తెలుగువారి అదృష్టం చంద్రబాబు.. సెలబ్రిటీల పొగడ్తలు
ముఖ్యమంత్రి చంద్రబాబు డైమండ్ జూబ్లీ బర్త్ డే విషెస్ తో సోషల్ మీడియా హోరెత్తిపోతోంది.
By: Tupaki Desk | 20 April 2025 4:33 PM ISTముఖ్యమంత్రి చంద్రబాబు డైమండ్ జూబ్లీ బర్త్ డే విషెస్ తో సోషల్ మీడియా హోరెత్తిపోతోంది. ఎక్స్, ఫేస్ బుక్, ఇన్ స్టా.. ఒకటేంటి అన్ని సోషల్ మీడియా ప్లాట్ ఫాంల్లోనూ చంద్రబాబు ఫొటోలు, పుట్టినరోజు వేడుకలు, శుభాకాంక్షలు ట్రెండింగ్ అవుతున్నాయి. పలువురు రాజకీయ నాయకులు, సినీ, క్రీడా ప్రముఖులు ముఖ్యమంత్రికి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రితో తాము కలిసివున్న ఫొటోలను షేర్ చేస్తున్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మెగాస్టార్ చిరంజీవి గతంలో చంద్రబాబుతో తాను దిగిన ఓ అపురూప చిత్రాన్ని ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. దూరదృష్టి కలిగిన నాయకుడు దొరకడం తెలుగు ప్రజల అదృష్టం అంటూ చంద్రబాబు సేవలను కొనియాడారు చిరంజీవి. ‘‘జన్మదిన శుభాకాంక్షలు చంద్రబాబు గారు.
దార్శనికత, కృషి, పట్టుదల, అంకిత భావం ఉన్న అరుదైన నాయకులు మీరు. ఆ భగవంతుడు మీకు ఆయురారోగ్యాలతో పాటు ప్రజల కోసం మీరు కనే కలలు నెరవేర్చే శక్తిని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు 75వ జన్మదిన శుభాకాంక్షలు’’ అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు.
నా మిత్రుడు, నా శ్రేయోభిలాషి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి పుట్టినరోజు సందర్భంగా
శుభాకాంక్షలు. వంద సంవత్సరాలు అష్టైశ్వర్య, ఆయురారోగ్యాలతో క్షేమంగా ఉండాలని మనసా వాచా కోరుకుంటున్నాను అంటూ సీనియర్ నటుడు, మాజీ రాజ్యసభ సభ్యులు మోహన్ బాబు ట్వీట్ చేశారు. అదేవిధంగా సీనియర్ దర్శకుడు రాఘవేంద్రరావు ప్రత్యేక వీడియో తయారు చేయించి విజనరీ, మార్గదర్శ, పీ4 సృష్టికర్త చంద్రబాబు అంటూ ట్వీట్ చేశారు. ఆంధ్ర ప్రదేశ్ ని స్వర్ణాంధ్ర ప్రదేశ్ దిశగా నడిపిస్తూ సర్వతోముఖాభివృద్ధి కోసం ఎంతో గొప్ప విజనరీ, నిరంతరం శ్రమిస్తున్న శ్రీ నారా చంద్రబాబు నాయుడి గారికి జన్మదిన శుభాకాంక్షలు అంటూ రాఘవేంద్రరావు ట్వీట్ చేశారు.
అదేవిధంగా దర్శకుడు గోపీచంద్ మలినేని, మంచు విష్ణు, సోనూసూద్, నిర్మాత నాగవంశీ వంటివారు తమ సోషల్ ప్లాట్ ఫాం వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబు పనితీరు, అంకితభావం, దూరదృష్టిని కొనియాడుతూ పోస్టులు చేశారు.
