భువనేశ్వరి కోసం స్పెషల్ టూర్.. చంద్రబాబు పొలిటికల్ లైఫ్ లో తొలిసారి!
ఎప్పుడూ అధికారిక విధుల్లో బిజీగా ఉండే సీఎం చంద్రబాబు తొలిసారిగా భార్య భువనేశ్వరి కోసం వ్యక్తిగత పర్యటనకు వెళుతున్నారని టీడీపీ నేతలు చెబుతున్నారు
By: Tupaki Desk | 1 Nov 2025 7:00 PM ISTముఖ్యమంత్రి చంద్రబాబు లండన్ పర్యటనపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఎప్పుడూ అధికారిక విధుల్లో బిజీగా ఉండే సీఎం చంద్రబాబు తొలిసారిగా భార్య భువనేశ్వరి కోసం వ్యక్తిగత పర్యటనకు వెళుతున్నారని టీడీపీ నేతలు చెబుతున్నారు. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో చంద్రబాబు ఎక్కువగా పార్టీకే ఎక్కువ సమయం కేటాయించేవారు. ఇక అధికారంలో ఉంటే ప్రభుత్వ విధుల్లో.. ప్రతిపక్షంలో ఉంటే ప్రజల తరఫున పోరాటమే చంద్రబాబు తెలుసు అని చెబుతున్నారు. అంతేకాని ఆయన ఎప్పుడూ కుటుంబం కోసం ప్రత్యేకంగా సమయం కేటాయించేవారు కారని గుర్తు చేస్తున్నారు.
అయితే మంత్రి లోకేశ్ అందుబాటులోకి వచ్చిన తర్వాత, మరీ ముఖ్యంగా లోకేశ్ వివాహం, మనవడు దేవాన్ష్ పుట్టిన తర్వాత కుటుంబంతో ఏటా ఐదు రోజులు విదేశాలల్లో గడపడానికి చంద్రబాబు వెళ్లేవారు. అయితే గత ఏడాది సీఎం అయ్యాక ఈ టూర్ కూడా వాయిదా వేసుకున్నారు. ఏపీ పునఃనిర్మాణం కోసం కృషి చేస్తున్నామని చెబుతున్న సీఎం చంద్రబాబు ఇటీవల పారిశ్రామిక పెట్టుబడుల ఆకర్షణకు పారిశ్రామిక వేత్తలను కలిసేందుకే విదేశీ పర్యటలకు వెళ్లేవారు. మరోవైపు ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ భాగస్వామ్య సదస్సు కోసం చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే దాదాపు 30 దేశాల్లో పారిశ్రామిక వేత్తలను మంత్రులు స్వయంగా ఆహ్వానించారు.
కేంద్ర ప్రభుత్వంతో కలిసి ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న సీఐఐ సదస్సుకు సరిగ్గా రెండు వారాల ముందు చంద్రబాబు వ్యక్తిగత పర్యటనకు వెళ్లడంపై అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సహజంగా ఇలాంటి సమయంలో రాష్ట్రానికి దూరంగా ఉండటానికి ఇష్టపడని చంద్రబాబు ఈ సారి తప్పనిసరి పరిస్థితుల్లోనే లండన్ వెళుతున్నట్లు చెబుతున్నారు. తన జీవిత భాగస్వామి భువనేశ్వరి ప్రపంచ ప్రతిష్ఠాత్మక అవార్డు అందుకుంటున్న సమయంలో అక్కడే ఉండాలని భావించిన సీఎం చంద్రబాబు లండన్ వెళ్లాలని నిర్ణయించుకున్నారని చెబుతున్నారు.
ఎన్టీఆర్ ట్రస్టు మేనేజింగు ట్రస్టీ, హెరిటేజ్ ఫుడ్స్ ఎండీగా ఉన్న భువనేశ్వరికి ఇనిస్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ సంస్థ (ఐవోడీ) డిస్టింగ్విష్డ్ ఫెలో అవార్డుకు ఎంపిక చేసింది. ఈ నెల 4న లండన్ లో ఈ అవార్డును ప్రదానం చేయనుండటంతో చంద్రబాబు కూడా ఆమెతో లండన్ వెళుతున్నారు. మరోవైపు ఐవోడీ డిస్టింగ్విష్డ్ అవార్డు అందుకుంటున్న భువనేశ్వరికి అదే వేదికపై గోల్డెన్ పీకాక్ అవార్డు కూడా అందుకోనున్నారని సమాచారం. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం, ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్పర్సన్ రాజశ్రీ బిర్లా, సన్ ఫార్మా ఎండీ దిలీప్ సంఘ్వీ, గోయాంకా గ్రూప్ సంస్థల చైర్మన్ సంజీవ్ గోయంకా వంటి వారు ఇంతకు ముందు ఈ అవార్డులను అందుకున్నారు. ప్రతిష్ఠాత్మక అవార్డును తీసుకుంటున్న జీవిత భాగస్వామిని అభినందించేందుకు సీఎం తన పనులను పక్కనపెట్టి లండన్ వెళుతున్నారని అంటున్నారు.
