Begin typing your search above and press return to search.

మంత్రుల ఓఎస్డీలపై చంద్రబాబు అసహనం?

ఈ క్రమంలోనే కొందరు టీడీపీ నేతలకు పదవులు దక్కకపోవడంతో వారిని బుజ్జగించి వారికి భవిష్యత్తులో న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు.

By:  Tupaki Desk   |   14 April 2025 4:00 AM IST
మంత్రుల ఓఎస్డీలపై చంద్రబాబు అసహనం?
X

ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీల కలయికలో ఎన్డీఏ కూటమి ఏర్పడి 2024 ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కూటమిలోని అన్ని పార్టీలలోని నేతలకు సమన్యాయం చేసేందుకు ఏపీలో ఎన్డీఏ కూటమి సభాపక్ష నేత, ఏపీ సీఎం చంద్రబాబు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. మూడు పార్టీలకు మంత్రి పదవుల విషయంలో కూడా సమతూకం పాటించేందుకు చంద్రబాబు చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ క్రమంలోనే కొందరు టీడీపీ నేతలకు పదవులు దక్కకపోవడంతో వారిని బుజ్జగించి వారికి భవిష్యత్తులో న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు.

ఇలా జాగ్రత్తగా మంత్రివర్గ విస్తరణ చేసిన చంద్రబాబుకు తాజాగా మంత్రుల పేషీల నుంచి కొన్ని కంప్లయింట్లు రావడం ఇబ్బందిగా మారిందని తెలుస్తోంది. కొందరు మంత్రుల ఓఎస్డీలు, పీఎస్ లు, పీఏలపై అవినీతి ఆరోపణలు రావడం కూటమి ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా కనిపిస్తోందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే మంత్రుల పేషీలపై చంద్రబాబు ప్రత్యేక నిఘా పెట్టారని తెలుస్తోంది.

ఇక, ఎల్లుండి జరగబోయే కేబినెట్‌ భేటీలో ఈ విషయంపై మంత్రులతో సీఎం చంద్రబాబు చర్చించే అవకాశముందని తెలుస్తోంది. ఆల్రెడీ కొందరికి చంద్రబాబు హెచ్చరికలు జారీ చేశారని తెలుస్తోంంది. ఇంటెలిజెన్స్ అధికారులు ఇచ్చిన నివేదికలలోని విషయాలను చంద్రబాబు సీరియస్‌గా తీసుకున్నారట. ఓ మంత్రి ఓఎస్డీపై చర్యలు తీసుకునేందుకు చంద్రబాబు సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. అధికారుల అలసత్వం వల్ల మంత్రులకు, ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్న సందేశం పంపాలని చంద్రబాబు ఫిక్స్ అయ్యారట.