో ఆయన రోజుకు 18 గంటల పాటు కష్టపడాల్సి వచ్చింది. అన్ని వర్గాలను మచ్చిక చేసుకున్నారు. ముఖ్యంగా మారుతున్నకాలానికి అనుగుణంగా మార్పు దిశగా అడుగులు వేశారు. ఐటీ, సంస్కరణల శకానికి నాంది పలికారు. ప్రజల వద్దకు పాలన అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ముఖ్యమంత్రి అయిన కొన్ని నెలల్లోనే, అంటే 1995 నవంబర్ 1న, పరిపాలనలో పారదర్శకత, జవాబుదారీతనం కోసం "ప్రజల వద్దకు పాలన", "శ్రమదానం" వంటి వినూత్న కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు.
మహిళా సాధికారతకు పెద్దపీట
గ్రామీణ మహిళ ఆర్థికంగా ఎదగడం కోసం డ్వాక్రా పొదుపు సంఘాల ఉద్యమాన్ని, మైక్రోఫైనాన్స్ వ్యవస్థను బలోపేతం చేశారు. ఇక, హైదరాబాద్‌ను గ్లోబల్ ఐటీ హబ్‌గా మార్చడానికి, 'హైటెక్ సిటీ' నిర్మాణానికి ఆయన తొలి విడత పాలనలోనే పునాదులు పడ్డాయి. జాతీయ రాజకీయాల్లోనూ చంద్రబాబు చక్రం తిప్పారు. 1996లో కాంగ్రెసేతర, బీజేపీయేతర పార్టీలతో కూడిన 'యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్‌గా ఎంపికయ్యారు. కేంద్రంలో ప్రభుత్వాల ఏర్పాటులో అత్యంత కీలక పాత్ర పోషించారు.
