వాగ్ధాటి ఉన్న వారే ఎమ్మెల్సీలు..!! టీడీపీలో జోరందుకున్న లాబీయింగ్
శాసనమండలిలో ఖాళీ అవుతున్న రెండు స్థానాలపై కూటమిలో చర్చలు మొదలయ్యాయి. మండలి ఉపాధ్యక్షురాలు జకియా ఖానంతోపాటు ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబు పదవీ కాలం ఈ నెలతో ముగుస్తుంది.
By: Tupaki Political Desk | 26 July 2026 12:00 AM ISTశాసనమండలిలో ఖాళీ అవుతున్న రెండు స్థానాలపై కూటమిలో చర్చలు మొదలయ్యాయి. మండలి ఉపాధ్యక్షురాలు జకియా ఖానంతోపాటు ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబు పదవీ కాలం ఈ నెలతో ముగుస్తుంది. వారిస్థానంలో కొత్తగా ఎవరికి అవకాశం దక్కుతుందనే చర్చ విస్తృతంగా జరుగుతోంది. గవర్నర్ కోటాలో రెండు స్థానాలను భర్తీ చేయనున్నారు. దీంతో కూటమి నేతలకే అవకాశం దక్కనుందని చెబుతున్నారు. అయితే ఈ రెండు స్థానాలకు పోటీ తీవ్రంగా ఉందని వ్యాఖ్యానిస్తున్నారు. ప్రస్తుతం శాసనమండలిలో విపక్షం వైసీపీకే మెజార్టీ ఉంది. మొత్తం 58 స్థానాలు ఉండగా, అధికార కూటమికి కేవలం 12 మంది మాత్రమే ఉన్నారు. విపక్షం వైసీపీకి 36 స్థానాలు ఉన్నాయి. దీంతో త్వరలో గవర్నర్ కోటాలో భర్తీ చేసే రెండు ఖాళీల్లో ఎవరికి చాన్స్ వస్తుందనేది ఉత్కంఠ రేకెత్తిస్తోంది.
సభలో విపక్షానికి బలం ఉండటంతో సమావేశాల సమయంలో ప్రభుత్వం కొంతవరకు ఇబ్బందులు పడుతోంది. విపక్షాన్ని సమర్థంగా ఎదుర్కొనేందుకు మంత్రుల్లో సగం మందిని మండలిలో మొహరించాల్సివస్తోందని అంటున్నారు. దీంతో ఈ నెలలో ఖాళీ అయ్యే రెండు స్థానాల్లో వాగ్దాటి ఉన్న నేతలను ఎంపిక చేయాలనే సూచనలు వస్తున్నాయి. ఇందులో భాగంగా పలువురి పేర్లను పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం అధికార కూటమికి కేవలం 12 మంది మాత్రమే ఉన్నారు. వీరిలో బీజేపీ తరఫున కేవలం ఒకరే ప్రాతినిధ్యం వహిస్తుండగా, జనసేన నుంచి ఇద్దరు నేతలు ఉన్నారు. దీంతో త్వరలో ఖాళీ అయ్యే ఎమ్మెల్సీ స్థానాల్లో ఒకటి తమ పార్టీకి కేటాయించాలని ఆ పార్టీ నేతలు కోరుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
మరోవైపు గత ఎన్నికలలో సీట్లు త్యాగం చేసిన వారితోపాటు నామినేటెడ్ పదవుల హామీ పొందిన చాలా మంది తెలుగుదేశం పార్టీ నేతలు ఎమ్మెల్సీ పదవుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. తమ కష్టనష్టాలు అధినేత చంద్రబాబుకు తెలుసు అన్న ధీమాతో వ్యవహరిస్తున్నారు. అదే సమయంలో యువనేత లోకేశ్ ఆశీస్సులు పొందడానికి ప్రయత్నాలు చేస్తున్నారని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో అధినేత, యువనేత నిర్ణయం ఎలా ఉంటుందనేది ఉత్కంఠ రేపుతోంది. ప్రస్తుతం టీడీపీ అంతర్గత వర్గాలలో జరుగుతున్న చర్చ ప్రకారం ఎమ్మెల్సీ ఆశావహుల లిస్టు భారీగానే ఉందని అంటున్నారు. సామాజిక, ప్రాంతీయ సమీకరణాలతో ఎవరికి అవకాశం ఇస్తారనేదే స్పష్టం కావడం లేదని చెబుతున్నారు.
టీడీపీలో పదవుల కోసం ఎదురుచూస్తున్న నేతల్లో కొందరు సామాజిక, ప్రాంతీయ సమీకరణాలతో తమ పేర్లు ముందున్నట్లు భావిస్తున్నారు. ఇలాంటి వారిలో పార్టీ వాయిస్ ను గట్టిగా వినిపించే వర్ల రామయ్య, రాయలసీమకు చెందిన బీసీ నేత సుగవాసి ప్రసాద్ బాబు పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. అదే సమయంలో మాజీ మంత్రి దేవినేని ఉమా, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్లు ముందువరుసలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నతోపాటు పార్టీ కార్యాలయం కోటాలో టీడీ జనార్దన్, కంభంపాటి రామ్మోహన్, సత్యనారాయణరాజు వంటివారు ఎమ్మెల్సీ పదవులను ఆశిస్తున్నారు.
పార్టీ నేతల నుంచి పదవుల కోసం తీవ్ర ఒత్తిడి ఉండటంతో సీఎం చంద్రబాబు, వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేశ్ ఎవరికి ఎలాంటి హామీ ఇవ్వడం లేదని చెబుతున్నారు. అదే సమయంలో ఎమ్మెల్సీ ఖాళీల విషయమై మిత్రపక్షాలతో చర్చించాల్సిన అవసరం ఉన్నందున కాస్త ఓపిక పట్టాలని సూచిస్తున్నారని చెబుతున్నారు. దీంతో టీడీపీకి చెందిన కొందరు నేతలు ఉప ముఖ్యమంత్రి పవన్ ఆశీస్సులు పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు. పవన్ ఒక మాట చెబితే సీఎం కాదనలేరనే భావనతో అటునుంచి నరుక్కు వస్తే తమకు పదవి గ్యారెంటీ అనే భావనలో కొందరు నేతలు ఉన్నారని చెబుతున్నారు. మొత్తానికి టీడీపీలో ఎవరికి చాన్స్ వస్తుందో కానీ ప్రస్తుతం నేతలు పోటీ పడుతున్న తీరు మాత్రం ఉత్కంఠ రేకెత్తిస్తోందని అంటున్నారు.
