టీడీపీ డీఎన్ఏలోనే బీసీలు!: చంద్రబాబు
టీడీపీ డీఎన్ ఏలోనే బీసీలు ఉన్నారని.. సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.
By: Garuda Media | 19 May 2026 7:00 PM ISTటీడీపీ డీఎన్ఏలో నే బీసీలు ఉన్నారని.. సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. నెల్లూరు జిల్లా కావలిలో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వం చేసిన విధ్వంసాన్ని సరి చేయడానికి 23 నెలల సమయం పట్టిందని అన్నారు. రాష్ట్ర పునర్నిర్మాణం చేస్తున్నామని చెప్పారు. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన అందిం చటంతో పాటు విశాఖ, అమరావతి, తిరుపతి రీజియన్లుగా ఏపీని అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. రూ.23 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని, 24 లక్షల మందికి ఉద్యోగాలు కూడా వస్తాయని తెలిపారు.
రాయలసీమలో డిఫెన్సు, డ్రోన్స్, స్పేస్ ఏరోస్పేస్, ఎలక్ట్రానిక్స్ రంగంలో పరిశ్రమలు వస్తున్నాయని సీఎం వివరించారు. ప్రతి ఇంటిపైనా, పొలంలోనూ సోలార్ రూఫ్ టాప్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసుకు నేందుకు కూడా అవకాశం కల్పిస్తున్నామన్నారు. కూటమి ప్రభుత్వం బుల్లెట్ స్పీడ్ తో పరుగులు పెడుతోందని వ్యాఖ్యానించారు. రాయల్ ఎన్ ఫీల్డ్ సంస్థ 18 నెలల్లో తిరుపతి వద్ద బుల్లెట్ మోటారు సైకిల్ తయారీ ప్లాంట్ ఏర్పాటు చేస్తోందన్నారు. తద్వారా రాష్ట్ర ఖ్యాతి ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతుందన్నారు.
వాట్సప్ గవర్నెన్సు ద్వారా పౌరసేవలు కూడా అందించి పారదర్శక పాలన అందిస్తున్నామని చంద్రబాబు చెప్పారు. టీడీపీ డీఎన్ఏలోనే బీసీలు ఉన్నారని తెలిపారు. బీసీలకు- టీడీపీకి దశాబ్దాల అనుబంధం ఉందన్న ఆయన.. చేనేత కార్మికులకు 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నామని తెలిపారు. నాయీ బ్రాహ్మణులకు రూ.25 వేల వేతనం, వడ్డెర్లకు, గీతకార్మికులకు గనులు, మద్యం దుకాణాలను కేటాయిస్తున్నామని తెలిపారు.
''45 ఏళ్లుగా బీసీలు టీడీపీని ఆదరించారు. వారి రుణం తీర్చుకుంటాం. కావలి నియోజకవర్గం తుమ్మల పెంట గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతాం. ఈ ప్రాంతంలో సాగర్ డిఫెన్స్ సంస్థ ఏర్పాటు అవుతోంది. కొందరు అపోహలు సృష్టించే ప్రయత్నం చేశారు. దీని ద్వారా స్థానికులకే ఉపాధి, ఉద్యోగాలు లభిస్తాయి. ఈ విషయంలో ఎలాంటి అపోహలకూ తావులేదు. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లినప్పుడు చేపలు ఎక్కడ లభ్యం అవుతుందో కూడా సమాచారం ఇస్తున్నాం. మెకనైజ్డ్ బోట్ల ద్వారా చేపలను సులువుగా వేట చేసేలా ప్రజా ప్రభుత్వం సహకారం అందిస్తుంది.'' అని ముఖ్యమంత్రి తెలిపారు.
