పవర్ లో ఉన్న బాబు పార్టీకి చేయాల్సిన రిపేర్ల జాబితా
అధికారం చేతిలో లేనప్పుడు చేయలేని ఎన్నో పనులని పవర్ లో ఉన్న వేళలో చేయొచ్చు.
By: Tupaki Desk | 14 Jun 2025 4:05 AMఅధికారం చేతిలో లేనప్పుడు చేయలేని ఎన్నో పనులని పవర్ లో ఉన్న వేళలో చేయొచ్చు. అందరూ ఈ విషయాన్ని నమ్ముతారు. కానీ.. అదేం సిత్రమో కానీ చంద్రబాబు విషయంలో మాత్రం అదెప్పటికి జరగదన్న విమర్శ తరచూ వినిపిస్తూ ఉంటుంది. అధికారంలో ఉన్నప్పుడు పాలన మీద తప్పించి తమ చేతికి అధికార పగ్గాలు రావటానికి కారణమైన క్యాడర్ ను చంద్రబాబు పట్టించుకోరని చెబుతారు.
అదే సమయంలో పవర్ పోయిన తర్వాత.. పార్టీ.. క్యాడర్ మాత్రమే ఆయనకు తోడుగా నిలుస్తారు. వేళ్ల మీద లెక్కించే నేతలు తప్పించి.. చంద్రబాబు వెంట ఉండేవారు కనిపించరు. కానీ.. క్యాడర్ మాత్రం అలా కాదు. చంద్రబాబు అధికారంలో ఉన్నా లేకున్నా.. ఆయన తమను పట్టించుకున్నా.. పట్టించుకోకున్నా ఆయన ఫాలోవర్లుగా ఉండేందుకు ఆసక్తి చూపుతారు. తెలుగు రాష్ట్రాల్లో మరే రాజకీయ పార్టీ అధినేతకు లేని బలంగా దీన్ని చెప్పాలి. అలాంటి బలాన్ని అంతకంతకూ పెంచుకోవాలే తప్పించి.. తగ్గించుకోకూడదు. కానీ.. చంద్రబాబు మాత్రం అదే తప్పును తరచూ చేస్తారు.
వైసీపీ హయాంలో ఆయనకు ఎదురైన ప్రతికూల పరిస్థితులు.. పార్టీ నేతలకు మించి క్యాడర్ తనకు అండగా నిలవటాన్ని గుర్తించిన చంద్రబాబు.. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. కూటమి ప్రభుత్వం కొలువు తీరి ఏడాది పూర్తైంది. మరి.. చంద్రబాబు చెప్పినట్లే చేతల్లో చూపించారా? అంటే లేదనే చెప్పాలి. కేసులు.. వేధింపులు.. ఇబ్బందులు.. ఆర్థిక నష్టాల్ని ఎదుర్కొని చంద్రబాబుకు అండగా నిలిచిన లక్షలాది మందికి ప్రత్యేకంగా సాయం చేయాల్సిన అవసరం లేకున్నా.. అవసరమైన వారికి సైతం అధికార అండ దొరకని వైనం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
ప్రభుత్వం కొలువు తీరి ఏడాది అవుతున్న వేళ.. ఈ అంశాలపై చంద్రబాబు ఫోకస్ చేయాలన్న వాదన బలంగా వినిపిస్తోంది. ప్రభుత్వాన్ని ఎలా సెట్ చేయాలో.. పార్టీని.. పార్టీ క్యాడర్ కు సంబంధించిన ఇష్యూల్ని సైతం వెంటనే సెట్ చేయాల్సిన అవసరం ఉందంటున్నారు. ఏడాది పాలన పూర్తైన వేళ.. తనను నమ్ముకున్న క్యాడర్ తో పాటు.. ఆయనకు డైహార్ట్ ఫాలోవర్ల విషయంలో చంద్రబాబు ఏం చేస్తే బాగుంటుందన్నది చూస్తే..
