Begin typing your search above and press return to search.

సైకిల్ పై చలోచలో.. చంద్రబాబు వినూత్న కార్యక్రమం!

గతంలో వైసీపీ నేతలు కేవలం 'మేం ఇది ఇచ్చాం, అది ఇచ్చాం' అని లబ్ధిదారుల జాబితా చదివి వినిపించారే తప్ప, స్థానిక సమస్యలను పట్టించుకోలేదని చెబుతున్నారు.

By:  Tupaki Political Desk   |   7 Jun 2026 1:39 PM IST
సైకిల్ పై చలోచలో.. చంద్రబాబు వినూత్న కార్యక్రమం!
X

ఏపీలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మరో భారీ పొలిటికల్ క్యాంపెయిన్‌కు తెరలేపింది. ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తి కావస్తున్న తరుణంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సరికొత్త వ్యూహంతో ప్రజల ముందుకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఈ నెల 25 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటికీ కూటమి అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. కేవలం ఏసీ రూముల్లో రివ్యూలు, అసెంబ్లీలో ప్రసంగాలకే పరిమితం కాకుండా ప్రతి ఎమ్మెల్యే, ఎంపీ నేరుగా క్షేత్రస్థాయికి వెళ్లి ప్రజల గడప తొక్కాలని చంద్రబాబు కఠిన ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ సారి సీఎం చంద్రబాబు మార్క్ ప్లానింగ్ ఊహించని విధంగా ఉందని వ్యాఖ్యానిస్తున్నారు.

హాట్ టాపిక్ గా సీఎం కండిషన్

ఈ క్యాంపెయిన్‌లో అత్యంత ఆసక్తికరమైన అంశం నేతలు లగ్జరీ కార్లు దిగి, ప్రజల మధ్యకు సైకిళ్లపై వెళ్లాలని చంద్రబాబు రూల్ పెట్టారు. సాధారణ సైకిల్ అయితే మరీ మంచిదని, లేదంటే ఎలక్ట్రిక్ సైకిల్ (ఈ-బైక్) వాడాలని స్పష్టం చేశారు. కేవలం నేతలకు చెప్పడమే కాదు.. తాను కూడా స్వయంగా సైకిల్ తొక్కుతూ ప్రజలను కలుస్తానని బాబు ప్రకటించడం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

అసలు వ్యూహం ఇదే!

ఈ ఇంటింటికీ ప్రోగ్రామ్ వెనుక చంద్రబాబు రెండు ప్రధాన లక్ష్యాలను నిర్దేశించుకున్నారని చెబుతున్నారు. నేతల్లో మౌనాన్ని వీడగొట్టి ప్రజలతో మమేకమయ్యేలా చేయడం ప్రధానమంటున్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో ఇటువంటి కార్యక్రమం నిర్వహించకపోవడంతో ఇంటింటికి ప్రభుత్వంపై అంచనాలు ఎక్కువగా పెట్టారని అంటున్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మెజారిటీ నేతలు సైలెంట్ అయ్యారనే టాక్ ఉంది. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరినీ ప్రజల్లోకి పంపి, పార్టీ యంత్రాంగాన్ని ముందస్తుగానే ఎన్నికల మూడ్‌లోకి తీసుకువెళ్లాలనే వ్యూహం కూడా ఉందని వ్యాఖ్యానిస్తున్నారు.

మరో వైపు కూటమి ప్రభుత్వం ఇప్పటివరకు అందించిన సంక్షేమ పథకాలు, తెచ్చిన పెట్టుబడులు, నిరుద్యోగుల కోసం సృష్టిస్తున్న ఉపాధి అవకాశాలను కరపత్రాల రూపంలో ప్రతి ఇంటికీ చేరవేయాలని ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. గతంలో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ‘గడప గడపకూ మన ప్రభుత్వం’ పేరిట ఇలాంటి ప్రోగ్రామే చేపట్టింది. కానీ, అది ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదని ప్రభుత్వం భావిస్తోంది. అప్పట్లో ఎదురైన అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకుంటూ ప్రజల విశ్వాసాన్ని మరింత పెరిగేలా ప్రస్తుత ప్రభుత్వం వ్యూహాత్మకంగా పావులు కదుపుతోందని అంటున్నారు.

గతంలో వైసీపీ నేతలు కేవలం 'మేం ఇది ఇచ్చాం, అది ఇచ్చాం' అని లబ్ధిదారుల జాబితా చదివి వినిపించారే తప్ప, స్థానిక సమస్యలను పట్టించుకోలేదని చెబుతున్నారు. కూటమి నేతలు ఆ తప్పు చేయకూడదని, తాము చేసిన మంచిని చెబుతూనే, ప్రజలు పడుతున్న ఇబ్బందులను ఓపికగా వినాలని సీఎం దిశానిర్దేశం చేస్తున్నారు. ప్రజలు చెప్పిన సమస్యలను నోట్ చేసుకుని, వాటిని నిర్ణీత కాలంలో పరిష్కరిస్తేనే ఈ ప్రోగ్రామ్‌కు అసలైన క్రెడిట్ దక్కుతుందని చెబుతున్నారు. అదే సమయంలో ఓట్లతో సంబంధం లేకుండా ప్రతి ఇంటికి వెళ్లడం, విపక్షానికి చెందిన కార్యకర్తల ఇళ్లకు వెళ్లినప్పుడు కూడా హుందాగా వ్యవహరించడం ద్వారా మైలేజ్ పెంచుకోవాలని ప్రభుత్వం సూచిస్తోంది.