చంద్రబాబు కోసం కదులుతున్న తమ్ముళ్లు.. అనుమతి కోసం వెయిటింగ్..!
కాగా.. 1950, ఏప్రిల్ 20వ తేదీన చంద్రగిరి మండలం నారా వారిపల్లెలో ఖర్జూర నాయుడు, అమ్మణమ్మ దంపతులకు చంద్రబాబు తొలి సంతానంగా జన్మించారు.
By: Tupaki Desk | 14 April 2025 7:38 PM ISTఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు పుట్టిన రోజు ఈ నెల 20న రానుంది. మరో వారంలో రానున్న ఈ వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించేందుకు పార్టీ నాయకులు రెడీ అయ్యారు. దీనికి సంబంధించి తాజాగా చంద్రబాబుకు పలు జిల్లాలకు చెందిన సీనియర్ నాయకులు విన్నవించారు. ఈ నెల 20వ తేదీ నాటికి చంద్రబాబుకు 75 సంవత్సరాలు వస్తాయి. అంటే.. వజ్రోత్సవం అన్నమాట! దీనిని అంగరంగ వైభవంగా నిర్వహించాలన్నది పార్టీ నాయకుల అభిలాష.
ఇప్పటికే దీనికి సంబంధించి కర్నూలు మాజీ ఎంపీ టీజీ వెంకటేష్.. బీజేపీలో ఉన్నా.. టీడీపీ అధినేత చంద్రబాబుపుట్టిన రోజు వేడుకల కోసం భూరి విరాళం ఇచ్చారు. దీంతో కర్నూలు నాయకులు జిల్లా వ్యాప్తంగా వారం రోజుల పాటు.. సంబరాలు చేసేందుకు.. ప్రయత్నిస్తున్నారు. ఈ నెల 20వ తేదీ నుంచి 26వ తేదీ వరకు కూడా.. ఈ సంబరాలను ఘనంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ విషయం తెలుసుకు న్న ఇతర జిల్లాల్లోని నాయకులు కూడా.. చంద్రబాబు అనుమతి కోసం అమరావతి బాట పట్టారు. వజ్రోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తామని.. అనుమతించాలని వారు కోరుకున్నారు. దీనిపై చంద్రబాబు ఇంకా నిర్ణయం తీసుకోలేదు. అప్పటికి ఉన్న పరిస్థితులను బట్టి ఆయన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.
కాగా.. 1950, ఏప్రిల్ 20వ తేదీన చంద్రగిరి మండలం నారా వారిపల్లెలో ఖర్జూర నాయుడు, అమ్మణమ్మ దంపతులకు చంద్రబాబు తొలి సంతానంగా జన్మించారు. ఈయనకు ఒక సోదరుడు రామ్మూర్తి నాయుడు(ఇటీవల మృతి చెందారు), ఇద్దరు సోదరీ మణులు ఉన్నారు. సోదరీ మణుల వివరాలు పెద్దగా ప్రచారంలో లేవు. విద్యార్థిగా ఉన్నప్పటి నుంచి రాజకీయాల్లోకి వచ్చిన చంద్రబాబు అనతి కాలంలోనే విజయాలు దక్కించుకున్నారు.
కాంగ్రెస్‌లో చేరిన ఆయన మంత్రి పదవిని కూడా చేపట్టారు. అయితే.. చంద్రగిరిలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఓడిపోయిన దరిమిలా.. టీడీపీలో చేరి.. అధికారం దక్కించుకున్నారు. ప్రస్తుతం నాలుగోసారి ముఖ్యమం త్రిగా ఏపీలో కూటమి సర్కారును సమర్థవంతంగా నడిపిస్తున్నారని.. జాతీయ స్తాయి నాయకులతో ప్రశంసలు అందుకుంటున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం 74 ఏళ్ల వయసున్న చంద్రబాబు.. 24 ఏళ్ల యువకుడిగా.. నిత్యం 18 గంటల పాటు పనిచేసేందుకు ఇష్టపడడం నేటి యువతకు రాజకీయాలకు అతీతంగా స్ఫూర్తిదాయకమని అంటారు మేధావులు.
ఈ నెల 20తో ఆయన 74 ఏళ్లు పూర్తి చేసుకుని 75వ సంవత్సరంలోకి అడుగు పెట్టనున్నారు. ఈ నేపథ్యంలోనే తమ్ముళ్లు సంబరాలకు సిద్ధమవుతున్నారు. అయితే.. చంద్రబాబుకు ఆడంబరాలు ఇష్టం ఉండవని తెలిసిన నేపథ్యంలో ఆయన అనుమతి కోసం.. వెయిట్ చేస్తున్నారు.