- నియోజకవర్గాల వారీగా క్యాడర్ ను బలోపేతం చేయకపోవటం.. ఫాలోవర్ల ఇబ్బందుల్ని పట్టించుకోని ఎమ్మెల్యేలకు షాక్ ట్రీట్ మెంట్ తక్షణం ఇవ్వాలి.
- నియోజకవర్గాల వారీగా పార్టీకి విధేయులుగా ఉండి కేసుల్ని ఎదుర్కొని మరీ పార్టీకి అండగా నిలిచిన వారికి వస్తున్న కష్టాలు ఏంటి? వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులు? ఈ విషయంలో ఎమ్మెల్యేలు చేస్తున్న తప్పుల్ని వెంటనే సరిదిద్దాలి.
- వైసీపీ పాలనలో అక్రమ కేసులు.. వేధింపులు.. అరాచకాలకు ఎదురొడ్డి ఆర్థికంగా దెబ్బతిన్నోళ్లు ఎందరో. అలాంటోళ్లకు గుర్తింపు దక్కేలా నామినేటెడ్ పదవుల్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి.
- కొందరు తమకు ఎలాంటి పదవులు వద్దని అనుకుంటారు.అలాంటి వారు తమకు తగిన గుర్తింపు దక్కితే అదే పదివేలుగా భావిస్తారు. ఇలాంటి వారిని నాయకత్వం గుర్తిస్తే అదే పది వేలుగా భావిస్తారు. ఎలాంటి సాయాన్ని కోరుకోరు. ఇలాంటి వారిని గుర్తించటం.. వారితో భేటీ కావటం.. వారి సలహాల్ని.. సూచనల్ని తీసుకోవాల్సి ఉంటుంది.
- సొంత పార్టీ ఎమ్మెల్యేలు తమను పట్టించుకోకపోవటం.. తమ పనుల విషయంలో వారు ప్రదర్శిస్తున్న నిర్లక్ష్యం క్యాడర్ ను తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. ఇలాంటి వారికి తక్షణమే చెక్ వేసేలా.. తగిన హెచ్చరికల్ని జారీ చేయాల్సిన అవసరం ఉంది.
- ఎన్నికల వేళలో ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి..వారి అనుచరులకే ప్రభుత్వంలో ప్రాధాన్యత దక్కుతోంది. అంతేకానీ.. ఏళ్ల తరబడి పార్టీని నమ్ముకున్న వారిని పట్టించుకోని దుస్థితి.
- పలువురు మంత్రులు.. పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలు పార్టీ క్యాడర్ కు.. నేతలకు అందుబాటులో ఉంటం లేదు. ఇదంతా ఒక ఎత్తు. ఏదైనా పని కోసం వస్తే.. నిర్మోహమాటంగా డబ్బులు అడగటం.. అదేమంటే ఎన్నికల్లో పెట్టిన ఖర్చు ఎలా పూడ్చుకోవాలన్న మాటలకు వాయు వేగంతో చెక్ పెట్టాల్సిందే.
- టీడీపీ వారికి పని చేస్తే తమకు డబ్బులు రావన్న కారణంగా కొందరు ఎమ్మెల్యేలు.. వారు అడిగిన పనులు చేయని పరిస్థితి. ఇలాంటి వాటిని సరి చేయాల్సిన అవసరం చంద్రబాబు మీద ఉంది.
- తొలిసారి ఎన్నికల్లో గెలిచిన వారికి సైతం మంత్రి పదవుల్ని చంద్రబాబు కేటాయిస్తే.. వారు మరింత బాధ్యతగా పని చేసి.. పార్టీని బలోపేతం చేయాలి. కానీ.. వారిలో ఎక్కువ మంది పార్టీని..పార్టీ క్యాడర్ ను పట్టించుకోని పరిస్థితి.
- పార్టీ క్యాడర్ మధ్య వచ్చే విభేదాలు.. అధిపత్య పోరును ఎప్పటికప్పుడు గమనిస్తూ.. వారిని కంట్రోల్ చేసే వ్యవస్థను వేగంగా ఏర్పాటు చేయాల్సిన అసరం ఉంది.