చంద్రబాబు లోకేష్ ఒకేసారి విదేశాలకు !
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఐటీ మంత్రి నారా లోకేష్ ఒకేసారి విదేశాలకు వెళ్తున్నారు.
By: Satya P | 23 May 2026 9:30 AM ISTఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఐటీ మంత్రి నారా లోకేష్ ఒకేసారి విదేశాలకు వెళ్తున్నారు. ఈ ఇద్దరూ మూడు రోజుల పాటు ఏపీకి దూరంగా ఉండబోతున్నారు. ఏపీ కూటమిలో సారధులుగా ఉన్న ఇద్దరు అగ్ర నేతలు ఒకేసారి ఒకే చోటకు వెళ్తున్నారు. అది కూడా అత్యంత కీలకమైన పని మీదనే. ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నారు అంటే సింగపూర్ దేశానికి.అక్కడ జరిగే వరల్డ్ సిటీస్ సమ్మిట్‌కు బాబు లోకేష్ హాజరవుతారు అని అధికార వర్గాలు చెబుతున్నాయి.
పెట్టుబడుల కోసమే :
ఇప్పటికే గత రెండేళ్ళుగా ఏపీకి పెట్టుబడులను పెద్ద ఎత్తున ఆకర్షించడంలో చంద్రబాబు లోకేష్ ఇద్దరూ విజయవంతం అయ్యారు. దేశంలోని మొత్తం పెట్టుబడులలో పాతిక శాతం ఒక్క ఏపీకే వచ్చాయని కూడా కూటమి ప్రభుత్వం తెలియచేసింది. అయితే ఏపీలో ఏకంగా ఇరవై లక్షల మంది దాకా యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పిస్తామని కూటమి ప్రభుత్వ పెద్దలు పదే పదే చెబుతున్నారు. ఆ భారీ హామీని నిలబెట్టుకోవడం కోసమే పెట్టుబడులను ఆకర్షించేందుకు మరోసారి సింగపూర్ టూర్ కి సిద్ధమవుతున్నారని అంటున్నారు.
పారిశ్రామిక దిగ్గజాలతో భేటీ :
సింగపూరులో జూన్ జూన్ 14 నుంచి 16 వరకూ ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి నారా లోకేష్ పర్యటిస్తారని అంటున్నారు. ఈ సందర్భంగా వరల్డ్ సిటీస్ సమ్మిట్‌కు వచ్చే పారిశ్రామిక దిగ్గజాలతో భేటీ అవుతారని తెలుస్తోంది. ఇక చూస్తే ఏపీ ప్రభుత్వానికి సింగపూర్ లో జరిగే వరల్డ్ సిటీస్ సమ్మిట్ లో పాల్గొనమని ఆహ్వానం వచ్చింది అని అంటున్నారు. ఆ దేశంలో జరిగే అత్యంత ప్రతిష్టాత్మకమైన సమ్మిట్ గా దీనిని చెబుతున్నారు.
స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ :
ఏపీ ప్రభుత్వం స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ని అమలు చేస్తోంది. దీని వల్ల పారిశ్రామిక వేత్తలు ఒకసారి ఒప్పందం కుదుర్చుకుంటే ఆ ప్రాజెక్ట్ గ్రౌండ్ అయ్యేంత వరకూ చాలా వేగంగా ప్రభుత్వం తరఫున నుంచి అన్ని రకాలైన అనుమతులు రావడమే కాదు అనేక రకాలైన ప్రోత్సాహకాలు కూడా ఉంటాయి. అంతే కాదు ప్రాజెక్ట్ రియాలిటీ అయ్యేంతవరకూ ప్రభుత్వం అధికారులను సన్నద్ధం చేస్తూ ఉండడం కూడా ఏపీకి ఒక ప్రత్యేకతగా ఉంది. అందుకే ఏపీకి ఉన్న ఈ సానుకూలతను వినియోగించుకోవాలని పారిశ్రామికవేత్తలను చంద్రబాబు లోకేష్ కోరనున్నారని అంటున్నారు. మొత్తం మీద చూస్తే మూడు నుంచి నాలుగు రోజుల పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు లోకేష్ ఏపీకి దూరంగా ఉండడం మాత్రం విశేషంగానే చూడాలి. మరి ఈసారి ఎన్ని పెట్టుబడులు వస్తాయన్నది కూడా చర్చగా ఉంది.
