సమస్య వాళ్లతోనే అంటున్న చంద్రబాబు.. ఇంతకీ వాళ్లెవరు..?
సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నేతల్లో చంద్రబాబు మొదటి వాడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
By: Tupaki Desk | 24 Aug 2025 6:00 PM ISTసుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నేతల్లో చంద్రబాబు మొదటి వాడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. తన మామ దివంగత నందమూరి తారక రామారావు హయాంలో పార్టీ పనులు చూసుకుంటూ.. ఆ తర్వాత పార్టీలో కీలక రోల్ ప్లే చేసి సీఎంగా పదవి చేపట్టిన ఆయన ఉమ్మడి రాష్ట్రానికి ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా పని చేసి రికార్డు సృష్టించారు. పార్టీ, పాలనను సమర్థవంతంగా నిర్వహించే నేతగా కూడా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ఆ తరానికి ఈ తరానికి వారధిగా కూడా చంద్రబాబు నిలుస్తారు. అందుకేనేమో వృద్ధులకు ఎలాంటి పథకాలు కావాలి. యంగ్ స్టర్స్ కు ఎలాంటి పథకాలు కావాలో ఆయన తెలిసినంతగా బహుషా మరో నేతకు తెలియదేమో. ఇదే కాదు గీత దాటితే ఎవరిని ఎలా కంట్రోల్ చేయాలో కూడా ఆయనకు వెన్నతో పెట్టిన విద్యే. క్రమ శిక్షణకు మారు పేరుగా నిలుస్తున్న చంద్రబాబును చూసి సీనియర్ నాయకులు కూడా వణికిపోతుంటారంటే సందేహం లేదు.
గీత దాటుతున్న వారిపై నిఘా..
ఇటీవల పార్టీలో వివాదాలు మొదలయ్యాయి. తరుచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ విషయంలో బాబు సీరియస్ గా ఉన్నారని తెలుస్తోంది. పార్టీలో గొడవలు తెచ్చే నేతలకు పలు మార్లు హెచ్చరికలు కూడా జారీ చేశారట. రీసెంట్ గా గీత దాటుతున్న ఎమ్మెల్యేలకు సంబంధించిన బాబు కీలకమైన వ్యాఖ్యలు చేశారట. పార్టీలోని సీనియర్ నాయకులకు క్రమ శిక్షణ గురించి తెలిసే ఉంటుందని అందుకే వారు నిబంధనల మేరకు నడుచుకుంటారని, కొత్తగా ఎన్నికైన వారు కొంత బాధ్యతారాహిత్యంతో ఉంటున్నారని ఆయన అన్నారు. ఇలాంటి 35 మంది ఎమ్మెల్యేలను పిలిచి మాట్లాడినట్లు చెప్పారు.
ఇటీవల 35 మంది ఎమ్మెల్యేలతో సమావేశం..
35 మంది ఎమ్మెల్యేలతో సమావేశం ఏర్పాటు చేసి తన వ్యవహారం గురించి చెప్పుకచ్చారు. ‘ఎవరైనా సరే గాడి తప్పుతున్నట్లు అనిపిస్తే ఒకసారి పిలిచి చెప్తాను.. పద్ధతి మార్చుకోకుంటే మరోసారి పిలిచి చెప్తాను.. అయినా మార్చుకోకుంటే.. మూడో సారి కఠినంగా వ్యవహరిస్తా.. అయితే రెండో సారి మూడో సారి పిలవాలా? వద్దా? అనేది వారి ప్రవర్తనపై ఆధారపడి ఉంటుంది’ అని చెప్పారు. అయితే బాబు వార్నింగ్ ఇస్తారు కానీ.. చర్యలు తీసుకోరు అన్న వారు కూడా లేకపోలేదు. గీత దాటుతున్నారని తెలిసిన తర్వాత వార్నింగ్ లు ఏంటి? వారిని ఎందుకు ఉపేక్షించాలంటూ ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
వార్నింగ్ లు వద్దు.. యాక్షన్ కావాలంటున్న నేతలు..
పార్టీ పేరు చెడగొడుతున్న వారికి వార్నింగ్ లు ఏంటని, చేతల్లో చూపించాలని సీనియర్ నాయకులు బాబుకు సూచిస్తున్నారు. కొత్తగా ఎన్నికైన వారిలో ఇవన్నీ తాటాకు చప్పుళ్లలా ఉంటాయని, యాక్షన్ లోకిదిగిన తర్వాతే మిగతా వారు భయపడతారని కొందరు అంటున్నారు. కఠినంగా వ్యవహించాలని కోరుతున్నారు.
