Begin typing your search above and press return to search.

మామిడి రైతులకు చంద్రబాబు శుభవార్త.. కీలక ఉత్తర్వులు విడుదల!

ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరే సమయానికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అధ్వాన్నంగా ఉన్నట్లు శ్వేత పత్రాలు విడుదల చేసి వివరించిన సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   18 July 2025 7:15 PM IST
మామిడి రైతులకు చంద్రబాబు శుభవార్త.. కీలక ఉత్తర్వులు విడుదల!
X

ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరే సమయానికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అధ్వాన్నంగా ఉన్నట్లు శ్వేత పత్రాలు విడుదల చేసి వివరించిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ అటు సంక్షేమ పథకాలు అమలుచేస్తూ, మరోవైపు ప్రధానంగా రైతుల సంక్షేమానికి కట్టుబడి పని చేస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా మామిడి రైతులకు చంద్రబాబు సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది.

అవును... రైతుల సంక్షేమం విషయంలో చంద్రబాబు సర్కార్ మరోసారి తన నిబద్ధతను చాటుకుంది. మామిడి రైతుల కష్టాలను తీర్చేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగా... మార్కెట్‌ లో మద్దతు ధర లభించక ఇబ్బందులు పడుతున్న మామిడి సాగుదారులకు అండగా నిలవాలని నిర్ణయించుకుంది. ఈ సందర్భంగా రూ.260 కోట్లను విడుదల చేస్తూ ఉత్తర్వ్యులు జారీ చేసింది.

ఈ నిధులు తోటాపురి మామిడిని కిలోకు రూ.4 సబ్సిడీతో 6.5 లక్షల టన్నులు కొనుగోలు చేయడానికి వినియోగించ బడతాయని వెల్లడించింది. ఈ చర్య మార్కెట్ సమస్యలతో బాధపడుతున్న చిత్తూరు జిల్లా మామిడి రైతులకు ఎంతో ఉపయోగకరంగా మారనుంది. ఈ సందర్భంగా సబ్సిడీ మొత్తాన్ని రైతుల బ్యాంక్ ఖాతాల్లో నేరుగా జమ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

ఈ నేపథ్యంలో... రైతులు తమ బ్యాంక్ అకౌంట్లను తనిఖీ చేసుకోవాలని సూచించారు. వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని కోరుతూ రూ.260 కోట్లు ఎం.ఐ.ఎస్. విధానంపై పూర్తి సహాయం అందించాలని కోరింది. అదేవిధంగా ఆగష్టు 2025 వరకు కొనుగోళ్లు కొనసాగించాలని, ప్రాసెసర్లు కిలోకు రూ.8 - రూ.12 మద్దతు ధర ఇవ్వాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ కోరింది.

మరోవైపు ఉండవల్లి లో సీఎం చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పార్లమెంటరీ పార్టీ భేటీ జరిగింది. ఈ భేటీలో.. పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించే వ్యూహంపై ఎంపీలకు సీఎం దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా.. ఏరోస్పేస్ ఇండస్ట్రీ, స్పేస్ సిటీ, పోలవరం-బనకచర్ల, హంద్రీనీవా, రాష్ట్రానికి విదేశీ పెట్టుబడులు, అమరావతిలో క్వాంటమ్ వ్యాలీపై చర్చించారు. ఇదే సమయంలో... మామిడిరైతుల విషయాలను పార్లమెంటులో లేవనెత్తడంపై ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు.