మంత్రులపై మంత్రులు.. ఈ పెత్తనం ఎందాకా..?
ఇది ముమ్మాటికీ వాస్తవం. నిజమో కాదో.. మంచో చెడో.. తెలియదు.. ఒక రాజకీయ పార్టీ ఎంత బద్నాం కాకూడదో.. అంతా వైసీపీ బద్నాం అయిపోయింది.
By: Tupaki Desk | 30 April 2025 10:02 PM ISTవైసీపీ అధినేత జగన్ రాజకీయాలను గమనిస్తే.. ఇప్పటికింతే! అనే నిట్టూర్పు సీనియర్ నాయకుల నుంచి జూనియర్ల వరకు వినిపిస్తోంది. నలుగురు నేతలు-నాలుగు గోడల మధ్యకే జగన్ రాజకీయాలు పరిమితమవుతున్నాయి. రాష్ట్రంలో ఎన్నికలు పూర్తయి.. వైసీపీ పరాజయం పాలై.. ఇప్పటికి ఏడాది గడిచినప్పటికీ జగన్ తీరులో ఎక్కడా మార్పు రాలేదు. ఆయన తాడేపల్లికి లేదా.. బెంగళూరుకు మాత్రమే పరిమితం అవుతున్నారన్న విషయం అందరికీతెలిసిందే. నిజానికి ఈ పది మాసాల కాలంలో ఒక్కటంటే ఒక్క ప్రజా ఉద్యమాన్ని ఆయన నిర్వహించలేక పోయారు.
''ప్రభుత్వాన్ని విమర్శించేందుకు మాత్రమే జగన్ బయటకు రావాలని మేం కోరుకోవడం లేదు. ఆయనకు గురుతర బాధ్యత చాలానే ఉంది. పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయాలి. ముఖ్యంగా ప్రజల్లో ఉన్న అనుమానాలు.. సందేహాలనునెరవేర్చాలి . ఆదిశగా జగన్ ఎంతో చేయాలి. దీనికి ముందు ఆయన చాలా హోం వర్క్ చేయాల్సి ఉంది. ఇప్పుడు మేం ఔనన్నా.. కాదన్నా.. కూటమికి ప్రజల్లో మంచిమార్కులే ఉన్నాయి. ఆ మార్కులు తగ్గకపోయినా.. తగ్గినా.. మాకు సంబంధం లేకుండా..మా మార్కులు పెరిగేలా వ్యవహరించాల్సి ఉంది'' అని విజయవాడకు చెందిన ఓ నాయకుడు చెప్పుకొచ్చారు.
ఇది ముమ్మాటికీ వాస్తవం. నిజమో కాదో.. మంచో చెడో.. తెలియదు.. ఒక రాజకీయ పార్టీ ఎంత బద్నాం కాకూడదో.. అంతా వైసీపీ బద్నాం అయిపోయింది. ఈ విషయం ఎవరో చెప్పడం కాదు..వైసీపీ నాయకులే చెబుతున్నారు. బూతులు మాట్లాడిన మంత్రులు ఒకరిద్దరు మాత్రమే ఉన్నా.. ఇతర మంత్రులకు కూడా.. అదే ట్యాగ్ పడిపోయింది. ఫలితంగా.. జగన్ మంత్రి వర్గం అంటే.. బూతుల మంత్రులు అనే పేరు వచ్చింది. ఇక, జగన్ పాలనలో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందన్న మాజీ ఐఏఎస్ అధికారి జయప్రకాష్ నారాయణ వంటివారు చేసిన ప్రసంగాలు కూడా.. మేధావులకు బాగానే ఎక్కాయి.
ఇక, నియోజకవర్గాల్లో పంపకాలు.. జగన్ కు దూరదృష్టి లేదన్న..విమర్శలు ఉండనే ఉన్నాయి. ఇవన్నీ చూస్తే.. పార్టీని ఇప్పటి కిప్పుడు ముందుకు తీసుకువెళ్లినా.. ప్రజల్లో మార్పు దిశగా అడుగులు వేయాలన్నా.. వైసీపీకి వచ్చే నాలుగు సంవత్సరాల సమయం సరిపోతుందా? అన్నది ప్రశ్న. అంతగా.. వైసీపీకి పని ఉంది. ఏదో నాలుగు రూపాయలు ఇచ్చాం.. నాలుగు పథకాలు ఇచ్చాం.. ప్రజలు మనతోనే ఉన్నారంటే.. ఆ పని కూటమి సర్కారు కూడా చేస్తోంది. కాబట్టి.. వైసీపీకి ప్రత్యేకంగా గుర్తింపు లేకుండా పోయింది. టీడీపీ అధినేత చంద్రబాబును తీసుకుంటే.. విజన్ ఉ న్న నాయకుడిగా పేరుంది. ఐటీని నిలబెట్టిన సీఎంగా పేరుంది. మరి జగన్..? ఇదీ.. ఇప్పుడు వైసీపీ నేతల ప్రశ్న. సో.. నాలుగు గోడలు-నలుగురు నేతలు కాదు.. జనంలోకి వస్తేనే మేలు.. జరిగేదని అంటున్నారు.
