నాడు సీఈఓ అన్నారు...నేడు బాబుకు కొత్త బిరుదు !
దాంతో మూడు దశాబ్దాల బాబు ముఖ్యమంత్రిత్వంలో సీఈఓ నుంచి వాటర్ మాన్ గా ఎలా తనను తాను మార్చుకుంటూ ప్రయాణించారు అన్నది ఆసక్తికరమే అంటున్నారు.
By: Satya P | 6 Sept 2026 8:47 AM ISTచంద్రబాబు అధికారంలోకి వచ్చిన కొత్తల్లో సంస్కరణవాదిగా ముందుకు అడుగులు వేశారు. దాంతో ఆయన పాలనలో దూకుడు కనిపించింది. ఆయన అభివృద్ధి చెందిన ఉమ్మడి ఏపీని వేగంగా చూడాలనుకుని చేసిన ప్రయత్నాలలో అనేక కార్యక్రమాలను చేపట్టారు. ఆ సమయంలో బాబుని సీఈఓ అని అన్నారు. దానికి బాబు ఏ విధంగా స్వీకరించారో తెలియదు కానీ ఇపుడు ఆయనకు కొత్త బిరుదు ఇచ్చారు. అదే వాటర్ మాన్ అని గొప్ప గుర్తింపునే ఇచ్చారు. దాంతో మూడు దశాబ్దాల బాబు ముఖ్యమంత్రిత్వంలో సీఈఓ నుంచి వాటర్ మాన్ గా ఎలా తనను తాను మార్చుకుంటూ ప్రయాణించారు అన్నది ఆసక్తికరమే అంటున్నారు.
దార్శనీకుడు అంటూ :
ఇక చంద్రబాబు అంటే టెక్నాలజీ మీద మోజు ఉన్న వారుగా జాతీయ ప్రాంతీయ పత్రికలు అభివర్ణిస్తూ వచ్చేవి. ఆయనను ఇన్నాళ్లూ ఐటీ దార్శనికుడు అని కూడా పిలుస్తూ ఉండేవి. అంతే కాదు సీఈఓ అని కూడా ఒక ఇమేజ్ ని క్రియేట్ చేశాయి. అయితే ఇపుడు మాత్రం వాటర్ మ్యాన్ అనే సరికొత్త గుర్తింపుని ఇస్తున్నాయి. ఇదంతా బాబు సుదీర్ఘ కాల రాజకీయ జీవితంలో అధికారంలో పరిపాలకుడుగా తనను తాను మార్చుకుంటూ ముందుకు సాగిన వైనంగా చెబుతున్నారు. అంతే కాదు ఆయన వేస్తున్న అడుగులు ఆ వైపుగా ఉన్నాయని కూడా విశ్లేషిస్తున్నారు.
జాతీయ స్థాయిలో కితాబు :
ఇదిలా ఉంటే ఇటీవల ప్రముఖ జాతీయ పత్రిక చంద్రబాబు నాయుడు ఐటీ రంగం నుండి సాగునీటి రంగం వైపు సాగించిన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానాన్ని విశ్లేషిస్తూ ఆయనను వాటర్ మ్యాన్ గా అభివర్ణించింది. ఆయన ప్రస్థానం ఏ విధంగా పరివర్తనం చెందిందో కూడా అందులో రాసుకుని వచ్చింది. ఐటీ అంటూ బాబు తీసుకున్న నిర్ణయాలు ఆనాడు విప్లవాత్మకమైన సంస్కరణలకు దారి తీశాయని ఇపుడు అదే బాబు సాగు నీటి రంగం మీద చూపిస్తున్న శ్రద్ధ అలాగే ప్రాజెక్టుల విషయంలో ఆయన పెడుతున్న ఫోకస్ చేస్తున్న ఖర్చు ప్రభుత్వం ప్రాధాన్యతలు ఇవన్నీ చూసిన మీదట ఆ జాతీయ పత్రిక కధనంలో ఆయనను వాటర్ మ్యాన్ గా పేర్కొంటూ గొప్ప కితాబునే అందించింది.
వరస ప్రారంభోత్సవాలు :
ఈ విధంగా బాబుని గుర్తించడానికి గల ముఖ్య కారణాలు చూస్తే కనుక ఇటీవల కీలక ప్రాజెక్టులు వరుసగా ఒక రోజు తేడాలో రెండు ప్రారంభం అయ్యాయి. అవి కూడా దశాబ్దాల కాలంగా పెండింగ్‌లో ఉన్నవి కావడం విశేష. ఒకటి మార్కాపురం జిల్లాలోని పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు మొదటి దశ అయితే రెండవది అనకాపల్లి జిల్లాలోని పోలవరం ఎడమ ప్రధాన కాలువ ద్వారా ఉత్తరాంధ్రకు గోదావరి జలాలను విజయవంతంగా విడుదల చేయడం. దీంతోనే బాబుని అపర భగీరధుడిగా జాతీయ మీడియా అభివర్ణిస్తోంది. గతంలో పట్టిసీమ ద్వారా కృష్ణా గోదావరి నదుల అనుసంధానం చేసిన ఆయన భవిష్యత్తులో రాష్ట్రంలోని అన్ని ప్రధాన నదులను అనుసంధానించడమే లక్ష్యంగా పెట్టుకున్నారని కూడా పేర్కొంటోంది.
బాబు హర్షం :
ఇదిలా ఉంటే తనను వాటర్ మ్యాన్ అంటూ జాతీయ పత్రిక కధనం ప్రత్యేకంగా రాసి ప్రస్తుతించడం పట్ల చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ఆయన సామాజిక మాధ్యమం ద్వారా దీని మీద స్పందించారు. ఇంతకాలం తాను సీఈవో సీఎంగా పేర్కొనేవారని అయితే దాని కంటే నీటిని అందించిన నాయకుడిగా గుర్తుండాలనుకుంటున్నానని చెప్పారు. సీఎంగా తన వారసత్వం రాష్ట్ర నీటి ప్రవాహంలో కనిపించాలని కోరుకుంటున్నట్లుగా బాబు తెలిపారు తన సుదీర్ఘ ప్రజా జీవిత ప్రయాణంలో ఇది ఒక కొత్త దశలా కూడా అనిపిస్తోందని బాబు అన్నారు. ఇన్నేళ్లుగా నన్ను సీఈఓ ముఖ్యమంత్రి అని పిలుస్తూ వచ్చారు, అయినప్పటికీ ఎండిపోయిన భూములకు నీరందించడం రైతులకు ఆశ కల్పించడం, వ్యవసాయాన్ని మార్చడం రాబోయే తరాలకు తాగునీటిని అందించడం వంటివి ఎప్పటికీ నా అత్యంత ప్రియమైన వారసత్వంగా నిలిచిపోతాయని బాబు చెప్పుకొచ్చారు. చివరికి,నా వారసత్వం నీటి ద్వారా ప్రవహించాలని నేను కోరుకుంటున్నాను అని బాబు చెప్పడం విశేషం.
