Begin typing your search above and press return to search.

జగన్ ఆదేశాలు.. చంద్రబాబు ఆచరణ.. లోకేశ్ అమలు! ఇదెక్కడి విడ్డూరం?

టీడీపీ కేడర్ ను అంతలా కలవరపాటుకు గురిచేసిన ఆదేశాలు పాఠశాల విద్యాశాఖలో ఇంగ్లీషు మీడియం అమలు చేయాలనే ప్రభుత్వ ఆదేశాలు కావడం గమనార్హం.

By:  Tupaki Desk   |   17 May 2025 6:00 PM IST
జగన్ ఆదేశాలు.. చంద్రబాబు ఆచరణ.. లోకేశ్ అమలు! ఇదెక్కడి విడ్డూరం?
X

పాలనలో సుదీర్ఘ అనుభవం ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి విధానాలను ఆచరిస్తున్నారా? మాజీ సీఎం జగన్ అంటేనే ఒంటికాలిపై లేచే చంద్రబాబు సీఎంగా జగన్ తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయడానికి కారణమేంటి? ఒకప్పుడు జగన్ ఆదేశాలను తీవ్రంగా వ్యతిరేకించిన చంద్రబాబు.. ఇప్పుడు తన కుమారుడు లోకేశ్ ద్వారానే జగన్ విధానాలు అమలు అయ్యేలా చూస్తున్నారని విమర్శలు ఎదుర్కొంటున్నారు. నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన చంద్రబాబు.. తాను తీవ్రంగా వ్యతిరేకించే మాజీ సీఎం జగన్ తీసుకొచ్చిన జీవోనే అమలు చేయాల్సిరావడం ఏంటో అర్థం కావడం లేదని పరిశీలకులు జట్టు పీక్కుంటున్నారు. ఎక్కడో పొరపాటు జరుగుతోందని అంటున్నారు.

ఏపీ విద్యాశాఖ తాజాగా తీసుకున్న ఓ నిర్ణయం విస్తృత చర్చకు దారితీస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, విద్యాశాఖ మంత్రి లోకేశ్ ప్రతిపక్షంలో ఉండగా వ్యతిరేకించిన అంశాన్ని ఇప్పుడు అమలు చేయాలని నిర్ణయిస్తూ జారీ చేసిన ఆదేశాలు విస్మయానికి గురిచేస్తున్నాయి. ఈ విషయంపై ప్రతిపక్షం వైసీపీ విమర్శలకు ప్రభుత్వ పెద్దలు ఏం సమాధానం చెబుతారంటూ టీడీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అంతేకాకుండా ప్రజల్లో కూడా అబాసుపాలవుతామని ఆందోళన వ్యక్తమవుతోంది.

టీడీపీ కేడర్ ను అంతలా కలవరపాటుకు గురిచేసిన ఆదేశాలు పాఠశాల విద్యాశాఖలో ఇంగ్లీషు మీడియం అమలు చేయాలనే ప్రభుత్వ ఆదేశాలు కావడం గమనార్హం. వైసీపీ అధికారంలో ఉండగా, 2020-21 విద్యాసంవత్సరం నుంచి ఏపీలో ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టింది. ఒకటి నుంచి పదోతరగతి వరకు ఇంగ్లీషు మీడియంలోనే బోధించాలని దశలవారీగా విస్తరించాలని అప్పట్లో జీవో జారీ చేసింది. ఈ ఆదేశాలపై అప్పట్లో టీడీపీతోపాటు బీజేపీ పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేసింది. జనసేన కూడా ఆందోళనలు నిర్వహించింది. పైగా నాటి ప్రతిపక్ష నేతగా ఉన్న ప్రస్తుత సీఎం చంద్రబాబుతోపాటు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ వైసీపీ ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. తెలుగు రాష్ట్రంలో తెలుగు చదువుకోకపోతే ఎలా? అంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు. మరోవైపు కొందరు భాషాభిమానులు ఈ విషయమై కోర్టులకు కూడా వెళ్లారు. ఎవరు ఎన్ని చెప్పినా ముందుకే అన్న నాటి జగన్ ప్రభుత్వం తెలుగు మీడియం కొనసాగిస్తూనే ఇంగ్లీషు మీడియంను ప్రోత్సహించాలని నిర్ణయించింది.

అయితే నాడు ఇంగ్లీషు మీడియంను వ్యతిరేకించిన చంద్రబాబు, పవన్, లోకేశ్ ఇప్పుడు ప్రభుత్వంలో కీలక స్థానాల్లో ఉంటూ పాఠశాలల్లో ఆంగ్ల విద్య బోధనకే మొగ్గు చూపుతుండటం విశేషం. టీడీపీ కూటమి వస్తే మళ్లీ తెలుగు మీడియంలో పాఠాలు చెప్పే అవకాశం వస్తుందని భాషాభిమానులు ఆశించగా, ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలతో వారు మరింత కలత చెందుతున్నట్టు చెబుతున్నారు. ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియం నిర్బంధం చేస్తూ జగన్ ప్రభుత్వం ఇచ్చిన జీవోనే ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా అమలు చేస్తోందని విమర్శలు చేస్తున్నారు.

ప్రస్తుతం రాష్ట్రంలో తెలుగు మీడియంలో బోధన జరగడం లేదు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితిలో మార్పు వస్తుందని ఆశించినా, అలాంటిదేమీ జరగడం లేదు. పైగా పాఠశాలల పునర్వ్యవస్థీకరణ పేరుతో జగన్ ప్రభుత్వంలో జారీ చేసిన జీవో ప్రకారమే చంద్రబాబు సర్కార్ మరో జీవో జారీ చేసింది. దీంతో ఏపీలో తెలుగు విద్యార్థులు తమ భాషలో చదువుకునే అవకాశం కోల్పోతున్నారని భాషాభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచంలో ఎక్కడా, ఏ భాషేయుడికి కూడా లేని దారుణ పరిస్థితి అంటూ అసంతృప్తి చెందుతున్నారు. సొంత రాష్ట్రంలో..సొంత భాషలో చదువుకోలేని దయనీయ స్థితిని పాలకులు కల్పించారని విమర్శలు చేస్తున్నారు.

ప్రస్తుతం చంద్రబాబు సర్కారులో మంత్రి నారా లోకేశ్ తీసుకున్న నిర్ణయంతో ప్రభుత్వ బడుల్లో 1 నుంచి 8 తరగతులు వరకూ నడిపే ప్రాథమికోన్నత పాఠశాలల్లో తెలుగు బోధనకు పోస్టు లేకుండా పోయిందని అంటున్నారు. అంటే తెలుగు విద్యార్థులు తమ సొంత భాషలో చదువుకునే అవకాశం పూర్తిగా లేని పరిస్థితి కల్పించారని అంటున్నారు. దీనివల్ల భవిష్యత్తులో ఎవరూ తెలుగు నేర్చుకోలేరని అంటున్నారు. ఇది విద్యాహక్కు చట్టం - 2009 నియమాలకు ఉల్లంఘించినట్లేనని నిపుణులు చెబుతున్నారు.